
శాంతి చర్చల ద్వారా సమస్యల పరిష్కారం
తాడికొండ: శాంతి చర్చల ద్వారానే ఎంతటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని తుళ్లూరు డీఎస్పీ ఇ.అశోక్ గౌడ్ సూచించారు. తాడికొండ మండలం నిడుముక్కల గ్రామంలో పోలింగ్ రోజున గొడవలు జరిగిన నేపథ్యంలో పోలీసులు సోమవారం ఇరు వర్గాలతో విడివిడిగా సమావేశమయ్యారు. ఒక్కో వర్గం నుంచి 15 మంది చొప్పున మొత్తం 30 మందితో శాంతి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం పూర్తిగా అవసరమని, చిన్నచిన్న విషయాలకు భేషజాలకు పోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని వివరించారు. వివాదాలు, కేసుల వల్ల ఏళ్ళ తరబడి కుటుంబాలు ఇబ్బంది పడతాయని వివరించారు. కేసులు నమోదైతే విద్యార్థుల జీవితాలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని వెల్లడించారు. అనంతరం శాంతి కమిటీతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో తాడికొండ సీఐ సీహెచ్ ప్రభాకర్, ఎస్‌ఐలు అంజయ్య, రవీంద్ర బాబు పలువురు సిబ్బంది, ఇరు వర్గాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
22న ఐఎంఏవైద్య విద్యా కార్యక్రమం
గుంటూరు మెడికల్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) గుంటూరు శాఖ ఆధ్వర్యంలో ఈనెల 22న వైద్యులకు నిరంతర వైద్య విద్యా (సీఎంఈ) కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఐఎంఏ గుంటూరు శాఖ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ నూతక్కి శ్రీనివాసరావు, డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం సాయంత్రం జీఎంఏ భవనంలో నిర్వహించే కార్యక్రమంలో గుండె సంబంధ వ్యాధులు – అత్యాధునిక చికిత్స పద్ధతులపై ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి.ఎం.ఎస్.హరిత, ఎముకలు కీళ్ల వ్యాధులు– ఆధునిక శస్త్ర చికిత్స విధానాలపై డాక్టర్ గూడూరు జగదీష్, డాక్టర్ చిట్టా రంజన్ సాహూ ప్రసంగిస్తారని పేర్కొన్నారు. వైద్యులందరూ ఈ వైద్య విద్యా కార్యక్రమానికి తప్పక హాజరుకావాలని కోరారు.
ధీశాలి ప్రకాశం పంతులు
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): తెల్లదొరల తుపాకులకు తన గుండెను చూపి ముందుకు సాగిన ధీశాలి టంగుటూరి ప్రకాశం పంతులు అని శాసన మండలి విప్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి కీర్తించారు. టంగుటూరి వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం బృందావన్ గార్డెన్స్‌లోని విప్ కార్యాలయంలో ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విప్ అప్పిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రకాశం పంతులు అభివృద్ధి, సంక్షేమం కోసం పాటు పడ్డారన్నారు. సామాన్య కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని నీతినిజాయితీతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన ఘనత టంగుటూరి సొంతమన్నారు. మహాత్మాగాంధీ స్పూర్తితో దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రవేశించినా అవసరమైతే గాంధీనే ప్రశ్నించే రాజీలేనితత్వం ప్రకాశం పంతులదని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు మాట్లాడుతూ ప్రకాశం పంతులు నేటి యువతకు ఆదర్శమన్నారు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించి భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆధ్యుడిగా నిలిచారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఈచంపాటి వెంకటకృష్ణ (ఆచారీ), వైఎస్సార్ సీపీ నేతలు పరిశపోగు శ్రీనివాసరావు, నరసింహారావు, వెలుగూరి రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరా చోరీ
చీరాల అర్బన్: చీరాల రూరల్ మండలం పుల్లాయపాలెంలోని పోలింగ్ బూత్‌లో సీసీ కెమెరా చోరీకి గురైంది. ఈపూరుపాలెం రూరల్ పోలీసుల వివరాల మేరకు.. పుల్లాయపాలెంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్‌లో రెండు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే, అందులో ఒకటి కనిపించలేదు. మహిళా పోలీసు ధనలక్ష్మి సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఈపూరుపాలెం ఎస్‌ఐ శివకుమార్ తెలిపారు.