– జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ
గుంటూరు వెస్ట్: రైతు ఆదాయం పెంచే దిశగా ప్రాథమిక రంగాల శాఖలు పని చేయాలని జిల్లా కలెక్టర్ సీఎం.సాయికాంత్ వర్మ పేర్కొన్నారు. వివిధ ప్రాథమిక రంగాల శాఖాధికారులతో మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అవసరం మేరకు పంటల విధానాన్ని మార్పు చేసి అధిక ఆదాయం వచ్చే దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పంటల వారీగా వస్తున్న ఆదాయాన్ని పరిశీలించాలని, ఉత్తమ మార్కెటింగ్ విధానాలను అనుసరించాలని తెలిపారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్ర బాబు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు సత్యనారాయణ చౌదరి, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ టి.నరసింహారెడ్డి పాల్గొన్నారు.
– ఏఎన్‌యూలో మరో మాయాజాలం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: పరీక్ష రోజునే కేంద్రాన్ని మార్చి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. ఏఎన్‌యూ పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షల్లో తొలుత రేపల్లె ప్రాంతంలోని నాలుగు కళాశాలలకు బాపట్లలోని ఒక సెంటర్‌ను పరీక్ష కేంద్రంగా కేటాయించారు. పరీక్ష జరిగిన ఈ నెల 21వ తేదీన సెంటర్‌ను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్లలోని సెంటర్‌కు బదులుగా మరో సెంటర్‌ను కేటాయించారు. గతంలో వీటిలో ఒక కళాశాలకు సెల్ఫ్ సెంటర్‌ను కేటాయించేవారు. ఇలా మార్చటంలో ఔచిత్యం ఏంటో వర్సిటీ అధికారులకే తెలియాలి. 21వ తేదీన పరీక్ష ఉండగా, అదే రోజున సెంటర్ మార్చినట్లు ఉత్తర్వులు ఇవ్వడం వర్సిటీ పనితీరుకు నిదర్శనం. మార్చిన సెంటర్‌లో హాల్ టికెట్లను పరీక్షా కేంద్రంలోనే అందజేశారు. నూతనంగా మార్చిన కేంద్రంలో కేటాయించిన కొన్ని కళాశాలల్లో గతంలో పీజీ కోర్సులను తొలగించినట్లు సమాచారం. ఒక కళాశాల కోసమే ఇతర కళాశాలలను కూడా మార్చినట్లు, విద్యార్థులు లేకపోయినా సెంటర్ కేటాయించినట్లు సమాచారం. ఏఎన్‌యూ పీజీ నాలుగో సెమిస్టర్ పొలిటికల్ సైన్స్ విద్యార్థుల హాల్ టికెట్లలో తప్పిదాలు చోటుచేసుకున్నాయి. ఏప్రిల్ నెలలో పరీక్షలు జరుగుతుండగా, జూన్ నెలలో పరీక్షలు అన్నట్లు ‘6’ నెలగా ముద్రించారు. వారాల వివరాలు కూడా తప్పుగా ముద్రించడం గమనార్హం.
గుంటూరుమెడికల్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుంటూరు శాఖ ఆధ్వర్యంలో ఐ.ఎస్.సి.సి.ఎం సహకారంతో ఏబీజీ అనాలసిస్‌పై వైద్యులకు నిరంతర వైద్య విద్యా కార్యక్రమం (సీఎంఈ) నిర్వహిస్తున్నట్లు ఐఎంఏ గుంటూరు శాఖ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ టి.సేవ కుమార్, డాక్టర్ బి.సాయికృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 23వ తేదీ సాయంత్రం జి.ఎం. ఏ బిల్డింగ్‌లో నిర్వహించే కార్యక్రమంలో వైద్య నిపుణులు డాక్టర్ కె.ఉదయ్, డాక్టర్ వై.విశ్వజ్యోతి ప్రసంగిస్తారన్నారు. గుంటూరు నగర వైద్యులందరూ ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగాకోరారు.
తాడేపల్లి రూరల్ : గుంటూరు జిల్లా సీతానగరం విజయకీలాద్రిపై వేంచేసిన యున్న శ్రీ విఘ్న విమోచక హనుమాన్‌కు మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ విజయకీలాద్రి దివ్య క్షేత్రంపై ఉన్న 27 అడుగుల ఏకశిలా మూర్తి శ్రీ విఘ్న విమోచక హనుమాన్ విగ్రహానికి గులాబీ పూలతో విశేష సహస్రనామార్చన నిర్వహించామని తెలిపారు. సినిమా కొరియెగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారని తెలిపారు.


