మహనీయుడు అంబేడ్కర్
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకునేలా రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు చెప్పారు. బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం బీఆర్ అంబేడ్కర్ జయంత్యుత్సవాన్ని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ అణగారినవర్గాలను మరింత అణిచివేస్తున్న సమయంలో అంటరానితనం, పేదరికంపై పోరాడిన గొప్ప వ్యక్తి అంబేడ్కర్ అని కీర్తించారు. ఎంతో కష్టపడి చదివి.. రాజ్యాంగాన్ని నిర్మించే స్థాయికి ఎదిగిన ఆయన అకుంఠిత దీక్ష ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. రాజ్యాంగం ద్వారా దళిత వర్గాలకు రిజర్వేషన్లు కల్పించిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. వైఎస్సార్ సీపీ హయాంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడ కేంద్రంగా 125 అడుగుల ఎత్తు అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అంబేడ్కర్ విగ్రహానికి సంబంధించి లైటింగ్‌ను ఆపేసి, వైఎస్ జగన్ పేరును కూడా తొలగించారని, దీనిపై ఫిర్యాదు చేసినా ఇప్పటికీ కేసు నమోదు చేయలేదన్నారు. ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి అంబేడ్కర్ అంటే ఏ మాత్రం గౌరవం లేదని ఆరోపించారు. ముందుగా గడ్డిపాడులోని అంబేడ్కర్ విగ్రహానికి పార్టీ నేతలతో కలిసి అంబటి నివాళులు అర్పించారు. అనంతరం లాడ్జిసెంటర్‌లో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు నిమ్మకాయలు రాజనారాయణ, మెట్టు వెంకటప్పారెడ్డి, మండేపూడి పురుషోత్తం, మామిడి రాము, కొత్తా చిన్నపరెడ్డి, నందేటి రాజేష్, బైరెడ్డి రవీంద్రారెడ్డి, కొరిటిపాటి ప్రేమ్‌కుమార్, కొలకలూరి కోటేశ్వరరావు, ఈమని రాఘవరెడ్డి, సైదాఖాన్, చదలవాడ వేణు, ప్రభు తదితరులు పాల్గొన్నారు.


