జింకానా సేవలు చరిత్రలో నిలిచిపోతాయి | - | Sakshi
Sakshi News home page

జింకానా సేవలు చరిత్రలో నిలిచిపోతాయి

Jan 31 2026 6:47 AM | Updated on Jan 31 2026 6:47 AM

జింకానా సేవలు చరిత్రలో నిలిచిపోతాయి

జింకానా సేవలు చరిత్రలో నిలిచిపోతాయి

● కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని ● ఎంసీహెచ్‌ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

గుంటూరు మెడికల్‌: అమెరికాలో న్యాయబద్ధంగా పన్ను చెల్లించి మాతృభూమిని మరువకుండా గుంటూరు జీజీహెచ్‌లో కానూరి–జింకానా ఎంసీహెచ్‌ భవన నిర్మాణం కోసం రూ.100 కోట్లు విరాళంగా అందజేసిన జింకానా సోదరులు చరిత్రలో నిలిచిపోతారని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. శుక్రవారం ఎంసీహెచ్‌ భవన ప్రారంభం అనంతరం మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ మాట్లాడుతూ జీజీహెచ్‌లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిరంతరం సాయం అందిస్తున్న జింకానా వారికి ఆంధ్రప్రదేశ్‌ ప్రజల తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ఎంసీహెచ్‌ సెంటర్‌ను ఇంటర్నేషనల్‌ స్థాయిలో నిర్మించారని కితాబునిచ్చారు. గత ప్రభుత్వంలో ఎంసీహెచ్‌ నిర్మాణం కోసం కేవలం రూ.6 కోట్లు ఇచ్చారన్నారు. పారిశ్రామికవేత్త, తులసి సీడ్స్‌ అధినేత తులసి రామచంద్ర ప్రభు జీజీహెచ్‌లో ఆగిపోయిన భవన నిర్మాణం కోసం రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చారని చెప్పారు. డెక్కన్‌ టుబాకో కంపెనీ వారు ట్రామా సెంటర్‌ కోసం రూ.10 కోట్లు అందించారని వెల్లడించారు. మాజీ ఎంపీ గల్లా జయదేవ్‌ రూ.80 లక్షలు ఆగిపోయిన బిల్డింగ్‌ నిర్మాణం కోసం అందించారన్నారు. తాను కూడా సీఎస్‌ఆర్‌ నిధులు తీసుకొచ్చి గుంటూరు హాస్పిటల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు పెమ్మసాని వెల్లడించారు.

జింకానా ఆదర్శంగా ఉంది

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం జింకానా సభ్యులు చేస్తున్న సాయం, దాతృత్వం చాలా గొప్పదని కొనియాడారు. మాతృ సంస్థ పట్ల, సమాజం పట్ల, ప్రజల ఆరోగ్యం పట్ల జింకానా సభ్యులకు ఉన్న చిత్తశుద్ధికి చేతులెత్తి నమస్కరించారు. అమెరికాలో ఉన్నప్పటికీ భారతదేశానికి గర్వకారణంగా జింకానా సభ్యులు ఉన్నారని, భావితరాలకు రోల్‌ మోడల్‌గా జింకానా వైద్యులు ఉన్నారని కొనియాడారు. మాతృ మరణాలు, శిశు మరణాలు తగ్గింపే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. స్వర్ణాంధ్ర, ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా 20 నెలల్లో అనేక మార్పులు వైద్య రంగంలో తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. ఆసుపత్రుల్లో ఓపీలు, ఐపీలు, సర్జరీలు, ప్రసవాలు పెరిగాయన్నారు. రానున్న కాలంలో మరింత అభివృద్ధి చేస్తామన్నారు.

ఎన్టీఆర్‌ వైద్య సేవ స్థానంలో

యూనివర్సల్‌ హెల్త్‌ కార్యక్రమం

ఏప్రిల్‌ 1 నుంచి ఎన్టీఆర్‌ వైద్య సేవ స్థానంలో యూనివర్సల్‌ హెల్త్‌ కార్యక్రమం తీసుకొస్తున్నా మని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1.43 కోట్ల మందికి హెల్త్‌ ఇన్స్యూరెన్సు ఉంటుందన్నారు. రూ.25 లక్షల వరకు ఉచితంగా చికిత్స అందిస్తామన్నారు. వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో ఇస్తామని ప్రభుత్వం చెప్పడంపై వైఎస్సార్‌ సీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని, పీపీపీకి, ప్రైవేటుకు వారికి తేడా తెలియడం లేదని అన్నారు. నీతి ఆయోగ్‌ పీపీపీని తెచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును జింకానా ప్రతినిధులు సన్మానించా రు. జింకానా సభ్యులను ముఖ్యమంత్రి అభినందించి సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మొహమ్మద్‌ నసీర్‌ అహ్మద్‌, గళ్లా మాధవి, చదలవాడ అరవింద్‌బాబు, డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌, కలెక్టర్‌ ఎ.తమీమ్‌ అన్సారియా, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ యశశ్వి రమణ, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎన్‌.వి.సుందరాచారి, హెల్త్‌ సెక్రటరీ సౌరబ్‌ గౌర్‌, జింకానా ప్రెసిడెంట్‌ డాక్టర్‌ కోయ రామకోటేశ్వరరావు, ఎంసీహెచ్‌ బిల్డింగ్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ బాబురెడ్డి సాగిరెడ్డి, జింకానా స్థానిక కో ఆర్డినేటర్లు డాక్టర్‌ వెనిగళ్ల బాలభాస్కరరావు, డాక్టర్‌ పి.వి.హనుమంతరావు, డాక్టర్‌ సూరత్‌ అమర్‌నాథ్‌, డాక్టర్‌ శ్రీనివాస్‌, డాక్టర్‌ రామన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement