టీటీడీపై టీడీపీది అసత్యప్రచారం
గుంటూరు రూరల్: గతంలో అధికారం కోసం, నేడు అధికార మదంతో తెలుగుదేశం పార్టీ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూపై అసత్య ప్రచారం చేస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నీచ రాజకీయాలు చేస్తూ నగరంలోని అమరావతిరోడ్డు చిల్లిస్ సెంటర్‌లో ‘ఇది నెయ్యే కాదంటూ’ అబద్ధాలతో కూడిన ఫ్లెక్సీ ఏర్పాటు చేయటంతో విషయం తెలిసిన వైఎస్సార్ సీపీ శ్రేణులు శుక్రవారం అక్కడకు చేరుకుని నిరసన తెలిపారు. అంబటి మాట్లాడుతూ చంద్రబాబు ఆదేశాలతోనే తెలుగుదేశం నాయకులు ఇలా బరితెగించి విష ప్రచారం చేస్తున్నారన్నారు. తిరుమల లడ్డూలో పంది కొవ్వు కలవలేదని సీబీఐ చెప్పిన తర్వాత కూడా తెలుగుదేశం నాయకులు ఇలా దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. 24 గంటల్లో ఫ్లెక్సీలు తొలగించాలని, లేకపోతే మేమే ఆ ఫ్లెక్సీలు తొలగిస్తామని హెచ్చరించారు. తిరుమల లడ్డూను రాజకీయాలకు వాడుకున్న చంద్రబాబునాయుడు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసత్య ప్రచారం చేసి ఆంధ్ర రాష్ట్ర పరువు తీయటంతోపాటు భక్తుల మనోభావాలను చంద్రబాబు ప్రభుత్వం దెబ్బతీసిందన్నారు. ప్రజల్లో చంద్రబాబు ప్రభుత్వానికి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక చంద్రబాబు అండ్‌కో వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచారం చేస్తుందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు మా పార్టీ నాయకులు పైన తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోమని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను ఆ దేవుడు కూడా క్షమించడన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


