జీవన ఎరువే భూములకు ఆరోగ్యరక్ష | - | Sakshi
Sakshi News home page

జీవన ఎరువే భూములకు ఆరోగ్యరక్ష

Jun 28 2024 2:24 AM | Updated on Jun 28 2024 2:24 AM

జీవన

జీవన ఎరువే భూములకు ఆరోగ్యరక్ష

అమరావతి: ప్రస్తుతం వ్యవసాయ రంగంలో జీవన ఎరువుల ప్రాధాన్యం పెరిగింది. పంటభూములలో సహజంగా ఉండే మిత్ర సూక్ష్మజీవ సంపదను కాపాడుకుంటూ భూమిని ఆరోగ్యంగా ఉంచేందుకు అమరావతి వ్యవసాయ పరిశోధన స్థానం ద్వారా ఐదు రకాల జీవన ఎరువులను ఘన, ద్రవరూపాలలో రైతులకు అందిస్తున్నారు. జీవన ఎరువులను రైతులకు అందించటంలో ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నేతృత్వంలో జీవన ఎరువుల తయారీలో అమరావతి వ్యవసాయ పరిశోధన స్థానాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దారు. అనుబంధంగా అనకాపల్లి, అనంతపురం, కడప, తదితర ప్రాంతాలలో పరిశోధన స్థానాలు ఏర్పాటు చేశారు.

రైజోబియం

అపరాల పంటలకు నత్రజని అందించు జీవన ఎరువుగా వాడాలి. పప్పుజాతి పైర్లలో కంది, పెసర, మినుము, శనగ, వంటి పైర్లకు, వేరు శనగ, సోయాచిక్కుడు వంటి నూనెగింజల పైర్లకు రైజోబియం కల్చర్‌ను విత్తనంకు పట్టించి ఉపయోగించాలి. దీనిని వల్ల మొక్క వేళ్లపై ఏర్పడిన లేత గులాబిరంగు బుడిపెలలో ఉన్న రైజోబియం గాలిలోని నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందిస్తుంది. ఈ రైజోబియం కల్చర్‌ ఒక్కొక్క పంటకు ఒక్కొక్క ప్రత్యేకమైన స్ట్రెన్‌ ఉంటుంది. రైజోబియంను 100 మిల్లీ లీటర్ల నీటిలో 10 గ్రాముల పంచదార లేదా బెల్లం లేదా గంజి పౌడర్‌ను కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చాలి. ఈ చల్లార్చిన ద్రావణం 10 కిలోల విత్తనాలపై చల్లి దానిపై 200 గ్రాముల రైజోబియం కల్చర్‌ పొడిని బాగా కలియబెట్టి విత్తనం చుట్టు పొరలా ఏర్పడే విధంగా చూడాలి. తరువాత విత్తనాన్ని 10 నిమిషాలు నీడలో ఆరబెట్టి పొలంలో నాటుకోవాలి.

అజిటోబాక్టర్‌

పప్పుజాతి పంటలను మినహాయించి మిగతా అన్ని పంటలకు నత్రజని జీవన ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ బ్యాక్టీరియా నత్రజనిని స్థిరీకరించటమే కాక మొక్కకు కావాల్సిన హార్మోన్లను, విటమిన్లను అందిస్తుంది. దీని వల్ల ముఖ్యంగా సేంద్రియ కార్బనం ఎక్కువగా భూమిలో సమర్థంగా పనిచేస్తుంది. ఈ జీవన ఎరువును ఆకుకూరలు, కూరగాయలు, పూల తోటలలో అధికంగా వాడతారు. ఏ పంటకై నా ఒక కిలో కల్చర్‌ను 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి విత్తనం నాటే సమయంలో ఒక ఎకరాకు చల్లాలి. చల్లిన సమయంలోగాని, లేక వెనువెంటనే గాని భూమిలో తగినంత తేమ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.

అజోస్పైరిల్లమ్‌

గతంలో కంటే ఇటీవల కాలంలో అజోస్పైరిల్లమ్‌ ప్రాముఖ్యతను రైతులు గుర్తించారు. ఈ బ్యాక్టీరియా మొక్క వేర్ల చుట్టూ పెరుగుతూ అవకాశం ఉన్న చోట వేళ్లలో కూడా జీవిస్తాయి. ఈ కారణంగా ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజని నేరుగా మొక్కకు అధికశాతం అందుబాటులో ఉంచుతుంది. ఈ జీవన ఎరువు పప్పుజాతి పంటలకు తప్పించి మిగిలిన పంటలకు వాడుకోవచ్చు. వరి, చెరకు, పత్తి, మిర్చి, జొన్న, సజ్జ, పొద్దు తిరుగుడు, అరటి మొదలైన పంటలలో సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్నప్పటికి ఈ జీవన ఎరువు పనిచేస్తుంది. తక్కువ కాలపు పంటలకు ఒకకిలో అజోస్రైరిల్లమ్‌ను 80–100 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి ఎకరం పొలంలో విత్తనం కిందపడేటట్లు చల్లాలి. నారుమడి వేసుకునే పంటలకు నారు పీకుటకు ముందుగా నారుమడి వద్ద 70 నుంచి 80 లీటర్లు పట్టే చిన్న మడి తయారు చేసుకుని ఆ నీటిలో ఒక కిలో అజోస్పైరిల్లాను బాగా కలిపి కలిపిన ద్రావణంలో పదినిమిషాలు వేళ్లను మాత్రమే ముంచి వెంటనే నాటుకోవచ్చు. చెరకు పంటలో నాటే విత్తనం చెరకు ముచ్చులను పది నిమిషాల పాటు ఈ ద్రావణంలో ముంచి నాటుకోవాలి.

