కూటమి పాలనలో అంతా నిర్వీర్యం | - | Sakshi
Sakshi News home page

కూటమి పాలనలో అంతా నిర్వీర్యం

Oct 24 2026 5:41 AM | Updated on Oct 24 2026 5:41 AM

గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తా

కొరిటెపాడు(గుంటూరు): కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని వైఎస్సార్‌ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త అంబటి రాబాబు పేర్కొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 57, 58, 59, 60 డివిజన్లలో శుక్రవారం గుంటూరు మేయర్‌ అభ్యర్థి తాడికొండ శ్రీదేవి, ఆయా డివిజన్ల కార్పొరేటర్‌ అభ్యర్థులతో కలిసి ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. విద్యానగర్‌ ఆర్చి సెంటర్‌ నుంచి నార్నె టవర్స్‌, హనుమయ్య నగర్‌, కొరిటెపాడు వినాయ స్వామి గుడి, కొరిటెపాడు లైబ్రరీ సెంటర్‌, గాంధీబొమ్మ సెంటర్‌, సాకేతపురం మెయిన్‌ రోడ్‌, ముత్యాలరెడ్డి నగర్‌ మెయిన్‌ రోడ్‌ మీదుగా సుగాలి కాలనీ వరకు ప్రచారం కొనసాగింది. పార్టీ ముఖ్య నాయకులు నేరుగా ప్రజలను కలిసి మాట్లాడారు. ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అడుగడుగునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ గతంలో వైఎస్సార్‌ సీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. నిత్యావసర ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వంలో అరాచకాలు, దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌ సీపీ శ్రేణులను భయపెడుతున్నారన్నారు. పార్టీ శ్రేణులు మాత్రం కూటమి నేతలకు ఏమాత్రం తలొగ్గకుండా ఎదురు నిలుస్తున్నారని గుర్తు చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పుతో కూటమి నేతలకు బుద్ధి వస్తుందన్నారు.

మేయర్‌ అభ్యర్ధి తాడికొండ శ్రీదేవి మాట్లాడుతూ తొలిసారిగా మేయర్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, అందరూ ఆదరించాలని అభ్య ర్థించారు. తాను గెలిస్తే అందరి సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తానని, నగరాభివృద్ధికి చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. రెండు అమూల్యమైన ఓట్లను ఫ్యాన్‌ గుర్తుకు వేసి, తనకు మేయర్‌గా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ అభ్యర్థులు వడ్డే కరుణాకరరెడ్డి, మారంరెడ్డి కోటేశ్వరి, ధనావత్‌ వెంకటేశ్వర్లు నాయక్‌, మల్లిశెట్టి దీనమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement