పోలీసులపై చర్యలు తీసుకోవాలి
జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట అప్పాపురం గ్రామస్తుల నిరసన పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు స్వీకరించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్
మైనర్లపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన
నగరంపాలెం: మైనర్ విద్యార్థులపై దాడికి పాల్పడిన ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయాలంటూ కాకుమాను, అప్పాపురం గ్రామస్తులు, మాలమహానాడు, మాల మహాసభ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయాలని నినదించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొని, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం అర్జీదారుల ఫిర్యాదులను ఆలకించారు. సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్లు చేసి, ఆయా అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని సూచించారు. ప్రజా ఫిర్యాదులను వేగంగా, చట్టబద్ధంగా పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) జీవీ రమణమూర్తి, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), బెల్లం శ్రీనివాసరావు (ట్రాఫిక్), అబ్దుల్‌అజీజ్ (గుంటూరు తూర్పు) పాల్గొన్నారు.
విద్యార్థులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు..
ఇటీవల కాకుమాను మండలం అప్పాపురం గ్రామం మాలపల్లిలో జరిగిన అమానుష ఘటనను జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్‌కుమార్ అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు వాలీబాల్ నెట్ కట్టే క్రమంలో టెలిఫోన్ స్తంభాన్ని తొలగించారని అన్నారు. దీనిపై ఓ మహిళా కాకుమాను పీఎస్‌లో ఫేక్ ఫిర్యాదు చేసిందని, దాన్ని ఆధారంగా చేసుకుని ఎస్‌ఐ ఏక్‌నాథ్, కానిస్టేబుల్ శ్రీకాంత్‌తో కలిసి నలుగురు విద్యార్థులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని వాపోయారు. విద్యార్థులను దుర్భాషలాడుతూ, తాము తలుచుకుంటే గ్రామాన్ని ఖాళీ చేయిస్తామని వ్యాఖ్యానించారన్నారు. వారిపై విచక్షణరహితంగా దాడి చేయడమేగాక రౌడీషీటర్ల వలే రోడ్డుపై నడిపించారని ఆరోపించారు. ఇప్పటివరకు ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం శోచనీయమన్నారు. ఎస్‌ఐ ఏక్‌నాథ్, పీసీ శ్రీకాంత్‌ను తక్షణమే సస్పెండ్ చేసి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌పాల్, ఎస్.వెంకటరమణ, మల్లెల వెంకట్రావు, బాధితులు, వారి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
పోలీసులపై చర్యలు తీసుకోవాలి


