వివేకానంద జీవితం యువతకు మార్గదర్శకం
జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా
గుంటూరు వెస్ట్: స్వామి వివేకానంద జీవితం యువతకు మార్గదర్శకమని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం వేడుకలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌లు వివేకానంద చిత్ర పటానికి పూలమాలలు నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద భారత ఆధ్యాత్మిక, తాత్విక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడన్నారు. యువతకు శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని అందించిన మహోన్నత ఆలోచనావేత్త అని పేర్కొన్నారు. ‘మేలుకో .. లక్ష్యాన్ని సాధించే వరకు ఆగవద్దు’’ అనే వివేకానందుని సూక్తి నేటి యువతకు మార్గదర్శకమని కొనియాడారు. స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవడం, ఆయన యువతపై చూపిన ప్రభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో షేఖ్ ఖాజావలి, జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్‌ఈ కె.కళ్యాణ చక్రవర్తి, జలవనరుల శాఖ ఎస్‌ఈ వెంకటరత్నం, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్రబాబు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అక్షర ఆంధ్రతో అక్షరాస్యత పెంచాలి
ఆధునిక సమాజంలో విద్య ఎంతో కీలకమని దాని ప్రాముఖ్యతను వివరించి అక్షరాస్యతా శాతాన్ని పెంచే విధంగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు. సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ నిర్వహించిన వీడియో సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు నిర్వహిస్తున్న ఉల్లాస్ – అక్షర ఆంధ్ర కార్యక్రమం నిర్దేశిత లక్ష్యాలను అందుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ ఆంజనేయులు, డీఈఓ షేక్ సలీం బాషా, డీపీఓ నాగసాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.


