ఏఎన్‌యూలో వివాదాలకు కేంద్ర బిందువుగా ‘పచ్చ’ అధ్యాపకుడు టీడీపీలో అందరూ తనకు సన్నిహితులేనంటూ హల్‌చల్ మహిళా ఎగ్జామినర్లతో పరిధి దాటి ప్రవర్తించడంపై విమర్శలు వర్సిటీలో తాత్కాలిక పాలనతో గతి తప్పుతున్న కార్యకలాపాలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అతనో అతిథి అధ్యాపకుడు. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేయడంతో అతని ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. గతంలో తెలుగుదేశం పార్టీకి సర్వేలు చేశానని.. పార్టీ శిక్షణ శిబిరాలలో పాల్గొన్నానని.. ఆ పార్టీలో నేతలు అందరూ తనకు సన్నిహితులే అంటూ వర్సిటీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిన్నాడు. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించటం.. ఒక వర్గ సంప్రదాయాలను హేళన చేయటం పరిపాటిగా మారిందనే ఆరోపణలు వెల్లువెతున్నాయి. యూనివర్సిటీలోని ఒక కళాశాలలో పని చేస్తున్న ఈ అతిథి అధ్యాపకుడి తీరుతో ఆ విభాగంలోని విద్యార్థులు విలవిలలాడుతున్నారు. విభాగ పెద్దల అండదండలతో నియమితుడైన తర్వాత అడ్డగోలుగా వ్యవహరిస్తుడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారడంతో ఆయన తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ పేరు చెప్పుకొని అందర్నీ బెదిరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థి దశ నుంచి టీడీపీలో ఉన్నానని... తనను ఎవరూ ఏమీ చేయలేరని రెచ్చిపోతున్నా పట్టించుకునే వారే లేకుండాపోయారు. అధికార పార్టీకి చెందిన ఒక కుల కార్పొరేషన్ చైర్మన్ తనకు అత్యంత ఆప్తుడని హల్‌చల్ చేస్తున్నా సరిచేసేవారు కనిపించడం లేదు. తాను ఎంత చెబితే అంత అంటూ మిగిలిన సిబ్బందిని కూడా బెదిరిస్తున్నట్లు సమాచారం.
వేధింపులు... దూషణలు..
గతంలో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు ఉన్న ఈ అతిథి అధ్యాపకుడు.. తాజాగా అనేక వివాదాలకు కేంద్ర బిందువయ్యాడు. ఒక విద్యార్థిని వ్యవహారంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. విద్యార్థిని పాదరక్షలు తీసివేసి క్లాస్‌కు రావాలంటూ ఆమె గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించాడని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం ఉన్నతాధికారుల పరిశీలనకు వచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గతంలో ఇతను మూల్యాంకన విభాగంలో పనిచేసినప్పుడు వెహికల్ తాళాలు కావాలంటే తన గదికి రావాలని వికృతంగా మాట్లాడినట్టు ఫిర్యాదులు ఉన్నాయి. ఎగ్జామినర్ల పట్ల దురుసుగా వ్యవహరించడంతో పాటు మహిళా ఎగ్జామినర్లతో తన పరిధి దాటి వ్యవహరించినట్టు అప్పటి అధికారుల దృష్టికి కూడా వెళ్లింది. పొరుగు జిల్లాకు చెందిన ఒక మహిళా లెక్చరర్‌ను ప్రత్యేకంగా ఒక గదిలో కూర్చోబెట్టి మూల్యాంకనం చేయించారనే ఆరోపణ ఉంది. మరికొందరు మహిళా లెక్చరర్లను ప్రత్యేకంగా ఎక్కువ పేపర్లు ఇచ్చి మూల్యాంకనం చేయించడంతో వారు ఆందోళనకు దిగారు. గత శుక్రవారం విభాగ ఆవరణలో ఒక వర్గ సంప్రదాయాలను హేళన చేశారని విద్యార్థి బంధువులు వచ్చి నిలదీయడమే కాకుండా, ఆందోళన కూడా చేశారు. ఉన్నతాధికారులు ఇరువర్గాలను కూర్చోబెట్టి రాజీ చేసినట్లు చెబుతున్నారు. అధికార పార్టీ అండదండలు ఉండటంతో ఏమీ చేయలేకపోతున్నామని యూనివర్సిటీ అధికారులు కొందరు వాపోతున్నారు.


