
సాక్షి, తాడేపల్లి: పులివెందులలో పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎన్నిక జరిపారని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. తండ్రీకొడుకులు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారని ఘాటు విమర్శలు చేశారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఎదుటే టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారు అంటూ ఆధారాలు చూపించారు.
మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎన్నిక జరపడమేంటి?. సమాజానికి దిక్సూచిగా ఉండాల్సిన పోలీసులు ఇలాగేనా చేసేది. పులివెందులలో ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగాయని టీడీపీ నేతలే నమ్మడం లేదు. చంద్రబాబు, లోకేష్ మాటలను టీడీపీ నేతలే నమ్మడం లేదు. ఇతర ప్రాంతాల టీడీపీ నేతలు పులివెందులలో ఎలా ఓట్లు వేశారు. వైఎస్ జగన్ ప్రశ్నలకు ప్రభుత్వం ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్లాన్ ప్రకారమే రీపోలింగ్ పెట్టింది.
పులివెందులలో టీడీపీ నేతలు చేసిన అరాచకాలు ప్రజలందరూ చూశారు. కిరాయి మీడియాతో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయించారు. చంద్రబాబు సర్కార్ ప్లాన్ ప్రకారమే జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టింది. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. టీడీపీ అరాచకాలకు ఉన్నతాధికారులు కూడా వంత పాడారు. సీసీ ఫుటేజీ, వెబ్ క్యాస్టింగ్ ఇచ్చేందుకు ఎన్నికల సంఘానికి భయమెందుకు?. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఎదుటే టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారు. తండ్రీకొడుకులు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారు అని మండిపడ్డారు.
టీడీపీ నేతలు ఇచ్చిన వీడియోల్లోనే దొంగ ఓటర్లు బయటపడ్డారు. ఇతర ప్రాంతాల టీడీపీ నేతలు పులివెందులలో ఎలా ఓట్లు వేశారు?. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ఎమ్మెల్యేలకు రిగ్గింగ్ చేయాలని కాంట్రాక్ట్ ఇచ్చారు. పోలింగ్ బూత్‌ల వద్ద ఎక్కడా కూడా క్యూలైన్లలో మహిళలు కనిపించలేదు. గ్లాస్ దొంగలను.. సైకిల్, పువ్వు దొంగలు నమ్మలేదు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికతో చంద్రబాబు ఏం సాధించారు. పులివెందులలో టీడీపీ నేతలే వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేశారు. కూటమిలో బీజేపీ, జనసేన డమ్మీ పార్టీలు. పులివెందులలో జరిగింది ఎన్నిక కాదు. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్తారు’ అని చెప్పుకొచ్చారు.

2024 ఎన్నికల్లో పోలైన ఓట్ల కంటే లెక్కింపులో ఎక్కువ ఓట్లు వచ్చాయి. చాలా పార్టీల్లో చంద్రబాబు బ్రోకర్లు ఉన్నారు. ఇతర పార్టీల్లో బ్రోకర్లను పెట్టుకుని పనిచేయడం చంద్రబాబు నైజం. గతంలో చంద్రబాబు అసెంబ్లీకి వచ్చారా?. చంద్రబాబుకు పౌరుషం ఉంటే 2019-24 వరకు ఎంత జీతం తీసుకున్నారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.