గుంటూరు వెస్ట్: పొన్నూరు నియోజకవర్గం మన్నవ గ్రామంలో ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు తొలగించారనే ఆరోపణలపై జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ విచారణకు ఆదేశించారు. మన్నవ గ్రామ ఎంపీటీసీ సభ్యుడు బొనిగల అమరేంద్ర ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు, అలాగే గత నెల 5వ తేదీన సాక్షి దినపత్రికలో వచ్చిన కథనం ఆధారంగా జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అర్హులైన ఓటర్ల పేర్లను పునరుద్ధరించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో అమరేంద్ర ప్రసాద్ కోరారు. ఎంపీటీసీ సభ్యుని భార్య సహా సుమారు 173 మంది ఓటర్ల పేర్లు ఎటువంటి నోటీసులు లేకుండా అధికారులు తొలగించారు. సర్ ప్రక్రియలో మరిన్ని పేర్లు తొలగింపునకు గురయ్యాయి. వీటితోపాటు బీఎల్‌వో లాగిన్‌ను అనధికార వ్యక్తులు వాడుతూ జోక్యం చేసుకోవడం తదితర అంశాలు ఫిర్యాదులో ప్రస్తావించారు. స్పందించిన కలెక్టర్... విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని 88–పొన్నూరు ఈఆర్వో (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్)ను ఆదేశించారు.
నెహ్రూనగర్: గుంటూరు జిల్లాలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చింతా ప్రతాప్‌రెడ్డి గురు, శుక్రవారాల్లో పర్యటించనున్నారు. ఈ రెండు రోజులు జిల్లా పరిధిలోని పలు సంక్షేమ వసతిగృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలను ఆయన తనిఖీ చేయనున్నారు.


