నీటి మోటార్ల చోరీ ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

నీటి మోటార్ల చోరీ ముఠా అరెస్ట్‌

Jul 29 2026 1:46 AM | Updated on Jul 29 2026 1:46 AM

నగరంపాలెం(గుంటూరు వెస్ట్‌): నీటి మోటార్లను దొంగలించే ముఠాను పొన్నూరు గ్రామీణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుంటూరు జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలోని హాల్‌లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ వెల్లడించారు. రెండు నెలలుగా పొన్నూరు, చేబ్రోలు, తెనాలి, చుండూరు పరిధిలో రోడ్ల వెంట పొలాల్లో నీటి మోటార్లు అపహరణకు గురవుతున్నాయి. దీనిపై బాధిత రైతుల వరుస ఫిర్యాదులతో ఆయా పోలీస్‌స్టేషన్లల్లో కేసులు నమోదు చేశారు. పొన్నూరు గ్రామీణ సీఐ పి. కృష్ణయ్య నేతృత్వంలో ఎస్‌ఐ వి.శ్రీహరి ప్రత్యేక బృందాలతో గాలించారు. బ్రాహ్మణకోడురు గ్రామ శివార్లల్లో తాడికొండ ఫణిదరం గ్రామ వాసులైన తాడిశెట్టి నాగేశ్వరరావు, తాడిశెట్టి వంశీ, ఊటుకూరి చరణ్‌వంశీ, మిండల సాంబశివరావు, కటారి సాంబశివరావు, పొన్నూరు టౌన్‌ నేతాజీనగర్‌లో ఉంటున్న అఖిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం ఒప్పుకోవడంతో ముఠాలోని ఆరుగురితోపాటు దొంగిలించిన మోటార్లను కొనుగోలు చేసిన గుంటూరు రూరల్‌ మండలం పెదపలకూరు గ్రామ వాసి మరియప్పన్‌ పెరియసామిని సైతం అరెస్ట్‌ చేశామన్నారు. వారి నుంచి రూ.15.33 లక్షలు ఖరీదు చేసే 91 నీటి మోటర్లు, రూ.20 వేలు విలువ చేసే 18 కిలోల కాపర్‌ వైరు, రెండు కార్లు, ఆటో, రెంచీలు, ఇనుపరాడ్‌ స్వాధీనం చేసుకున్నారు.

వీరంతా రోజు కూలీలే..

ఈ ముఠాకు తాడిశెట్టి నాగేశ్వరరావు కీలకం. ఇతనిపై నల్లపాడు, తాడికొండ పోలీస్‌ స్టేషన్లలో కేసులు ఉన్నాయని అన్నారు. పొన్నూరు పట్టణం డీవీసీ కాలనీలో ఉంటున్న మహిళతో అతనికి వివాహేతర సంబంధం ఉందన్నారు. సుమారు ఆరు నెలలు నుంచి ఆమె వద్దకు వచ్చేవాడని చెప్పారు. ఈ క్రమంలో అతనికి బంధువులైన పెయింట్‌ పనులకు వెళ్లే తాడిశెట్టి వంశీ, ఊటుకూరి చరణ్‌ వంశీలు ఏకమై, ఆటోడ్రైవర్‌ అయిన తాడిశెట్టి వంశీ ఆటోలో పొన్నూరు వెళ్లి మద్యం తాగేవారని చెప్పారు. వీరితోపాటు మిగతా ఇద్దరు కల్సి రాత్రిళ్లు పొలాల్లో విద్యుత్‌ మోటార్లు దొంగిలించేవారు. అనంతరం వాటిని విక్రయించి సొమ్ము చేసుకునేవారు. పొన్నూరు గ్రామీణ పీఎస్‌లో నాలుగు కేసుల్లో 47 మోటార్లు, తెనాలి గ్రామీణ పీఎస్‌లో ఆరు కేసుల్లో 26 మోటార్లు, చేబ్రోలు పీఎస్‌లో మూడు, పొన్నూరు పట్టణ పీఎస్‌లో తొమ్మిది, చుండూరు పీఎస్‌లో ఆరు దొంగలించారని అన్నారు. ఈ కేసుని ఛేదించిన పొన్నూరు గ్రామీణ పీఎస్‌ సీఐ పి.కృష్ణయ్య, ఎస్‌ఐ వి.శ్రీహరి, హెడ్‌కానిస్టేబుల్‌ వి.నరేష్‌, కానిస్టేబుళ్లు కె.రవి, బి.వెంకటశివయ్య, జి.సుధీర్‌, హోంగార్డు ఎం.రాజేష్‌, సీసీ కెమెరాల విభాగపు ఏఎస్‌ఐ రామదాస్‌రెడ్డి, టవర్‌ లోకేషన్‌ వింగ్‌ సీహెచ్‌.రాముని జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంసాపత్రాలు అందించారు.

రూ.15.33 లక్షల విలువ చేసే

91 మోటార్లు స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement