ఏఎన్‌యూలో అడ్డగోలుగా పదవుల పందేరం 23 నెలల తాత్కాలిక పాలనలో నచ్చినవారికి అందలం ఒక విభాగంలో ఉద్యోగికి ఏకంగా 12 రకాల బాధ్యతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు పాఠాలు బోధించేవారు లేరని ఆవేదన ఇదీ చంద్రబాబు సర్కారు వచ్చాక వర్సిటీలో దుస్థితి
ఎంత చెప్పినా అంతే...
ఏఎన్‌యూ (పెదకాకాని): ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో తాత్కాలిక పరిపాలనలో సొంత సామాజిక వర్గానికే పదవులన్నీ పప్పుబెల్లాల్లా పంచుతున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏక కాలంలో ఒకరికి పలు బాధ్యతలు అప్పగించడం వలన వారు తరగతులు నిర్వహించలేకపోతున్నారనేది స్పష్టమవుతోంది. కూటమి పాలనలో ఎక్కువ పదవులు అనుభవిస్తున్న వారు ఆర్థిక అంశాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాత్కాలిక పాలకుల తీరు చూస్తే వర్సిటీలో పదవులు అనుభవించే వారు మనవారేనా... అయితే అప్పగించెయ్ అనేలా పరిస్థితి మారింది. సాక్షాత్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సొంత నియోజకవర్గంలో ఉన్న విశ్వవిద్యాలయంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఒక్కరికే 12 ఉద్యోగ బాధ్యతలు
ఏఎన్‌యూలో రీసెర్చ్ సెల్ కో ఆర్డినేటర్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి ఏకకాలంలో 12 ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సామాజిక న్యాయం ఏ విధంగా అమలు చేస్తున్నారో దీని వలన తెలుస్తోంది. ఈ వ్యక్తి 12 సంవత్సరాలుగా వర్సిటీలోని పరీక్షా భవన్‌లో యూజీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఏసీటీఏగా (డిగ్రీ జవాబు పత్రాల కోడింగ్) విధులు నిర్వహిస్తున్నారు. ఆయనే ఆన్‌లైన్ పరీక్షల ఇన్‌చార్జి, ఓ విభాగానికి విభాగాధిపతిగా, పీజీ అడ్మిషన్ సెట్ కో కన్వీనర్‌గా, వర్సిటీ సాంకేతిక విభాగం పర్యవేక్షకుడిగా, దూర విద్యాకేంద్ర రీజనల్ కో ఆర్డినేటర్‌గా, ఏపీపీఎస్‌సీ మూల్యాంకనంలో, రెగ్యులర్ దూర విద్యాకేంద్రాలకు తనిఖీ బృందం సభ్యుడిగా, ఎగ్జామ్ సెంటర్ల సెలెక్షన్ కమిటీ సభ్యుడిగా, ఏఎన్‌యూ ఇంటర్ నెట్ వర్క్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదే వ్యక్తికి వర్సిటీ పనులపై పలుమార్లు ఢిల్లీ వెళ్లే బాధ్యతలు కూడా అప్పగించడం విశేషం. దీనిపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరొకరికి ఇలా...
ఏఎన్‌యూలోని అదే విభాగంలో ఐక్యూఏసీ కో ర్డినేటర్ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగికి కూడా పలు బాధ్యతలు అప్పగించారు. సీటీఏగానూ, రెగ్యులర్ దూర విద్యాకేంద్రాల్లో తనిఖీ సభ్యుడిగా, పీజీ, డిగ్రీ పరీక్షల పరిశీలకుడిగా, రెగ్యులర్ పరీక్షల తనిఖీ సభ్యుడిగా, ప్రాక్టికల్ పరీక్షల తనిఖీ సభ్యుడిగా బాధ్యతలు చూసుకుంటున్నారు. రెగ్యులర్ విధానంలోనే కాకుండా దూర విద్యా కేంద్ర పరీక్షల్లోనూ పరిశీలకుడిగా, తనిఖీ బృందం సభ్యుడిగా, ప్రాక్టికల్ పరీక్షల్లోనూ, దూర విద్యాకేంద్రాల తనిఖీల్లోనూ సభ్యుడిగా విధులు నిర్వహిస్తున్నారు. పలు వర్సిటీ అంతర్గత కమిటీల్లోనూ సభ్యుడిగా కొనసాగుతున్నారు. లెక్కకు మించిన బాధ్యతలు నిర్వహించే ఈ అధ్యాపకులు తరగతులు ఎప్పుడు నిర్వహిస్తున్నారో అప్పగించిన వారికే తెలియాల్సి ఉంది. దీంతో గెస్ట్ ఫ్యాకల్టీపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సమయం ఉండదని తెలియదా?
కొందరు అధ్యాపకులకు ఒకటి కంటే ఎక్కువ బాధ్యతలు కట్టబెడుతున్న తాత్కాలిక వీసీకి ఆయా అధ్యాపకులకు పాఠాలు చెప్పే వెసులుబాటు, సమయం ఉన్నాయా? అని ఆలోచించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అంతిమంగా విద్యార్థులు నష్టపోతున్నారు. దీనిపై విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే తాత్కాలిక వీసీ ఆచార్య కె.గంగాధరరావుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాయి. కనీస చర్యలు కూడా లేవు. గతంలో వీసీలు తనిఖీలు చేసి అవసరమైతే కఠినమైన నిర్ణయాలు తీసుకునేవారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించడమే బాధ్యతగా భావించేవారని పలువురు విద్యావేత్తలు గుర్తు చేసుకుంటున్నారు. తాత్కాలిక వీసీ వచ్చిన 23 నెలల్లో ఏ రోజూ మచ్చుకై నా తనిఖీలు లేవని, బాధ్యులపై చర్యలు తీసుకోలేదని వర్సిటీ వర్గాల్లో సైతం చర్చ సాగుతోంది.
వర్సిటీలోని ఓ కళాశాల ప్రిన్సిపల్ విభాగాధిపతుల సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులకు పలు తరగతులు జరగడం లేదని వాపోయారు. అధ్యాపకులకు తప్పనిసరిగా బోధన చేయాలని సూచించారు. అయినప్పటికీ వారిలో ఎటువంటి మార్పు లేదు. ఎక్కువ బాధ్యతలు నిర్వహిస్తున్న వారిలో కొందరు హోదాను చూసుకుంటుండగా... మరికొందరు ఆర్థిక సంబంధమైన అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వర్సిటీలోని తాత్కాలిక పాలకులకు సైతం విద్యార్థుల ఇబ్బందులు పట్టడం లేదు. దీనిపై పలువురు ప్రిన్సిపాల్స్ చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఐదు దశాబ్దాలుగా మంచి పేరున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం.. కొందరు అధికారుల పనితీరు, స్వార్థం, ఓ సామాజిక వర్గంపై ప్రేమతో నేడు దిగజారుతోంది. ఏ విద్యాకేంద్రంలోనైనా విద్యార్థులకు సామాజిక విలువలతో కూడిన విద్యాబోధనలు, నైతిక విలువలను నేర్పించడం ప్రథమ కర్తవ్యం. కానీ వర్సిటీలో 23 నెలల తాత్కాలిక పాలనలో విద్యార్థులకు తరగతులే సరిగా నిర్వహించడం లేదు. పాఠాలు చెప్పకుండా పరీక్షలు రాసేదెలా అంటూ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.


