తెనాలి: గుంటూరుకు చెందిన సాహిత్యకారుడు పెనుగొండ లక్ష్మీనారాయణ ‘దీపిక’ అభ్యుదయ సాహిత్య వ్యాసాల సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించటం అభినందనీయమని అభ్యుదయ రచయితల సంఘం (అరసం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్, కార్యదర్శి కె.శరచ్ఛంద్ర జ్యోతిశ్రీ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. పెనుగొండ యాభై ఏళ్లుగా అభ్యుదయ సాహిత్య వికాసానికి తెలుగునాట చేస్తున్న కృషికి తగిన గుర్తింపుగా, అభ్యుదయ సాహిత్యానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు. 1973లో సాధారణంగా మొదలైన పెనుగొండ ప్రస్థానం నేడు అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్ష స్థానం వరకు కొనసాగటం విశేషం. విలక్షణమైన విమర్శకుడిగా పెనుగొండ కృషి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
● అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు ప్రకటనపై అరసం గుంటూరు జిల్లా అధ్యక్షుడు చెరుకుమల్లి సింగారావు హర్షం వ్యక్తంచేశారు.