వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య లేదంటే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరిక డీఎస్సీ అక్రమాలపై చర్చకు రావాలని మంత్రికి సవాల్ గుంటూరు నగరంలో కదం తొక్కిన విద్యార్థులు, యువత ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిన నిరసన ర్యాలీ స్కిట్లు, ఫ్లాష్ మాబ్‌లు, చెవిలో పూలు, సంకెళ్లు, ఉరితాళ్లతో గోడు వెళ్లబోసుకున్న డీఎస్సీ అభ్యర్థులు ప్రజలను ఆలోచింపజేసిన వినూత్న కార్యక్రమాలు
విద్యాశాఖ మంత్రి రాజీనామాకు వైఎస్సార్ సీపీ విద్యార్థి, యువజన విభాగాల డిమాండ్
గుంటూరు ఎడ్యుకేషన్ విద్యార్థుల సమస్యల పరిష్కారంలో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్య ధోరణిపై నిరసన వెల్లువెత్తింది. విద్యార్థులు, యువజనులు గుంటూరు నగరంలో కదం తొక్కారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి, యువజన విభాగాలు సంయుక్త ఆధ్వర్యంలో ర్యాలీ మంగళవారం నగరంలోని శంకర్‌విలాస్ సెంటర్ నుంచి లాడ్జి సెంటర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకు భారీ స్థాయిలో సాగింది. వైఎస్సార్ సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగ అధ్యక్షుడు పానుగంటి చైతన్య నేతృత్వంలో ఆయా విభాగాల నాయకులు, విద్యార్థులు, యువత, నిరుద్యోగులు పాల్గొన్నారు. మెగా డీఎస్సీ ద్వారా దగా పడిన అభ్యర్థులు ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో హాజరై తమ స్కిట్ల ద్వారా సర్కారు వైఖరిని ప్రజలకు వివరించారు. పేకాట, తాడు లాగుడు పోటీలు, స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో రైడింగ్‌లు, సంకెళ్లు, ఉరితాళ్లు, ఫ్లాష్ మాబ్, చెవిలో పూలు తదితర కార్యక్రమాలు ప్రజల్లో ఆలోచన రేకెత్తించాయి.
పేద విద్యార్థులు, యువతకు అన్యాయం
ఈ సందర్భంగా పానుగంటి చైతన్య మాట్లాడుతూ... నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తరహాలోనే డీఎస్సీ అక్రమాలకు నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలా చేస్తేనే పారదర్శకత, నిజమైన జవాబుదారీతనం ఉన్నట్లని పేర్కొన్నారు. ఆధారాలు ఉన్నాయని చూపించినా లోకేష్‌కు కనిపించడం లేదన్నారు. లక్షలాది మంది జీవితాలతో ఈ అంశం ముడిపడి ఉందని గుర్తుచేశారు. డీఎస్సీ నిర్వహణ లోపాలమయంగా ఉందని, పేపరు లీకేజీ జరిగిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్ష్యాధారాలతో నిరూపించినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని ఆయన తప్పుబట్టారు. రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, నిరుద్యోగ భృతి విషయంలోనూ ప్రభుత్వం విద్యార్థులను, యువతను మోసగించిందన్నారు. చంద్రబాబు, లోకేష్‌లు దగా చేస్తున్నారని మండిపడ్డారు. పేద విద్యార్థులకు చదువు, ఉద్యోగాలు దక్కకుండా లోకేష్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్‌లు ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు. ఫీజుల కోసం విద్యార్థులు, నిరుద్యోగ భృతి లేక యువత ప్రయివేట్ బైకు రైడ్ యాప్‌లలో, కూలీలుగా పనికి వెళుతున్నారని తెలిపారు. విద్యార్థులు, యువత తిరుగుబాటు చేసి కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపకముందే గౌరవంగా నారా లోకేష్ రాజీనామా చేయాలని హితవు పలికారు. దమ్ముంటే చర్చకు సిద్ధం కావాలని లోకేష్‌కు సవాల్ విసిరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగ జిల్లా, నగర అధ్యక్షులు సీహెచ్ వినోద్, రవి, యువజన విభాగ జిల్లా, నగర అధ్యక్షులు ఉత్తేజ్, కోటి, విద్యార్థి విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గంటి, విఠల్, జిల్లా ఉపాధ్యక్షుడు జగదీష్, జిల్లా ప్రధాన కార్యదర్శులు రాజేష్, మస్తాన్, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాజి, జిల్లా కార్యదర్శులు కరీం, కిరణ్, సాజిద్, అరుణ్, మంగళగిరి అధ్యక్షుడు సందీప్, తాడికొండ నాగరాజు, తెనాలి శామ్యూల్, హోసన్న, పత్తిపాడు కెనడి, పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షుడు భాను, యువజన విభాగం పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షుడు శశి, నగర ప్రధాన కార్యదర్శి దూపాటి అనిల్ తదితరులు పాల్గొన్నారు.


