స్తంభించిన బ్యాంక్ లావాదేవీలు
కొరిటెపాడు(గుంటూరు): బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా గుంటూరు జిల్లాలోని బ్యాంకు ఉద్యోగులు ఐదు రోజుల పని విధాన ఒప్పందం వెంటనే అమలు పరచాలని జీటీ రోడ్‌లోని యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా(యూబీఐ) రీజినల్ ఆఫీసు వద్ద మంగళవారం సమ్మె చేపట్టారు. పెద్ద ఎత్తున బ్యాంక్ ఉద్యోగులు, సిబ్బంది హాజరై నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొని ఐదు రోజుల పని డిమాండ్ ఆవశ్యకత గురించి మాట్లాడుతూ తమ పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా బ్యాంకు యూనియన్‌ల నాయకులు మాట్లాడుతూ దాదాపు 2015 నుంచి అనేక రకాల పోరాటాల ఫలితంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌తో బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఐదు రోజుల పని విధానం ఒప్పందం జరిగి రెండు సంవత్సరాలు అయినప్పటికీ, ప్రభుత్వ అనుమతి కావాలని కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్థిక సంస్థలు అయినటువంటి ఆర్‌బీఐ, నాబార్డు, ఇన్సూరెన్స్, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అన్నీ ఇప్పటికే ఐదు రోజుల పని విధానాన్ని పాటిస్తూ ఉన్నాయని తెలిపారు. ఒక్క బ్యాంకింగ్ రంగంలోనే ఒప్పందం అయినా కూడా అమలు జరగడం లేదన్నారు. బ్యాంకులలో సుమారు రెండు లక్షల ఖాళీలు ఉన్నప్పటికీ భర్తీ చేయకపోవడం వల్ల ఉన్న ఉద్యోగుల మీద విపరీతమైన ఒత్తిడి పెరిగి వారి వ్యక్తిగత జీవితం, వృత్తి పరమైన జీవితం మధ్య అసమతుల్యత ఏర్పడటంతో అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఒప్పందం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే బ్యాంకులు నాలుగు రోజులు మూతపడ్డాయని, అమలు చేయకపోతే భవిష్యత్‌లో మరిన్ని ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు. బ్యాంకులు సమ్మెబాట పట్టడంతో లావాదేవీలు పెద్ద ఎత్తున స్తంభించి పోయాయి. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకుడు వెలుగూరి రాధాకృష్ణ, సీపీఎం నాయకుడు వై.నేతాజీ, మాల్యాద్రి, మేడా హనుమంతరావు, ఎల్‌ఐసీ నాయకుడు మస్తాన్ వలి, వివిధ బ్యాంక్‌ల ఉద్యోగ సంఘాల నాయకులు జయకుమార్, పి.కిషోర్‌కుమార్, సయ్యద్ భాషా, కోటిరెడ్డి, కళ్యాణ్, రామకృష్ణ, సాంబశివరావు, రవిచంద్రారెడ్డి, వీరారెడ్డి, నరేంద్ర పాల్గొన్నారు.


