కొరిటెపాడు(గుంటూరు): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల గుంటూరు జిల్లాలో గత ఆరు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు అత్యధికంగా చేబ్రోలు మండలంలో 82.8 మిల్లీ మీటర్లు పడగా, అత్యల్పంగా పెదకాకాని మండలంలో 10.2 మి.మీ. కురిసింది. సగటు 43.1 మి.మీ.గా నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు.. వట్టిచెరుకూరు మండలంలో 80.2 మి.మీ., ప్రత్తిపాడు 70.6, గుంటూరు పశ్చిమ 70.2, గుంటూరు తూర్పు 66.2, పెదనందిపాడు 64.6, ఫిరంగిపురం 62.4, కాకుమాను 50.4, మేడికొండూరు 45.4, కొల్లిపర 37.2, పొన్నూరు 27.8, దుగ్గిరాల 22.8, మంగళగిరి 21, తెనాలి 20.2, తాడేపల్లి 17.4, తుళ్ళూరు 14.8, తాడికొండ మండలంలో 12.4 మి.మీ. చొప్పున వర్షం పడింది. జూలై 22వ తేదీ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 117 మి.మీ. పడాల్సి ఉండగా, ఇప్పటి వరకు 188.4 మి.మీ. నమోదైంది. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు అన్నదాతలు ఖరీఫ్ సాగు పనులు ముమ్మరం చేశారు.
వర్షపు నీటిలోనే వెన్‌లాక్ మార్కెట్
నెహ్రూనగర్: మూడు రోజులుగా నగరంలో కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగిన విషయం తెలిసిందే. నగరపాలక సంస్థ కార్యాలయం పక్కనే ఉన్న వెన్‌లాక్ (చేపల) మార్కెట్ కింద సెల్లార్‌లోకి భారీ ఎత్తున వర్షపు నీరు చేరింది. బెయిల్ అవుట్ చేయాల్సిన అధికారులు స్పందించడం లేదు. వర్షపు నీటిలోనే సెల్లార్ ఉండిపోయింది. పార్కింగ్‌లో ఉన్న ద్విచక్ర వాహనాలు, తోపుడు బండ్లు నీటిలోనే నానుతున్నాయి.
కొండవీటి వాగు ముంపు
తాడికొండ: గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారి ఐతా నాగేశ్వరరావు తాడికొండ మండలం పాములపాడు గ్రామంలో కొండవీటి వాగు పొంగి పొర్లడంతో నీట మునిగిన వరి, పత్తి పంట పొలాలను మంగళవారం పరిశీలించారు. వాగుకు ముళ్ళపొదలు, చెత్త అడ్డుపడి నీరు కిందకు ప్రవహించక పొంగిపొర్లి పంట పొలాల మీద వరద పడినట్టు స్థానిక రైతులు తెలియజేశారు. వాగు పక్క పొలాలలో 150 ఎకరాలలో వరి వెద పద్ధతిలో విత్తామని, నెల కిందట వేసిన 300 ఎకరాల పత్తి సాగు కూడా మునిగిపోయిందని తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌కు తెలియజేసి వాగులో అడ్డుపడిన చెత్తను తొలగింపచేస్తామని, రాయితీపై వరి విత్తనాలు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి సహాయ వ్యవసాయ సంచాలకులు తోటకూర శ్రీనివాసరావు, తాడికొండ మండలం వ్యవసాయ అధికారి బి.శ్రీనివాసనాయక్, రైతులు పాల్గొన్నారు.
568.30 అడుగులకు సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 568.30 అడుగులకు చేరింది. సాగర్ జలాశయం నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదలవుతోంది.
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నరసరావుపేట మున్సిపాల్టీకి 14వ ర్యాంకు
నరసరావుపేట: కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో స్థానిక మున్సిపాలిటీకి 14వ ర్యాంకు లభించిందని కమిషనర్ ఎం.జస్వంతరావు మంగళవారం పేర్కొన్నారు. గతేడాది 18వ ర్యాంకు వచ్చిందన్నారు. ఈ ఏడాది ర్యాంకు పరంగా పరిస్థితి మెరుగుపడిందన్నారు. దేశవ్యాప్తంగా 265వ ర్యాంకు సాధించటమే కాకుండా చరిత్రలో తొలిసారిగా ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ (ఓడీఎఫ్)లో 2పస్ ర్యాంకు లభించిందన్నారు.

కొండవీటి వాగు ముంపు

నరసరావుపేట మున్సిపాల్టీకి 14వ ర్యాంకు