ఆ మూలసూత్రాలను అందుకుంటేనే... | Sakshi
Sakshi News home page

ఆ మూలసూత్రాలను అందుకుంటేనే...

Published Sat, May 25 2024 4:43 AM

Sakshi Guest Column On Reconstruction of India and Modi government

అభిప్రాయం

భారతదేశం పునర్నిర్మాణంలో ప్రతి సందర్భంలోను డా‘‘ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సూత్రాలే నిజమైన ప్రత్యామ్నాయాన్ని అందించగలుగుతున్నాయి. అంబేడ్కర్‌ నిర్మించిన రాజ్యాంగ సౌధాన్ని ఆయన సూత్రాలతోనే పునర్నిర్మించాలి అనే నూతన భావన మన నాయకులకు ఉంటే అంబేడ్కర్‌ కుల నిర్మూలన భావాన్ని, సామ్యవాద భావాల్ని తప్పక ఆచరించవలసిన చారిత్రక సందర్భం ఇది. నిజానికి దేశాన్ని రక్షించాల్సిన వారు దేశంలో నేడు మత వైరుద్ధ్యాలు పెంచడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అశోకుడు, అక్బరు వంటి మహా చక్రవర్తులే మత సామరస్యం కోసం ప్రయత్నం చేస్తే, ఇప్పటి నాయకులు మతాధిపత్యం కోసం ప్రచారం చేసి మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నారని సామాజిక శాస్త్రవేత్తలు, రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నెల 13న జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో మహిళలు పోటెత్తి ఓటెయ్యడం ఒక సామాజిక, సాంస్కృతిక పరిణామం. మహిళకు రాజకీయ అస్తిత్వం పెరిగింది అనడానికి ఇది ఒక నిదర్శనం. మహిళలు ఎక్కడ చైతన్యవంతం అవుతారో అక్కడ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ పరిణామాలు త్వరితం అవుతాయని అంబేడ్కర్‌ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 81.86 శాతం ఓట్లు పోయ్యాయి. నడి ఎండలో కూడ ప్రజలు నిలబడి తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. 

మరోప్రక్క కుల, మతం, మద్యం, డబ్బు ప్రభావం కూడా బలంగానే ఎన్నికల మీద ఉంది. ఎన్నికల సంగ్రామంలో ఈసారి సోషల్‌ మీడియా కీలకపాత్ర పోషించింది. ఒక రకంగా సామాజిక వేదికలపై పెద్ద యుద్ధమే నడిచింది. పార్టీలు, అభ్యర్థుల వారీగా ఏర్పడ్డ గ్రూపుల్లో ఓటింగ్‌ సందర్భంగా రాతలతో కత్తులు దూశారు. ఫేక్‌ ఫోటోలు, ఫేక్‌ ఆడియోలతో పాటు ఫేక్‌ వార్తలను క్షేత్రస్థాయిలో వైరల్‌ చేశారు. సోషల్‌ మీడియాను ఫాలో అయ్యేవారు అయోయయానికి గురయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. 

తెలుగు రాష్ట్రాల పరిస్థితులు ఇలా వుంటే మొత్తం భారతదేశం వ్యాప్తంగా పెను వృక్షాలు కూలుతున్న చప్పుళ్లు వినబడుతున్నాయి. కొన్ని అధికార పీఠాలు బీటలు వారుతున్నాయి. మే 15న భువనేశ్వర్‌లోని భువనంగిరిలో ఇండియా కూటమి నాయకుడు రాహుల్‌గాంధీ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో భాజపా నెగ్గితే ప్రభుత్వరంగ సంస్థలన్నీ ప్రైవేటుపరం అవుతాయని, దేశాన్ని 22 మంది బిలియనీర్లు పాలిస్తారని, రాజ్యాంగ పుస్తకాన్ని భాజపా చించి అవతల పారేస్తుందని అన్నారు. 