ఫాస్పోబాక్టీరియా

ఈ జీవన ఎరువు ముఖ్యంగా బాసిల్లస్‌ మెగథీరియంతో గాని, సూడోమోనాస్‌గాని ఉపయోగించి తయారు చేస్తారు. ఈ జీవన ఎరువు భూమిలోని మొక్కలకు లభ్యం గాని రూపంలో ఉన్న భాస్వరాన్ని, లభ్యమయ్యే రూపంలోకి మార్చును. అన్ని పంటలకు వాడుకోవచ్చు. ఈ జీవన ఎరువు సమర్థంగా పనిచేయుటకు సేంద్రియ కర్బనం అత్యవసరం. ఈ ఎరువుతో తప్పనిసరిగా సేంద్రియ ఎరువు వాడాలి. దీంతో అధిక పంట దిగుబడి సాధ్యం. ఎకరాకు ఒకటి నుంచి 1.5 కిలోల ఫాస్ఫోబాక్టర్‌, 200 కిలోల పశువుల ఎరువుతో కలపి దుక్కిలోగాని, మొక్క నాటినప్పుడు గాని సాళ్లలో పడేటట్లు వేసుకోవాలి. వరి విషయంలో నాట్లు వేసిన 3 నుంచి ఏడు రోజుల వ్యవధిలో వేసుకోవాల్సి ఉంటుంది. ఎరువులు వాడే సమయంలో పొలంలో తగినంత తేమ అవసరం.

మైకోరైజావేమ్‌

ఈ మైకోరైజాల్‌ ఇనాక్యులమ్‌ను ఏదైనా సేంద్రియ ఎరువుతో కలపి విత్తనం లేదామొక్క వేళ్లకు కింద పడునట్లు జాగ్రత్త తీసుకోవాలి. ఒక ఎకరం పొలానికి సుమారు ఐదు కిలోల కల్చర్‌ను వాడాల్సి ఉంటుంది. ఇది మొక్కకు కావాల్సిన భాస్వరాన్ని సమృద్ధిగా అందిస్తుంది. సూక్ష్మధాతువులైన జింక్‌, మాంగనీసు, ఐరన్‌, కాపర్‌, కోబాల్ట్‌ మరియు మోలిబ్డిన్‌మ్‌ మొదలగు వాటిని ఉత్పత్తి చేస్తుంది. పంట నీటి ఎద్దడి నుంచి తట్టుకోవటానికి దోహదపడుతుంది. పంటను నులిపురుగులు మరియు రోగ నిరోధక శిలీంధ్రముల నుంచి రక్షణ. భూమిలో సేంద్రియ కర్భనం పెరగటానికి ఉపయోగపడును. ఈ జీవన ఎరువు పాక్షిక స్టైరెల్‌ పద్ధతిలో లిగ్నైట్‌ మరియు మెత్తటి ఇసుక మిశ్రమంతో తయారు చేస్తారు. దీనిని ఎండ తగలని, నీడ ప్రదేశంలో నిల్వ చేయాలి. రసాయనిక ఎరువులతో కలిపి వాడరాదు. నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే వాడాలి.

ద్రవజీవన ఎరువులు

రాష్ట్రంలోనే ప్రత్యేకత కలిగిన అమరావతి వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి ఉత్పత్తి చేస్తున్న జీవన ఎరువులు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుత ఈ పరిశోధనా స్థానం నుంచి మార్కెట్‌లో రైజోబియం, అజటోబాక్టర్‌, అజోస్పైరిల్లమ్‌, పాస్పోబ్యాక్టీరియా, మైకోరైజావేమ్‌ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు ఇక్కడ నుంచి పొడి రూపంలో అందించే ఈ జీవఎరువుల కాలపరిమితి 6 నెలలకు మించి నిల్వ ఉండే పరిస్థితి లేకపోవటంతో గతంలో కంటే నాణ్యంగాను, ఎక్కువకాలం నిల్వ ఉండేలా ద్రవరూపంలో అందిస్తున్నారు. ద్రవ జీవన ఎరువుల వలన రైతులకు అనేక లాభాలు ఉన్నాయని ద్రవజీవన ఎరువులు సంవత్సరం కాలంపాటు నిల్వ ఉండి అధికశాతం బ్యాక్టీరియాను గడువు తేదీ వరకు కలిగి ఉంటాయి.

