నాణ్యత లేని బ్యాగులు వెనక్కి తీసుకుంటాం | - | Sakshi
Sakshi News home page

నాణ్యత లేని బ్యాగులు వెనక్కి తీసుకుంటాం

Aug 23 2026 1:28 AM | Updated on Aug 23 2026 1:28 AM

నాణ్యత లేని బ్యాగులు వెనక్కి తీసుకుంటాం జీఎస్టీ చెల్లించని సంస్థలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి

సమగ్రశిక్ష ఏపీసీ వి.పద్మావతి

గుంటూరు ఎడ్యుకేషన్‌: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్ల ద్వారా పంపిణీ చేసిన పుస్తకాల బ్యాగుల నాణ్యతపై ‘‘సాక్షి’’లో శుక్రవారం ప్రచురించిన ఫొటో ఫీచర్‌కు స్పందన లభించింది. నాసిరకం బ్యాగులు చిరిగిపోవడంతో విద్యార్థులు పడుతున్న అవస్థలను వివరిస్తూ ఫొటో ఫీచర్‌ ప్రచురితమైంది. సమగ్రశిక్ష ఏపీసీ వి.పద్మావతి దీనిపై మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 89,187 మంది విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశామని శనివారం తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు లేని బ్యాగులను వెనక్కు తీసుకుంటామని పేర్కొన్నారు.

జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ

గుంటూరు వెస్ట్‌: ప్రభుత్వానికి జీఎస్టీ చెల్లించని సంస్థలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని వీసీ హాలులో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో జేసీ మాట్లాడుతూ రాష్ట్ర జీఎస్టీ లక్ష్యాలను సాధించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించాలన్నారు. శాఖల మధ్య సమన్వయం ఉండాలని పేర్కొన్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పనులు పూర్తి చేసిన అనంతరం బిల్లులు అప్‌లోడ్‌ చేసే సమయంలో జీఎస్టీ వివరాలపై సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. జీఎస్టీ చెల్లించని సంస్థలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలన్నారు. అందుకు తగిన సమాచారంతో శాఖల మధ్య సమన్వయం అవసరమని స్పష్టం చేశారు. జీఎస్టీ జాయింట్‌ కమిషనర్‌ గీతా మాధురి మాట్లాడుతూ జీఎస్టీ చెల్లించని సంస్థల బ్యాంక్‌ ఖాతాల వివరాలు అందించాలని కోరుతున్నామని చెప్పారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌ ప్రదీప్‌ కుమార్‌, జిల్లా ఎస్‌జీఎస్‌డబ్ల్యూ అధికారి రామలింగారెడ్డి, నగర పాలక సంస్థ ఈఈ సుందరరామిరెడ్డి, తెనాలి మున్సిపల్‌ కమిషనర్‌ జె.రామ అప్పల నాయుడు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement