కవయిత్రి విశ్వైక పావని దంపతులకు సన్మానం
సత్తెనపల్లి: సామాజిక కవయిత్రి విశ్వైక కలం నుంచి వెలువడిన ‘తొలి సంతకం‘ కవితా సంకలనం పుస్తక పరిచయం పట్టణంలోని పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఉషోదయ కళాపరిషత్ అధ్యక్షుడు పిన్నమనేని పాములయ్య అధ్యక్షత వహించి మాట్లాడుతూ కవిత్వం ఆత్మ భాషయని, భావోద్వేగాలను పదాలుగా నేయగలవాడు ‘కవి’ అన్నారు. ఈ ‘తొలి సంతకం’ కవితా మాలిక కవయిత్రి పావని కాగా ఆమె కలంపేరు ‘విశ్వైక.’ ఇటీవల హైదరాబాద్ నగరంలో ప్రారంభావిష్కరణ జరుపుకోగా సత్తెనపల్లిలో పుస్తక సమీక్ష ‘తొలి సంతకం’ కవితా మాలిక ప్రతిష్టను సంతరించుకొన్నదన్నారు. సభలో ప్రముఖ కవి కొరబండి ఆంథోనీ, యూటీఎఫ్ నాయకులు రిటైర్డ్ ఉపాధ్యాయులు కె.పోతులూరయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ కుమార్ సీపీఎం పట్టణ కార్యదర్శి డి విమల, అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) పట్టణ కార్యదర్శి జి ఉమాశ్రీలు మాట్లాడారు. అనంతరం ‘తొలి సంతకం’ కవితా సంపుటి పుస్తకాన్ని సభికులు ప్రారంభించి సభకు పరిచయం చేశారు. విశ్వైక కుమారులు కార్తీక్ దీపక్‌లు ఈ పుస్తకానికి సాంకేతిక వర్గంగా వ్యవహరించారు. అనంతరం కవయిత్రి విశ్వైక, ఆమెను ప్రోత్సహించిన భర్త విశ్వరూపాచారి, ఆమె తండ్రి రొంపిచర్ల పురుషోత్తంలను పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఉషోదయ కళాపరిషత్ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కవయిత్రి విశ్వైక, విశ్వరూపాచారి దంపతులు పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంకు రూ.50 వేలు విరాళంగా బ్యాంక్ చెక్కును అంద జేశారు. ఈ కార్యక్రమంలో కళాకారులు బత్తినేని లక్ష్మయ్య, ఈవీ ప్రసాద్, మాతంగి సాంబశివరావు, నాగేశ్వరరావు, రమాదేవి, జొన్నలగడ్డ రత్నరాజు, రవి, తదితరులు పాల్గొన్నారు.


