అక్రమ కేసులపై ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

అక్రమ కేసులపై ఆగ్రహం

Sep 27 2026 3:22 AM | Updated on Sep 27 2026 3:22 AM

మేమే స్టేషన్‌కు వస్తాం ..అరెస్టు చేసుకోండి అర్ధరాత్రి అక్రమ అరెస్టులను చూస్తూ ఊరుకోం దౌర్జన్యాలు కొనసాగితే రాష్ట్రవ్యాప్త ఉద్యమం వైఎస్సార్‌ సీపీ నేతల హెచ్చరిక

సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ పోలీసుల తీరుపై వైఎస్సార్‌ సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 21న శాప్‌ కార్యాలయం వద్ద జరిగిన శాంతియుత నిరసనలో పాల్గొన్న వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. ఒక సంఘటనపై వేర్వేరు స్టేషన్లలో ఏడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం, అర్ధరాత్రి ఇళ్లకు వెళ్లి వేధింపులకు గురిచేయడం తెలిసిందే. అసలు కేసులో ఎంతమంది ఉన్నారో పోలీసులు చెప్పకపోవడం, పార్టీలో కీలకంగా ఉన్న వారిని వేధిస్తుండటంతో వైఎస్సార్‌ సీపీ దీన్ని ఎదుర్కోవాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల వైఎస్సార్‌ సీపీ నేతలు పెద్దఎత్తున విజయవాడ చేరుకుని పోలీసు కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ సీపీ అందుబాటులో లేకపోవడంతో డీసీపీ సరితకు వినతిపత్రం ఇచ్చారు. డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా నియామకాల్లో అక్రమాలకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా.. ప్రశ్నిస్తున్న వారిని కేసులు, అరెస్టులతో గొంతు నొక్కాలని చూస్తోందని వారు ఆక్షేపించారు. వెన్నుపోటు పార్టీ కనుసన్నల్లోనే పోలీస్‌ యంత్రాంగం రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, అర్ధరాత్రిళ్లు ఇళ్లలోకి వెళ్లి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తోందని మండిపడ్డారు.

టీచర్ల ముసుగులో గూండాలకు

ఎలా అనుమతిచ్చారు?

తమ పార్టీ నిర్వహించే శాంతియుత నిరసనలకు అనుమతి నిరాకరించి, టీచర్ల ముసుగులో వచ్చిన గూండాలకు ఎలా అనుమతించారని వైఎస్సార్‌ సీపీ నేతలు పోలీసులను ప్రశ్నించారు. ఎంజీ రోడ్డులో పర్మిషన్‌ లేదంటూనే టీడీపీ, జనసేనల ర్యాలీలకు అనుమతులివ్వడంపై నిలదీశారు. తమ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగులు, దివ్యాంగులపై దాడులు జరిగాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని డీసీపీని కోరారు. మరోవైపు తమ పార్టీ వారిపై సెక్షన్‌ 307తో పాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి అరెస్టులు, పోలీస్‌ స్టేషన్లలో తీసుకుంటున్న చర్యలు ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధమని గుర్తు చేశారు. అధికార పార్టీ అండతో శాంతిభద్రతలను కాలరాస్తున్న పోలీసుల వైఖరిని ప్రజల ఎదుటే నిలదీస్తామని, చట్టాన్ని ఉల్లంఘించే అధికారులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కేసుల విషయంలో పునరాలోచన చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తామని, కేసుల్లో ఎవరున్నారో చెబితే వారంతా పోలీసు స్టేషన్‌కు వచ్చేందుకు సిద్ధమని వారు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement