పరిశీలించి చర్యలు
ఎక్కువగా సెలవుల్లోనే జిల్లా ఉన్నతాధికారి
విధులకు హాజరు కాకుండా సొంత పనుల్లో బిజీబిజీ
కూటమి నేతలతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్న ఓ ఎంవీఐ
నిత్యం వ్యాపారాల్లో మునిగిపోయిన మరో ఎంవీఐ
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): గుంటూరు జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో కొందరు అధికారుల విధుల నిర్వహణపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు (ఎంవీఐలు) కార్యాలయానికి క్రమం తప్పకుండా హాజరు కావడం లేదని, ప్రజలకు సేవలు అందించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వర్ణభారతి నగర్‌లో ఉన్న జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో జిల్లా రవాణా అధికారి (డీటీసీ), రోడ్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ (ఆర్టీవో), నలుగురు ఎంవీఐలు పనిచేస్తున్నారు. తెనాలి, మంగళగిరి ఆర్టీఏ కార్యాలయాల్లో మరో ఇద్దరు ఎంవీఐలు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే జిల్లా ఉన్నతాధికారి తరచూ సెలవుల్లో ఉంటున్నారని, నెలలో దాదాపు సగం రోజులు రాకపోవడంతో కార్యాలయ నిర్వహణపై ప్రభావం పడుతోందని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సేవలకు అదనపు వసూళ్లు
గతంలో ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ ప్రక్రియలో పారదర్శకత ఉండేదని, ప్రస్తుతం మాత్రం కొన్ని అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో లక్షకు పైగా రవాణా వాహనాలు ఉండగా, ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ల జారీ సమయంలో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని కొందరు ఆరోపిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం గుంటూరులో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను మంగళగిరి, తెనాలి కార్యాలయాలకు మళ్లిస్తున్నారు. ఇక్కడైతే లైసెన్స్‌లు రావని పేర్కొంటూ ప్రభుత్వ ఫీజులకు అదనంగా రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎల్‌ఎల్‌ఆర్‌కు రూ.480, డ్రైవింగ్ లైసెన్స్‌కు రూ.1,150 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
ఎంవీఐల పనితీరుపై విమర్శలు
ఒక ఎంవీఐ కార్యాలయానికి క్రమం తప్పకుండా రాకుండా, స్థానిక రాజకీయ నాయకులతో ఎక్కువ సమయం గడుపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. కూటమి నేతలు, ఒక ఎమ్మెల్సీతో పరిచయాలు ఉండటంతో ఆడిందే ఆటగా వ్యవహరిస్తున్నారు. సంతకం చేసి వెళ్లిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో ఎంవీఐ ఆరోగ్య కారణాలను చూపుతూ విధులకు దూరంగా ఉంటూ, వ్యక్తిగత వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై సంబంధిత అధికారుల స్పందన మాత్రం అందుబాటులో లేదు. జిల్లాలో అవసరమైన 15 మంది ఎంవీఐల స్థానంలో ప్రస్తుతం ఆరుగురు మాత్రమే పనిచేస్తున్నారు. ప్రజలకు సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు.
ఈ ఆరోపణలపై జిల్లా రవాణాశాఖ అధికారి (డీటీసీ) కె. సీతారామిరెడ్డి స్పందిస్తూ ‘‘మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు విధులకు హాజరుకావడం లేదనే విషయం మా దృష్టికి రాలేదు. దీనిపై పూర్తిస్థాయిలో పరిశీలన జరిపి, అవసరమైతే సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి వివరణ కోరుతాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలితే తగిన చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు.


