మంగళగిరి టౌన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌లో ఓ వ్యక్తికి ట్రాన్స్ హ్యూమరల్ రీ ప్లాంటేషన్ చేశారు. తెగిపోయిన చేతిని ఎయిమ్స్ ప్లాస్టిక్ సర్జన్లు తిరిగి జోడించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ జార్ఖండ్‌కు చెందిన 25 ఏళ్ల వ్యక్తి విజయవాడలోని హనుమాన్‌జంక్షన్ సమీపంలో రోడ్డు నిర్మాణ సంస్థలో మిషన్‌లోడ్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. గత నెల 22వ తేదీన మిషన్‌లో చేయి ఇరుక్కుపోయి తీవ్రంగా నుజ్జునుజ్జు అయ్యింది. అదేరోజు మంగళగిరిలోని ఎయిమ్స్ వైద్యశాల అత్యవసర విభాగానికి చికిత్స నిమిత్తం తీసుకువచ్చారు. వైద్యబృందం రోగికి పరీక్షలు నిర్వహించి, వైద్య సేవలు అందించింది. అరుదైన, అత్యంత క్లిష్టమైన మైక్రో వాస్క్యులర్ ప్లాస్టిక్ సర్జరీని డాక్టర్ శాంతకుమార్, డాక్టర్ శివలింగప్ప నేతృత్వంలోని బృందం, డాక్టర్ లిఖిత రెడ్డి, డాక్టర్ మనోజ్‌లు సుమారు 8 గంటల పాటు నిర్వహించారని, ప్లాస్టిక్ సర్జరీ, అనస్తీషియా బృందాలు ఈ శస్త్ర చికిత్సలో రక్తం ప్రసరించేలా చేసి చేతిని కాపాడారని పేర్కొన్నారు. తెగిపోయిన భాగాన్ని సకాలంలో ఆసుపత్రికి తీసుకురావడం వల్ల ఎయిమ్స్ వైద్యశాలలో నైపుణ్యం గల వైద్యులు ఉండడం వల్ల ఈ శస్త్రచికిత్స విజయవంతం అయినట్లు వైద్యులు పేర్కొన్నారు. శస్త్రచికిత్స అనంతరం 14 రోజులు క్రిటికల్ కేర్ యూనిట్‌లో నిశితంగా పరిశీలించామని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం స్థిరంగా ఉందని, వార్డులో కోలుకుంటున్నాడని, తదుపరి పరీక్షల అనంతరం డిశ్చార్జి చేస్తామని పేర్కొన్నారు. శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులను ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ అహంతం శాంతాసింగ్ అభినందించారు.


