వైఎస్సార్ సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయింపు
ఎస్టీ కులానికి చెందిన గోవిందనాయక్‌పై అక్రమంగా కేసు నమోదు చంద్రబాబు ప్రభుత్వంపై రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకత వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు
నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్‌లు చేయిస్తున్నారని పార్టీ పీఏసీ సభ్యులు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. గుంటూరు జిల్లా జైల్లో ఉన్న జీడీసీసీ మాజీ డైరెక్టర్ గోవిందనాయక్‌ను సోమవారం ములాఖత్ ద్వారా బ్రహ్మనాయుడు పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సొసైటీ ద్వారా రైతులకు రుణాలు మంజూరు చేసేది అధికారులని అన్నారు. రుణాలకు సంబంధించి డబ్బు చెల్లించాల్సింది రైతులని పేర్కొన్నారు. ఈ క్రమంలో సంతకం చేసిన గోవిందనాయక్‌పై అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు. ఒక ఎస్టీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేయడం వెనుక చంద్రబాబు ప్రభుత్వం కుట్ర దాగి ఉందని ఆరోపించారు. సొసైటీ ద్వారా వంద కోట్లు రుణాలు తీసుకుంటే రూ.80 కోట్లు చెల్లించారని, మిగతా రూ.20 కోట్లను చెల్లిస్తున్నారని చెప్పారు. ఒకవైపు రైతులు రుణాలు చెల్లిస్తున్నా, అధికారులు తప్పు చేసినా కూడా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలే చేశారని వారిని అరెస్ట్‌లు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన డైరక్టర్లు ఉన్నారని, గతంలో వారు సంతకాలు చేశారని అయినప్పటికీ వారిని అరెస్ట్ చేయలేదన్నారు. ఇప్పటికై నా రెడ్ బుక్ రాజ్యాంగం ఆపాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకు తీవ్ర వ్యతిరేకత వస్తోందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని చెప్పారు. బొల్లాపల్లి మండలం జెడ్పీటీసీ సభ్యుడు కృష్ణనాయక్, పార్టీ బొల్లాపల్లి మండల కన్వీనర్ నారాయణరెడ్డి, వినుకొండ టౌన్ కన్వీనర్ కొత్తమాసు శివ, వినుకొండ రూరల్ మండలం కన్వీనర్ దండు చెన్నయ్య, తుప్పిశెట్టి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


