‘పీడీ’త జన రక్ష కోసం | - | Sakshi
Sakshi News home page

‘పీడీ’త జన రక్ష కోసం

Nov 9 2023 1:30 AM | Updated on Nov 9 2023 1:30 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు జిల్లా పరిధిలో ఒకేరోజున నలుగురిపై పోలీసులు పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. గంజాయి, మత్తు పదార్థాలు విక్రయించటం, మరణాయుధాలు కలిగి ప్రజల్ని భయపెట్టటంలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని గుంటూరు రేంజ్‌ ఐజీ జి.పాలరాజు హెచ్చరించారు. పీడిత జన రక్ష కోసం కఠిన చర్యలకూ వెనుకాడబోమని స్పష్టం చేశారు. ప్రజలకు, ప్రజల ఆరోగ్యానికి భంగం కలిగించకుండా, సమాజంలో సత్ప్రవర్తన కలిగి ఉండేలా నడుచుకోవడం కోసమే ఇటువంటి శిక్షలు అమలు చేస్తామని, వీటినీ లెక్క చేయకుండా వరుస నేరాలకు పాల్పడితే ఎట్టిపరిస్థితిల్లోనూ చూస్తూ ఊరుకోబోమని ఆయన ఉద్ఘాటించారు. గుంటూరు జిల్లాలో పెదకాకాని, తెనాలి ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌, తెనాలి మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌, దుగ్గిరాల పోలీసు స్టేషన్‌ పరిధిలో మొత్తం నలుగురు నిందితులపై పీడీ యాక్ట్‌ నమోదు చేసి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించినట్లు ఐజీ పాలరాజు, గుంటూరు అడ్మిన్‌ అడిషనల్‌ ఎస్పీ సుప్రజ ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు రేంజ్‌ పరిధిలో శాంతి భద్రతలు, యువత భవిష్యత్తు పరిరక్షణే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. సమాజంలో శాంతి భద్రతలపై ప్రభావం పడేలా తీవ్ర నేరాలకు పాల్పడుతున్న వారిపై ఈ చట్టాన్ని ప్రయోగిస్తున్నట్లు స్పష్టం చేశారు. గుంటూరు రేంజ్‌ పరిధిలో నేరస్తుల కదలికలు, కార్యాకలపాలపై ఎప్పటికప్పుడు నిఘా పెడుతున్నట్టు వివరించారు. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు వెల్లడించారు. ఈ యజ్ఞంలో ప్రజలూ భాగస్వాములు కావాలని, తమ ప్రాంతాలలో గంజాయి అక్రమ రవాణా, అమ్మకం, తాగడం జరుగుతున్నట్టయితే 14500, కానీ కంట్రోల్‌ రూం ఫోన్‌ నంబర్‌ 8688831568కి గానీ డయల్‌ చేయాలని, లేనిపక్షంలో దగ్గరలోని పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని హామీ ఇచ్చారు.

పీడీ కేసులు నమోదైన వారు వీరే..

పెదకాకాని మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన 21 ఏళ్ల షేక్‌ లతీఫ్‌పై మూడు గంజాయి కేసులు నమోదయ్యాయి. తెనాలి ఐతా నగర్‌కు చెందిన 23 ఏళ్ల చేబత్తిన అఖిల్‌పై మూడు గంజాయి కేసులు ఉన్నాయి. చిన్నరావూరు శివాలయం వద్ద ఉండే 31 ఏళ్ల షేక్‌ నాయబ్‌ రసూల్‌పై రెండు హత్య కేసులు, దొంగతనం, కొట్లాట వంటి ఏడు కేసులు ఉన్నాయి. తెనాలి చెంచుపేటకు చెందిన 28 ఏళ్ల షేక్‌ అక్బర్‌పై దాదాపు 16 కేసులు నమోదు అయ్యాయి. ఈ నలుగురిపై పోలీసులు పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. ఇప్పటివరకూ జిల్లాలో తొమ్మిది మందిని పీడీ యాక్ట్‌ ద్వారా రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు పంపగా, బుధవారం మరో నలుగురిని పంపడంతో జిల్లాలో 13 మందిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించినట్టయింది.

ఒకేరోజు నలుగురిపై పీడీ యాక్ట్‌ గంజాయి అమ్మకాలు, రౌడీయిజంపై ఉక్కుపాదం ఐజీ పాలరాజు వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement