మాధవ్ శింగరాజు
అక్టోబర్ 8 ఎయిర్ ఫోర్స్ డే. అక్టోబర్ 27 నా బర్త్ డే. 94 ఏళ్లుగా ఎయిర్ ఫోర్స్ డే, 61 ఏళ్లుగా నా బర్త్ డే ఏటా వస్తున్నవే. తొలిసారి ఈ ఏడాది నా జీవితంలోకి కొత్తగా అక్టోబర్ 31 ఎంటర్ అవుతోంది. అది నా రిటైర్మెంట్ డే!
అక్బర్ రోడ్ లోని ‘ఎయిర్ హౌస్’ బయట, భారత వాయు సేన శక్తిని చాటుతూ ‘రఫేల్’ ఫైటర్ జెట్ నమూనా కనిపిస్తూ ఉంటుంది. రఫేల్‌కు ముందు అక్కడ సుఖోయ్ ఉండేది.
‘ఎయిర్ హౌస్’ అనేది ఎయిర్ ఫోర్స్ చీఫ్ అధికారిక నివాసం. నాకు ముందర అందులో వివేక్ రామ్ చౌదరి ఉండేవారు.
‘‘రిటైర్మెంట్ తర్వాత మీరు ఏం చేస్తారు మిస్టర్ సింగ్?’’ అని ప్రెస్ మీట్‌లో ఒక రిపోర్టర్ నన్ను అడిగారు.
అది నాకు చివరి ప్రెస్ కాన్ఫరెన్స్ కనుక ఆ రిపోర్టర్ అలా అడిగి ఉంటారు.
‘‘రైట్, ఇన్నాళ్లూ నేను ఆర్డర్లు వేశాను. అక్టోబర్ 31 తర్వాత ఇంట్లో ఇచ్చే ఆర్డర్‌లు పాటించడమే నా పని! బయట కమాండింగ్ చేయడం కంటే ఇంట్లో కమాండ్‌ను తట్టుకోవడం టఫ్ జాబ్...’’ అన్నాను నవ్వుతూ.
మరణానంతర జీవితంలా, ఉద్యోగ విరమణానంతర జీవితం పెద్ద మిస్టరీ. చిన్న నవ్వుతో తేల్చేయకపోతే కాక్‌పిట్ లోంచి
కిందకు దిగబుద్దే అవదు.
‘‘మీరు మరేదైనా భిన్నంగా చేసి ఉంటే బాగుండేది అని మీకు అనిపిస్తోందా?’’ అని మరొక రిపోర్టర్!
‘ఆపరేషన్ సిందూర్’ గురించి నాలో ఏదైనా ఒక అంతర్మథనం ఉండి ఉంటే, దానిని నాతో చెప్పించాలని అతడి ప్రయత్నం!
‘‘అవును, భిన్నంగా చేసి ఉండాల్సింది. నేను ప్రతిరోజూ ఇంకో గంట ముందుగా నిద్రలేచి, ఇంకో గంట ఎక్కువ సేపు పనిచేయడానికి నన్ను నేను ఒత్తిడి చేసుకుని ఉంటే బాగుండేదనిపిస్తోంది. ఎందుకంటే ప్రతి కొత్త రోజూ, ప్రతి కొత్త గంటా మనకు కొత్త విషయం నేర్పుతుంది’’ అన్నాను.
ఆ రిపోర్టర్ తీవ్రమైన నిరుత్సాహానికి గురయ్యారు. అతడి ‘ఆపరేషన్ అంతర్మథనం’ ఫలించలేదు మరి!
‘‘మిస్టర్ ఎయిర్ చీఫ్ మార్షల్, మనుషుల్లో మీకు నచ్చేదేమిటి, నచ్చనిది ఏమిటి?’’.. ఒక మహిళా రిపోర్టర్.
ఆమె ఒక్కరే... నా రిటైర్మెంట్ సముద్ర మట్టానికి ఇంకా కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉందన్న స్పృహతో నన్ను ప్రశ్నించారు.
ఏమైనా ఆడపిల్లలు సెన్సిబుల్!
‘‘నాకు వేగం నచ్చుతుంది మిస్ మేడమ్‌జీ. ఇక నచ్చనిది అంటే... అది కూడా వేగమే. వేగంగా లేకపోవటం నాకు నచ్చదు. వేగంగా మాట్లాడనివాళ్లు, వేగంగా పని చేయనివాళ్లు, వేగంగా ఫైళ్లు చూడనివాళ్లు, వేగంగా
సంతకాలు చేయనివాళ్లు నాకు నచ్చరు.
అందుకే హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నాకు నచ్చదు..’’ అన్నాను పెద్దగా నవ్వేస్తూ.
హెచ్.ఎ.ఎల్. కి 220 ఫైటర్ జెట్‌ల తయారీ ఆర్డర్ ఇస్తే, ఈ పదేళ్లలో 40 జెట్‌లు మాత్రమే డెలివరీ చేయగలిగింది!
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తరచూ నన్ను ఈ జెట్ డెలివరీల డిలే గురించే అడిగేవారు... ‘‘పనులు వేగంగానే నడుస్తున్నాయా అమర్ సింగ్ జీ?!’’ అని.
‘‘మిస్టర్ మినిస్టర్, మేమైతే శబ్ద వేగానికి రెండు రెట్ల వేగంతో వెళుతున్నాం. కింద మన బ్యూరోక్రసీనే కాస్త వేగం పెంచాలి. మేము కాక్‌పిట్‌లో స్పేస్‌షిప్ వేగంతో వెళ్లాలనుకుంటే, ప్రాసెస్ మాత్రం ఎద్దుల బండి వేగంతో కదులుతోంది..’’ అని ఆయనతో అంటాను.
జీవితంలోనైనా, చేసే పనిలోనైనా వేగం లేకపోతే చేసిన పని వల్ల ప్రయోజనం ఉండదు.
ఎయిర్ బేస్‌లో ప్రెస్ మీట్ అయ్యాక నేరుగా ఎయిర్ హౌస్‌కి వచ్చేశాను. సరితా సింగ్ ఇల్లు షిఫ్టింగ్ పనులకు సిద్ధమవుతున్నారు. ఆమె నా అర్ధాంగి మాత్రమే కాదు, నా వేగాన్ని ఎక్కువ తక్కువ కానివ్వని ‘నియంత్రిక’ కూడా.
జీవితంలో వేగంగా ఉండటం ఎంత ముఖ్యమో, ఓపిక పట్టి ఉండటం కూడా అంతే ముఖ్యం అంటారు సరితా సింగ్!
ఇదీ చదవండి: సవాళ్ల నడుమ భారత వాయుసేన