జీవన ఎరువు వాడకం వల్ల ఉపయోగాలు

వాతావరణ కాలుష్యాన్ని అరికట్టవచ్చు,వాతావరణంలోను, నేలలోను మొక్కలు తమంత తాము ఉపయోగి ంచు కోలేని పోషకాలను అందుబాటులోకి తెస్తాయి. హార్మోన్లు, విటమిన్లు మొక్కకు లభ్యమయ్యే పెరుగుదల వేగంగాను, ఆరోగ్యకరంగాను ఉంటాయి.నేలనుండి సంక్రమించే తెగుళ్లను కొంతమేర నివారించ వచ్చు. నేల భౌతిక లక్షణాలు బాగుపడి భూసారం అభివృద్ధి చెందుతుంది. రైతులకు రసాయన ఎరువుల ఖర్చు తగ్గి లాభాల నిష్పత్తి పెరుగుతుంది. సాధారణ దిగుబడుల కంటే 10 నుంచి 20 శాతం వరకు దిగుబడులు పెరుగుతాయి. రసాయన ఎరువుల వాడకం తగ్గుతుంది.

తక్కువ ఖర్చుతో నాణ్యమైన దిగుబడులు భూములలో రసాయన సమతుల్యం మెరుగు అమరావతి పరిశోధన స్థానంలో అందుబాటులో ఎరువులు

జీవన ఎరువుల ఉపయోగాలు

వ్యవసాయంలో అధిక రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల భూమిలో, ఉపరితలం పైనా పర్యావరణ కాలుష్యంతో పాటు రైతులకు పెట్టుబడి అధికమవు తుంది. ఈ నేపద్యంలో సమన్వయసమగ్ర భూసార పరిరక్షణా పద్దతులను రైతులు మరచి సేంద్రియ ఎరువుల జీవన ఎరువుల వాడకం కూడా తగ్గుముఖం పడుతున్నం దువల్ల భూమిలో రైతుకు మేలు చేసే సూక్ష్మాంగ జీవులు తగ్గి మొక్కకు పోషక పదార్ధాలు, హార్మోన్‌లను సమకూర్చే వీలులేకుండా పోతుంది. జీవన ఎరువులు వాడటం వల్ల మొక్కకు అనుగుణమైన మార్పులు జరిగి రైతుకు మేలు చేసే మిత్ర సూక్ష్మజీవుల సంఖ్య అనూహ్యంగా పెరగటంతో మొక్కకు అవసరమైన వివిధ పోషకాలతో పాటు హార్మోన్లను,విటమిన్‌లను అందించేందుకు వీలు కలుగుతుంది. జీవన ఎరువులలో నత్రజనిని స్థిరీకరించే ఏడు రకాల జీవన ఎరువులలో అమరావతి వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఐదు రకాల జీవన ఎరువులను ద్రవ, ఘనరూపా లలో తయారు చేసి రైతులకు అందింస్తున్నారు.అందులో రైజోబియం, అజటోబాక్టర్‌, అజోస్పైరిల్లమ్‌, పాస్పోబ్యాక్టీ రియా,మైకోరైజావేమ్‌ లను రైతులకు తక్కువధరకు అందిస్తున్నారు.

వాడకంలో జాగ్రత్తలు

జీవన ఎరువు ప్యాకెట్లను వేడి తగలని నీడ ప్రదేశంలో నిల్వ ఉంచాలి. పంటకు సరైన జీవన ఎరువును ఎంపిక చేసుకోవాలి. గడువు తేదీని గమనించి జీవన ఎరువును వాడాలి. రసాయనాలతో విత్తనశుద్ధి చేసేటప్పుడు తప్పక 48 గంటల వ్యవధిలో వాడాలి. రసాయన ఎరువులతో కలిపి వాడరాదు. సేంద్రియ ఎరువుతో జీవన ఎరువును కలిపి వెంటనే పంటకు వాడుకోవాలి.

సబ్సిడే ధరకే జీవన ఎరువులు

రైతులకు అవసరమైన జీవన ఎరువులను సబ్సిడీ ధరలకే అందిస్తున్నాం. ఈ ఖరీఫ్‌, రబీ సీజన్‌లలో సుమారు ఏడు వేల లీటర్లకు పైగా ద్రవ జీవన ఎరువులు రైతులకు అందించాలని నిర్ణయించాం. వివరాలకు వ్యవసాయ పరిశోధనా స్థానం, అమరావతి–522020, గుంటూరు జిల్లా ఫోన్‌నెం.08645 255345లో సంప్రదించవచ్చునన్నారు.

–ఎం.శ్రీరేఖ, ప్రిన్సిపాల్‌ శాస్త్రవేత్త,

అమరావతి వ్యవసాయ

పరిశోధన స్థానం

జీవన ఎరువే భూములకు ఆరోగ్యరక్ష 1
1/1

జీవన ఎరువే భూములకు ఆరోగ్యరక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement