ఏమార్చి.. ఎడాపెడా దోచి..
ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు..
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): జిల్లాలో ప్రైవేట్ బస్సుల యాజమాన్యాల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. 36 సీట్ల సీటింగ్ అనుమతులతో బస్సులు నమోదు చేసుకుని, నిబంధనలకు విరుద్ధంగా స్లీపర్‌లుగా మార్చి నడుపుతున్నా రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ) అధికారులు కనీస చర్యలకు కూడా ఉపక్రమించకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. దీని వలన ప్రయాణికుల భద్రత, ప్రభుత్వ ఆదాయం రెండూ ప్రమాదంలో పడుతున్నాయి. రవాణా శాఖ అంచనాల ప్రకారం జిల్లాలో సుమారు 350 నుంచి 400 వరకు ప్రైవేట్ బస్సులు, వివిధ అంతర్‌జిల్లాల రూట్లలో నడుస్తున్నాయి. వీటిలో 100కు పైగా స్లీపర్ బస్సులు ఉన్నట్టు తెలుస్తోంది. సీటింగ్ పర్మిట్లతోనే బస్సులు నడుపుతూ లోపల స్లీపర్ సేవలు అందిస్తూ అక్రమ లాభాలు ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది.
అనుమతి ఒకటి... వాహనం మరొకటి
సీటింగ్ బస్సుగా నమోదు చేసిన వాహనంలో సీట్లు తొలగించడం, ఇనుప ఫ్రేమ్‌లతో స్లీపర్ బెర్త్‌లు అమర్చడం, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లను మూసివేయడం, అదనపు ప్రయాణికులను ఎక్కించడం అన్నీ ఆర్‌టీఏ అనుమతి లేకుండా జరుగుతున్న మార్పులేనని తెలుస్తోంది. ఆర్టీఏ చట్టం ప్రకారం కంపెనీ నుంచి వచ్చిన ఏ బస్సుకు కనీసం హెవీ లైట్లు కూడా మార్చే అవకాశం లేదు. అయినా ప్రైవేట్ బస్సుల యజమానులు ఇవేమీ పట్టించుకోకపోవడం వెనుక అర్థం తెలియంది కాదు.
చట్టం స్పష్టం .. అమలు శూన్యం
మోటార్ వెహికల్ యాక్ట్ – 1988 సెక్షన్ 52 ప్రకారం అనుమతి లేకుండా వాహన నిర్మాణంలో మార్పులు నేరం. ఉల్లంఘనకు పర్మిట్ రద్దు లేక సస్పెన్షన్ చేసే అవకాశం ఉంది.
సెక్షన్ 56 ద్వారా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ రద్దు చేసే అధికారం, సెక్షన్ 190(2) అక్రమ మార్పులకు జరిమానా, వాహన స్వాధీనం వంటివి ఉన్నప్పటీకీ ఆ చట్టాలన్నీ కేవలం వినడానికి పరిమితమైపోతున్నాయి.
ప్రయాణికుల భద్రతకు ముప్పు
సీటింగ్ బస్సుల చాసిస్‌పై స్లీపర్ నిర్మాణాలు చేయడం వల్ల వాహన బరువు సమతుల్యం ఉండదు. బ్రేక్, టైర్లపై అధిక ఒత్తిడి, ప్రమాద సమయంలో బెర్త్‌ల్లో ఇరుక్కునే పరిస్థితి, అగ్ని ప్రమాదమైతే బయటపడే మార్గాలు లేకపోవడం వంటి ప్రమాదాలు ఉన్నాయని రవాణా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్పందించని అధికారులు...
ఇటీవల కాలంలో గుంటూరు జిల్లా ఆర్టీఏ అధికారిగా ఎవరు బాధ్యతలు తీసుకున్నా, ఏదైనా ఆరోపణలపై వివరణ కోరితే ‘నన్ను అడగద్దు ప్లీజ్’ అంటూ కప్పదాటు ధోరణితో వ్యవహరిస్తున్నారు.


