మట్టి మాఫియాలో ఆధిపత్య పోరు
తాడేపల్లి రూరల్: రాజధాని ప్రాంతం తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలో రాత్రి వేళ మట్టి మాఫియా రెచ్చిపోతోంది. సక్రమ తవ్వకాల మధ్య అక్రమ రవాణా చేస్తూ జేబులు నింపుకొంటోంది. ఈ క్రమంలో మట్టి మాఫియా, లారీ యజమానుల మధ్య ఆధిపత్య పోరు పెరగడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ ఇళ్లలో ఉన్న మహిళలను కూడా బెదిరించేంత వరకు వెళ్లిన సంఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం... తుళ్ళూరు మండలం మల్కాపురానికి చెందిన ఓ యువకుడు ఈ మట్టి మాఫియాకు గతంలో డాన్‌గా వ్యవహరిస్తూ అక్రమ తవ్వకాలు నిర్వహించే సమయంలో ఒక లారీ నల్లమట్టి లోడ్ చేసేందుకు రూ.వెయ్యి నుంచి రూ.1200 వసూలు చేశాడు.
ముగ్గురు కలిసి...
తాడేపల్లి మండల పరిధిలోని మహానాడుకు చెందిన ఓ రౌడీషీటర్ కొంతకాలం డబ్బులు ఇచ్చి అతని నుంచి మట్టి పోయించుకున్నాడు. తరువాత అతనికి డబ్బులు ఇవ్వడం ఏంటంటూ ఉండవల్లికి చెందిన ఓ టీడీపీ నాయకుడు మిగిలిన లారీ యజమానులతో జతకట్టి అక్రమ రవాణాకు తెరలేపాడు. దీనికి వత్తాసుగా మహానాడుకు చెందిన టీడీపీ కార్యకర్త, రౌడీషీటర్, చిర్రావూరుకు చెందిన జనసేన నాయకుడు ముందుకు వచ్చారు. వీరు మల్కాపురానికి చెందిన వ్యక్తితో పలుమార్లు గొడవపడ్డారు. గురువారం రాత్రి ఈ గొడవ తీవ్ర స్థాయికి చేరడంతో మల్కాపురానికి చెందిన వ్యక్తి మంగళగిరి రూరల్ కృష్ణాయపాలెం నుంచి తుళ్లూరు వెళ్తుండగా మార్గం మధ్యలో కాపుకాసి దాడికి పాల్పడ్డారు. భయంతో ఆ యువకుడు వాహనంలో పరారయ్యాడు. అయినా వారు మల్కాపురంలో నివాసం ఉండే సదరు వ్యక్తి ఇంటికి రెండు కార్లలో వెళ్లారు. ఇంట్లో ఉన్న అతడి భార్యను బెదిరించి ఆ ప్రాంతంలో భయభ్రాంతులు సృష్టించారు.
గతంలోనూ అరాచకం...
మహానాడుకు చెందిన రౌడీషీటర్ గతంలో కూడా యర్రబాలెంకు చెందిన ఒక యువకుడ్ని గుండిమెడ, రామచంద్రాపురం మధ్య చితకబాది వార్నింగ్ ఇచ్చాడు. అప్పట్లో మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఈ సంఘటనపై కేసు కూడా నమోదు అయ్యింది. ప్రస్తుతం ఈ రౌడీషీటర్‌కు అధికార పార్టీలో కొంతమంది ఆశీస్సులు ఉండడంతో మరింత రెచ్చిపోతున్నాడు. జరిగిన దాడి సంఘటనపై మల్కాపురానికి చెందిన బాధితుడు పొన్నం సురేష్ మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో శ్రీ ఎలైట్ అనే కంపెనీలో తన లారీ తిప్పుతున్నానని చెప్పారు. రాత్రి 8 గంటల సమయంలో రాయపూడి కిరణ్, ఎలిశెట్టి రామకృష్ణ, రౌడీ షీటర్ పల్లెపు హరికృష్ణ తనపై దాడి చేశారని ఆరోపించారు. తాను అక్రమ మట్టి తోలడం లేదని, కొంతమంది విలేకరులకు వీడియో ద్వారా సమాచారం ఇచ్చానని తెలిపారు. సురేష్ కూడా మట్టి మాఫియాకు నాయకత్వం వహిస్తున్నట్లు రాజధాని రైతులు తెలియజేశారు.
కృష్ణాయపాలెంలో లారీ యజమానుల మధ్య రచ్చ
పారిపోయిన ఓ యువకుడు
మల్కాపురం వెళ్లి లారీ యజమాని
భార్యకు బెదిరింపులు
తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన యువకుడు


