అనుమానంతో భార్యను హత్యచేసిన భర్త
తెనాలిరూరల్: అనుమానంతో కట్టుకున్న భార్యను భర్త గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం బస్టాండ్‌కు వెళ్లి పరారయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. స్థానిక రామలింగేశ్వరపేటలో నివాసం ఉంటున్న బండ్ల సాయి వంట పనులకు వెళుతుంటాడు. భార్య శిరీష(26) బ్యూటీ పార్లర్ నిర్వహించేది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. గతంలో వీరు హైదరాబాదులో ఉన్నారు. భార్య ప్రవర్తన సరిలేదన్న కారణంగా తరచూ గొడవలు పడుతుండేవారు. ఈ నేపథ్యంలో కొంతకాలం కిందట తెనాలికి మకాం మార్చారు. సాయి స్థానికంగా ఓ హోటల్‌లో వంట మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. భార్య బ్యూటీ పార్లర్‌లో విధులకు వెళ్లేది. తెనాలి వచ్చినా ఆమె ప్రవర్తనలో మార్పు లేదన్న కారణంగా ఇరువురి మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో శిరీష గొంతు నులిమి చంపి బయటకు వెళ్లి పాత స్వరాజ్ టాకీస్ సెంటరులో తెలిసిన వ్యక్తిని ఫోన్ చేసుకోవాలని అడిగి తీసుకుని వెళ్లిపోయాడు. మార్గం మధ్యలో తన సోదరుడు కనబడగా బస్టాండ్ వద్ద దింపమని కోరాడు. శిరీష మృతి గురించి చుట్టుపక్కల వారి సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా వైద్యశాలకు తరలించారు. పట్టణ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి ఆచూకీ గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.
అనుమానంతో భార్యను హత్యచేసిన భర్త


