వాసవీ కన్యక గుడి సత్రం కమిటీ ఎన్నిక
తెనాలి: పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ వివాదాస్పదంగా మారిన తరుణంలో మంగళవారం కొత్త కమిటీని ప్రకటించారు. విస్తృత పోలీసు బందోబస్తు నడుమ నూతన అధ్యక్షుడిగా తనను ఎన్నిక చేసుకున్నట్టు మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ పెండేల వెంకట్రావు ప్రకటించారు. వాస్తవానికి కమిటీ సర్వసభ్య సమావేశం జరగాల్సిన ఈనెల 13వ తేదీనే సభ్యులు తనను ఎన్నుకున్నారనీ, ఈరోజు సమావేశంలో ప్రకటన చేస్తున్నట్టు పెండేల వెంకట్రావు తెలియజేశారు. దేవస్థానం ఆఫీసు తాళం పగులగొట్టి స్వాధీనం చేసుకున్నారు. దేవస్థానం సత్రం కమిటీ సర్వసభ్య సమావేశం ఈనెల 13న జరగాల్సి వున్న విషయం తెలిసిందే. ఆరోజు వివాదం నెలకొనటం, ఇరువర్గాల సభ్యులతోపాటు బయట వ్యక్తుల ప్రవేశంతో ఆలయ ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. అదేరోజు నూతన కమిటీ ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేస్తున్నామని, తదుపరి తేదీని ప్రకటిస్తామని కమిటీ నాయకులు ప్రకటించారు. ఆ ప్రకారం పత్రికా ప్రకటన చేశారు. మరోవైపు సత్రం కమిటీ కాలపరిమితి పూర్తయిందనీ, మార్చాల్సిందేనని పట్టుబట్టిన సభ్యులు 300 మందికి పైగా, 13వ తేదీనే తనను నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ పెండేల వెంకట్రావు మీడియాకు వెల్లడించారు. ముందు ప్రకటించిన ట్టుగా మంగళవారం ఆయన వర్గం సభ్యులు ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. సత్రం కమిటీ నాయకులూ హాజరయ్యారు. ముందస్తు జాగ్రత్తగా సబ్‌డివిజనులోని పోలీసులను ఇక్కడ మోహరించారు. గుంటూరు నుండి అదనపు ఎస్పీ స్వయంగా వచ్చి పర్యవేక్షించారు. ఏకపక్షంగా నూతన కార్యవర్గాన్ని ప్రకటించుకోవటంతో కమిటీ నాయకులు బయటకు వెళ్లిపోయారు. అనంతరం పెండేల వెంకట్రావు తన ఎన్నిక విషయాన్ని వెల్లడించారు. కార్యదర్శిగా తాతా శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడిగా బచ్చు సాంబశివరావు, సంయుక్త కార్యదర్శిగా పెండేల సుబ్బారావు, కోశాధికారిగా శ్రీరాం రాజా, సభ్యులుగా నూకల రాధాకృష్ణమూర్తి, కొప్పురావూరి కిశోర్, మువ్వల సుబ్బారావు, డోగిపర్తి చంద్రశేఖర్, చందోలు రమేష్‌బాబు, మాజేటి కృష్ణకిశోర్, కొల్లిపర రాధాకృష్ణమూర్తి, దేసు యుగంధర్, దేసు రవికుమార్, కూరపాటి రవికుమార్, మానేపల్లి చంద్రశేఖర్, తవ్వా నాగప్రసాద్ ఎన్నికై నట్టు ప్రకటించారు. నూతన కార్యవర్గం కాలపరిమితి 2025–28 వరకు ఉంటుందని తెలిపారు. గతంలో సీనియర్ రాజకీయవేత్త కొణిజేటి రోశయ్య సూచనపై నూకల వెంకట వేణుగోపాలరావుకు కమిటీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చామని, గత ఇరవై ఏళ్లుగా ఆయన ఎన్నో దురాగతాలకు పాల్పడినందునే పోరాటం చేసి మార్చుకోవాల్సి వచ్చిందని పెండేల వెంకట్రావు అన్నారు. దేవస్థానం ఆఫీసు తాళం పగులగొట్టి, కొత్త తాళం వేశారు. నూతన కమిటీని హాజరైన సభ్యులు శాలువాలతో సత్కరించారు. సర్వసభ్య సమావేశం జరగటం, అందులో ఏకగ్రీవం చేసుకోవటం లేదా ఎన్నిక అనివార్యమైతే తేదీని ప్రకటించి ఎన్నికలు జరుపుకోవటం వంటి అంశాల జోలికి పోకుండా వెయ్యిమంది సభ్యులున్న ఆలయ కమిటీపై విస్తృత పోలీసు బందోబస్తు నడుమ అతి సునాయాసంగా ఆధిపత్యం సాధించటం పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కొత్త అధ్యక్షునిగా వెంకట్రావు ఎన్నిక పోలీసు బందోబస్తు నడుమ ఆలయ ఆఫీసు తాళం పగలగొట్టి స్వాధీనం


