టెండర్లలో పచ్చపాతం | - | Sakshi
Sakshi News home page

టెండర్లలో పచ్చపాతం

Oct 24 2026 5:41 AM | Updated on Oct 24 2026 5:41 AM

నెహ్రూనగర్‌: గుంటూరు నగర పాలక సంస్థ (జీఎంసీ) పరిధిలో అభివృద్ధి పనుల కేటాయింపులు, టెండర్ల ప్రక్రియ అధికార పార్టీ కనుసన్నల్లో సాగుతూ తీవ్ర దుమారం రేపుతోంది. ప్రజాధనంతో బడా కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు అధికారులు, టీడీపీ నేతలు కుమ్మకై ్క నిబంధనలను యథేచ్ఛగా తుంగలో తొక్కుతున్నారు. నగరంలో రూ. 40 కోట్ల అంచనా వ్యయంతో 34 కిలోమీటర్ల మేర చేపట్టాల్సిన 29 బీటీ రోడ్ల పనులను అంతర్జాతీయంగా తారు ధరలు పెరిగాయన్న సాకుతో ఏకంగా ‘సీసీ’ రోడ్లుగా మార్చేందుకు అడ్డగోలు లాబీయింగ్‌ నడుస్తోంది. పెద్దలకు లబ్ధి చేకూర్చేందుకు ‘వర్క్‌ నేచర్‌’నే మారుస్తూ దోపిడీకి గేట్లు తెరుస్తున్నారు. బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక ‘ప్లాంట్‌’ ఉండాలన్న కఠిన నిబంధనలను తెరపైకి తెచ్చి, ముందస్తు వ్యూహం ప్రకారమే కేవలం ఐదారుగురు బడా కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా అధికారులు చక్రం తిప్పారు. టెండర్‌ నిబంధనల ప్రకారం మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా నిర్దేశిత గడువులోగా కాంట్రాక్టరే లాభనష్టాలు భరించి పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే, అనుకూల కాంట్రాక్టర్లకు నష్టం రాకూడదనే ఉద్దేశంతో పనులను నెలల తరబడి సగంలోనే నిలిపివేసి, సాంకేతికంగా నిబంధనలకు విరుద్ధమైనా బీటీ రోడ్లను సీసీ రోడ్లుగా మార్చాలంటూ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా స్థానిక ఎస్‌వీఎన్‌ కాలనీ ప్రధాన రహదారిలో సగం భాగం బీటీ రోడ్డు వేసి, మిగిలిన భాగాన్ని నిబంధనలకు విరుద్ధంగా సీసీ రోడ్డుగా మార్చేందుకు పావులు కదిపారు. ఇందుకు సంబంధించిన అనుమతులు కూడా మంజూరయ్యాయి. బీటీ రోడ్డు స్థానంలో సీసీ రోడ్డు వేయడమే తరువాయి. ఇదే ప్రాంతంలో మరో మూడు నాలుగు రోడ్లను కూడా ఇదే తరహాలో మార్చేసి ఖజానాకు గండి కొట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఓవైపు పెద్ద కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తూ వారి అక్రమ డిమాండ్లకు తలొగ్గేందుకు సిద్ధమవుతున్న అధికారులు, మరోవైపు సాధారణ చిన్న కాంట్రాక్టర్లను మాత్రం ముప్పుతిప్పలు పెడుతున్నారు. చిన్నపాటి కారణాలతో చిన్న కాంట్రాక్టర్ల పనులను రద్దు చేయడం, వారి ఈఎండీ (ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్‌) మొత్తాలను జప్తు చేస్తూ జీఎంసీ ఖజానాకు తరలిస్తామంటూ బెదిరింపు నోటీసులు జారీ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. బడా కాంట్రాక్టర్లు టెండర్‌ ఒప్పందాలను ఉల్లంఘించి పనులు నిలిపివేసినా చోద్యం చూస్తున్న యంత్రాంగం.. చిన్న కాంట్రాక్టర్లపై మాత్రం కక్షసాధింపు ధోరణి ప్రదర్శిస్తుండటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. జీఎంసీలో టెండర్లలో పాల్గొనాలంటే మొదట ఆన్‌లైన్‌లో ఒక శాతం ఈఎండీ, పని ఖరారైన తర్వాత అగ్రిమెంట్‌ సమయంలో మరో 1.5 శాతం డీడీ రూపంలో డిపాజిట్‌ చేయాలి. అనంతరం పనులు పూర్తయి బిల్లు చెల్లించేటప్పుడు మరో 2.5 శాతాన్ని ఎఫ్‌ఎస్‌డీ (ఫర్దర్‌ సెక్యూరిటీ డిపాజిట్‌) కింద కట్‌ చేస్తారు. ఇలా మొత్తం పని విలువలో 5 శాతం నిధులు దాదాపు రెండేళ్ల మెయింటెనెన్స్‌ పీరియడ్‌ ముగిసేవరకు జీఎంసీ వద్దే ఉండిపోతాయి. ఆ గడువు తీరినా అధికారులు కాళ్లరిగేలా తిప్పుకుంటున్నారని, లంచాలు ఇచ్చుకోలేక పలువురు చిన్న కాంట్రాక్టర్లు ఆ సొమ్మును వదులుకోవాల్సిన దుస్థితి దాపురించిందని ఆరోపిస్తున్నారు.

సమగ్ర విచారణకు డిమాండ్‌

నిబంధనల ప్రకారం టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టరే పెరిగిన ధరల భారాన్ని మోయాల్సి ఉండగా, జీఎంసీ పెద్దలు మాత్రం ప్రజాధనాన్ని దోచిపెట్టేందుకు నిబంధనలనే మార్చేస్తున్నారు.

● బడా బాబుల కోసమే

జీఎంసీ నిబంధనలు

● తారు ధరల సాకుతో

బీటీని సీసీగా మార్చే లాబీయింగ్‌

● ఎస్‌వీఎన్‌ కాలనీలో

సగం బీటీ.. సగం సీసీ రోడ్డు

● చిన్న కాంట్రాక్టర్లపై ‘వర్కు చేయకపోతే

ఈఎండీల జప్తు’ వేధింపులు

● ప్రజాధనంతో పెద్ద కాంట్రాక్టర్ల

జేబులు నింపే కుతంత్రం

పెద్దోళ్ల కోసమే నిబంధనలు

చిన్న కాంట్రాక్టర్లపై వేధింపులు

5 శాతం నిధులు బ్లాక్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement