హ్యాకర్స్‌ ఆఫ్‌ డెమాక్రసీ!

Vardelli Murali Guest Column Hackers Of Democracy In Sakshi

జనతంత్రం

మందిరంలో నిద్రిస్తున్న రాజకుమారి మగత నిద్రతోనే తన శయ్యపైనుంచి లేచి ఎవరో ఆదేశించినట్టుగా ఎటో వెళ్లి పోతుంది. ఇటువంటి జానపద కథల్లో మాయగాళ్లు మంత్ర శక్తితో తాము లక్ష్యంగా ఎంచుకున్న వారి ఆలోచనల్ని స్వాధీనం లోకి తీసుకుని రిమోట్‌ కంట్రోల్‌తో నిర్దేశిస్తుంటారు. కొన్ని సైన్స్‌ ఫిక్షన్‌ కథలుంటాయి. ఈ కథల్లో శాస్త్రవేత్తలు మరమనుషుల్ని తయారుచేస్తారు. యజమాని ఆదేశాల ప్రకారం ఆ మరమనిషి అద్భుతాలు చేస్తుంది. హఠాత్తుగా మరమనిషిలో మార్పు వస్తుంది. యజమాని ఆదేశాలకు విరుద్ధంగా పని చేయడం ప్రారంభిస్తుంది. ఒక అదృశ్య హస్తమేదో ఆ మర మనిషి ప్రోగ్రామింగ్‌లో ఏవో మార్పులు చేస్తుంది. ఫలితంగా నిర్దేశిత లక్ష్యం నుంచి మరమనిషి తప్పుకుంటుంది. 

కంప్యూటర్లూ వాటి హార్డ్‌వేర్‌–సాఫ్ట్‌వేర్‌ల తాలూకు నెట్‌ వర్క్‌లు ఇప్పుడు సమస్త మానవాళి ఆలనాపాలనా చూస్తు న్నాయి. ఈ నెట్‌వర్క్‌లన్నీ వాటి నిర్దేశిత లక్ష్యాలతో పని చేస్తున్నాయి. నెట్‌వర్క్‌ల భద్రతా కుడ్యాలను కూడా ఛేదించే చోరులు చాలామంది తయారయ్యారు. వీళ్లను హ్యాకర్లు అని పిలుస్తున్నాం. ఈ హ్యాకర్లు కంప్యూటర్ల నెట్‌వర్కుల్లోకి అక్ర మంగా చొరబడుతారు. అత్యంత రహస్యమైన సమాచారాన్ని తస్కరిస్తారు. బ్యాంకింగ్, ఫైనాన్స్‌ రంగాల మీద దాడులు జరిపి జనం సొమ్మును తేరగా కొట్టేస్తుంటారు. ఇటువంటి సైబర్‌ దాడుల ఫలితంగా ఆర్థిక వ్యవస్థకు జరుగుతున్న నష్టం మన జాతీయ స్థూల ఉత్పత్తితో దాదాపు సమానం. డిజిటలైజేషన్‌ పెరుగుతున్నకొద్దీ ఈ హ్యాకింగ్‌ దొంగల బెడద కూడా పెరుగు తుందట. మనుషుల్లో అక్కడక్కడా మంచివాళ్లు ఉన్నట్టే హ్యాకర్లలో కూడా కొందరు మంచివాళ్లు ఉంటారు.

కంప్యూటర్‌ వ్యవస్థలను నియంత్రించి నిర్దేశిత లక్ష్యాల నుంచి దారి తప్పించే హ్యాకర్ల వంటి వాళ్లు ప్రజాస్వామ్య వ్యవస్థల్లో కూడా ఉన్నారు. కాకపోతే వారికి ప్రత్యేకంగా మనం ఏ పేరూ పెట్టుకోలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థల హ్యాకింగ్‌లో ఆరితేరిన వ్యక్తి మన తెలుగువాడేనని ఘంటాపథంగా చెప్పు కోవచ్చు. కంప్యూటర్‌ను కనిపెట్టిన వ్యక్తి కూడా తానే కనుక, హ్యాకింగ్‌ పద్ధతుల్లో కూడా ఆయనకు అరివీర భయంకరమైన తెలివితేటలు ఉన్నాయని అంటారు. రాజకీయాల్లో విశ్రాంతి లేకుండా గడిపే ఆయన, వీలు చిక్కినప్పుడల్లా ఐఐటీ, ఐఐఎమ్, ఎయిమ్స్, ఎమ్‌ఐటీ, స్టాన్‌ఫోర్డ్‌ తదితర విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తారు. వారికి కొన్ని మెళకువలను కూడా నేర్పుతుంటారు. ఈరోజు కూడా బొంబాయి ఐఐటీ విద్యార్థులతో మాట్లాడారు. సైబరాబాద్‌ నిర్మించింది తానేనని మరోసారి వారికి గుర్తుచేశారు. కొన్ని సైబర్‌ టెక్నిక్స్‌ను కూడా వారికి నేర్పించే ఉంటారు.

భారతీయులమైన మనం, మనల్ని పరిపాలించుకోవడం కోసం ఒక రాజ్యాంగాన్ని, దానిని అనుసరించి కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాము. ఈ వ్యవస్థల మధ్య అప్పుడప్పుడూ అపార్థాలూ, అభిప్రాయభేదాలూ కలిగినా మౌలికంగా అవన్నీ సైద్ధాంతికమైనవే కనుక మన ప్రజాస్వామ్య వ్యవస్థ పదిలంగానే ఉంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో మన సైబరాబాద్‌ నిర్మాత సుమారు పాతికేళ్ల నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థల్లోకి తన ట్రోజన్‌ హార్స్‌లను జొప్పించడం ప్రారంభించారు. ఈ అనైతిక చర్యల వల్ల ఆయనకు వ్యక్తిగతంగా చాలాసార్లు లాభం కలిగింది. పద్దెని మిది అవినీతి కేసుల్లో దశాబ్దాల తరబడి ‘స్టే’లతో గడిపే అవకాశం చిక్కింది. చిన్నాచితక కేసుల్లో దర్యాప్తునకు కూడా సిద్ధంగా ఉండే సీబీఐ ఈయనపై దర్యాప్తు చేయడానికి తమవద్ద సిబ్బంది లేదనే చిత్రమైన సాకును చెప్పింది.

అప్పటితరం వారికి అందరికీ తెలుసు. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపిం చినప్పుడు పార్టీ జెండాను ఆయనే స్వయంగా డిజైన్‌ చేసు కున్నారు. పార్టీ ఎన్నికల గుర్తును తానే ఎంపిక చేసుకున్నారు. వాటి గురించి ఆయన తన్మయత్వంతో మీడియా ముందు వివరించారు కూడా. అవన్నీ ప్రజలకు గుర్తే. అయినా కూడా ఆ గుర్తుతోనూ, ఆ జెండాతోనూ, ఆ పార్టీతోనూ ఎన్టీ రామారావుకు సంబంధం లేదని తీర్పు వచ్చేలా ఈయన ఆ కేసును నడప గలిగాడు. వ్యవస్థల హ్యాకింగ్‌లో మెజారిటీ మీడియా అండ దండలు ఈయనకు పుష్కలంగా లభించాయి. ఈ కార్య క్రమంలో ఇద్దరూ (పార్టీ–పచ్చమీడియా) భాగస్వాములుగా వ్యవహరించారు.

వ్యవస్థల్లోని అనేక కీలక స్థానాల్లోకి చేరుకున్న ఆయన ట్రోజన్‌ హార్స్‌లు తనను ఆపదల నుంచి బయటపడే యడంతోపాటు, ఆయన ప్రత్యర్థులను బాధించడంలోనూ ప్రముఖపాత్రను పోషించాయి. ఆయన రాజకీయ ప్రత్యర్థి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డిపై అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీతో కలిసి కుట్రపూరిత కేసులను బనాయించారు. ఈ కేసులను, సీబీఐ విచారణ తీరుతెన్నులను పరిశీలించిన అనేకమంది ప్రముఖులు, న్యాయ నిపుణులూ విస్మయాన్ని ప్రకటించారు. సీబీఐ వాదన నిలబడేది కాదని బహిరంగంగానే మాట్లాడారు. అయినా సరే, పదేళ్ల కిందట తామే అల్లిన కథను ఒక వాస్తవమని భ్రమింప జేస్తూ డెమాక్రసీ హ్యాకర్లు ప్రచారంలో పెడుతూనే ఉన్నారు.

నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఉరఫ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధానా ధికారి. జానపద కథల్లోని రాజకుమారి మంత్రశక్తి ఫలితంగా మగత నిద్రలోనే నడుస్తూ వెళ్లినట్టుగా ఈయన పార్క్‌హయత్‌ హోటల్‌కు వెళ్లడం, తెలుగుదేశం అధినేత ఆంతరంగికులతో సమావేశం అవ్వడం, కెమెరాలకు చిక్కడం ఒక తాజా ఘటన. నామినేషన్ల ఘట్టం కూడా పూర్తయిన తర్వాత అప్పటికి రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 26 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులను బూచిగా చూపి, రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించాలన్న నిబం ధనను విస్మరించి స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదావేసిన సంఘటన ప్రజాస్వామ్య ప్రియులందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఒక రాజకీయ ప్రత్యర్థి తరహాలో ముఖ్యమంత్రిపై అభ్యంతరకరమైన రీతిలో కేంద్రానికి ఉత్తరం రాయడం ప్రజాస్వామిక చరిత్రలో నభూతో న భవిష్యతి! ప్రస్తుతం దాదాపుగా రోజుకు మూడువేల కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న తరుణంలో ఎన్నికల నిర్వ హణకు తయారవ్వడం ఒక విడ్డూరం. కాకపోతే హ్యాకింగ్‌ ఆఫ్‌ డెమాక్రసీ మహిమ.

ఓటుకు నోట్లు కేసు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ఎప్పటికీ గుర్తుంటుంది. రేవంత్‌రెడ్డి గుర్తే. సెబాస్టియన్‌ గుర్తే. స్టీఫెన్సన్‌ గుర్తే. 50 లక్షల సూట్‌కేసు బాగా గుర్తు. ‘మావాళ్లు బ్రీఫ్‌డ్‌ మీ బ్రదర్‌’ అన్న ఆ కంఠస్వరం బ్లాక్‌బస్టర్‌ ఆఫ్‌ ద టూ థౌజండ్‌ ఫిఫ్టీన్‌. ‘దొరికిన దొంగవు నువ్వు చంద్రబాబూ... నిన్ను బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేడు’ అన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెచ్చరిక కూడా బాగా పాపులర్‌. ఈ కేసుకు సంబంధించిన ఆడియోలు అందరూ విన్నారు. వీడియోలు అందరూ చూశారు. ఆ కేసు ఇప్పుడు విచారణకు వచ్చింది. అయితే, నిందితుల జాబితాలో ఆదిపురుషుని పేరు లేదు. నా మీద ఎన్నో ఆరో పణలు చేశారు. ఒక్కటీ నిరూపించలేకపోయారు అని ఆయన ప్రత్యర్థులపై విరుచుకుపడతారు. అలా నిరూపించలేకపోవడం వెనుక ఇంత చిదంబర రహస్యం ఉంది.

సుప్రసిద్ధ అమెరికన్‌ మేధావి నోమ్‌ చోమ్‌స్కీ వందో పుస్తకం ‘రెక్వియమ్‌ ఫర్‌ ది అమెరికన్‌ డ్రీమ్‌’ ఆయనకు దాదాపు తొంభయ్యేళ్ల వయసులో ఈమధ్యనే అచ్చయింది. నయా ఉదారవాద ప్రజాస్వామ్యాలు క్రమంగా ఎలా ధనస్వామ్య వ్యవస్థలుగా రూపాంతరం చెందుతున్నాయో పది సూత్రాలతో ఆయన వివరించారు. ప్రధానంగా అమెరికన్‌ రాజకీయ వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ విశ్లేషణ చేసినప్పటికీ భారత రాజకీయ పరిణామాలు అందులో ముఖ్యంగా చంద్ర బాబు రాజకీయ ప్రయాణం స్పష్టంగా కనిపిస్తున్నది. ఉదార వాద విధానాల ఫలితంగా సంపద కేంద్రీకృతం కావడం క్రమంగా కేంద్రీకృత అధికారానికి దారితీస్తుంది. ఎన్నికల వ్యయం భారీగా పెరుగుతుంది. ఫలితంగా  రాజకీయ పార్టీలు కార్పొరేట్‌ సంస్థల కనుసన్నల్లో మనుగడ సాగిస్తాయి. కనుక ఇవి అమలుచేసే విధానాల ఫలితంగా సంపద మరింత కేంద్రీ కృతమవుతుంది. కేంద్రీకృత సంపదకు, అధికారానికి విస్తృత ప్రజాస్వామ్యం, పౌరహక్కులు వంటి మాటలు నచ్చవు. ప్రజాస్వామ్యాన్ని పరిమితం చేయాలని అవి కోరుకుం టాయంటాడు చోమ్‌స్కీ. ఎన్టీఆర్‌పై కుట్రచేసి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పరిపాలన కార్పొరేట్‌ సంస్థల ప్రాపకం కోసం పాకులాడే విధంగానే ఉండేది. ఆయన హయాంలోనే ఎన్నికల వ్యయం ఆకాశాన్ని అంటింది. సామాన్య ప్రజలు ఎన్నికల పోటీకి దూరం కావాల్సి వచ్చింది.

చోమ్‌స్కీ చెప్పిన పది సూత్రాల్లో ఆరోది నియంత్రణ సంస్థ లను ఆక్రమించడం (రూల్‌ రెగ్యులేటర్స్‌). అంటే ఆర్థిక రంగాన్ని నియంత్రించే సంస్థను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆక్రమిం చుకోవడం, ప్రైవేట్‌ రవాణా రంగాన్ని నియంత్రించే సంస్థను ప్రైవేట్‌ రవాణా కంపెనీలు స్వాధీనం చేసుకోవడం, విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్, ప్రైవేట్‌ విద్యుత్‌ సంస్థల అజమాయిషీలో ఉండటం అన్నమాట. ఫలితం ఎలా ఉంటుందో ఊహించు కోవచ్చు. ఒక రాజకీయ పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థలను హ్యాక్‌ చేసి ట్రోజన్‌ మాల్‌వేర్‌ను ప్రవేశపెట్టడం ద్వారా ఆశించే ప్రయో జనం అక్షరాల అటువంటిదే. అందువల్లనే ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖకు విస్తారమైన మద్దతు లభించింది. ఆ లేఖపై చర్యలను చేపట్టడం ద్వారా వ్యవస్థల ప్రక్షాళనకు పూనుకోవాలని మేధావులు కోరుకుంటున్నారు.
వర్ధెల్లి మురళి 
muralivardelli@yahoo.co.in

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top