బడుగు వర్గాలకు ప్రయోజనాలు లభించటానికి కారణమే రాజ్యాంగం అని తమ చేతిలోని రాజ్యాంగ ప్రతిని చూపిస్తూ  చెప్పారు. 22 మంది బిలియనీర్లు తీసుకున్న రూ. 16 లక్షల కోట్ల రుణాలను కేంద్ర సర్కారు మాఫీ చేసిందని, ఉపాధి హామీ పథకం కింద కూలీలకు 24 ఏళ్ల పాటు వేతనాలు చెల్లించేందుకు అయ్యే మొత్తంతో ఇది సమానమని వివరించారు.    

‘‘రైతుల, విద్యార్థుల రుణాలను మాఫీ చేయలేదు. చిరు వ్యాపారులకు రుణాలే ఇవ్వలేదు. జీయస్టీ మొత్తమంతా ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు వెళ్లిపోతోంది. మేం వచ్చాక కులగణనతో విప్లవాత్మక ప్రజాస్వామ్యాన్ని, ప్రజాపాలనను తీసుకువస్తాం. దేశంలో దేశంలో 50 శాతం మంది ఓబిసీలు, 15 శాతం దళితులు, 8 శాతం గిరిజనులు, 15 శాతం మైనార్టీలు, 5 శాతం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారున్నారు. ఈ  90 శాతం మందికిపైగా ప్రజలు మోదీ పాలనలో వంచితులయ్యారు. ఎన్ని రకాల అబద్ధాలను భాజపా చెప్పినా జూన్‌ 4 తర్వాత ప్రధాని పదవిలో మోదీ ఉండరు’’ అని రాహుల్‌ ఉద్ఘాటించారు.

మోడీ ప్రభుత్వంలో రాజ్యం కంటే కూడా కార్పోరేట్‌ శక్తులు బలపడ్డాయి. విశ్వవిద్యాలయాలు అన్నింటిలో మతోన్మాద భావాలను ప్రచారం చేస్తూ శాస్త్ర జ్ఞానాన్ని వక్రీకరిస్తున్నాయి. అందుకే శ్రీనగర్‌లో మే 15న మాట్లాడుతూ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎస్పీ)అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లా ఇలా విమర్శించారు. భవిష్యత్తులో తాను పదవిలో లేకపోయినా దేశం మనుగడ సాగిస్తుందన్న విషయాన్ని ప్రధాని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. దక్షిణ కాశ్మీర్‌ అనంత్‌నాగ్‌లోని షాంగుస్‌ ప్రాంతంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘మనం కలిసి జీవించాలి. దేశాన్ని రక్షించాలి. పదవి ఎల్లకాలం ఉండదు. కానీ దేశం శాశ్వతం. ఆయన (మోడీ) ఏ దేశాన్ని తయారు చేయాలని ప్రయత్నిస్తున్నారో అది వినాశకరమైనది’’ అన్నారు.

నిజానికి దేశాన్ని రక్షించాల్సిన ప్రధానమంత్రి దేశంలో మత వైరుధ్యాలు పెంచడం ఆశ్చర్యకరం. అశోకుడు, అక్బరు వంటి మహా చక్రవర్తులే మతసామరస్యం కోసం ప్రయత్నం చేస్తే, మోడీ ప్రభుత్వం మతాధిపత్యం కోసం ప్రచారం చేసి మత సామరస్యాన్ని దెబ్బతీసిందని సామాజిక శాస్త్రవేత్తలు, రాజకీయ విశ్లేషకులందరూ భావిస్తున్నారు. మోడీ ఆవేశపూరితమైన ప్రసంగాల్లో 400 సీట్లు వస్తున్నాయని చెప్పుకుంటున్నా 150 నుంచి 200కే పరిమితం అవుతారని కమ్యూనిస్టు నాయకులు చెబుతున్నారు. బీజేపీకి బలమైన ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఈ ఎన్నికల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. 

ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, బిహార్, మధ్యప్రదేశ్, హర్యానా, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లోనే బీజేపీకి ఎదురు గాలి వీస్తున్నది. పైకి డాంబికంగా 370–400 సీట్లు వస్తాయని గొప్పలు చెప్పుకుంటున్నా ఏ సర్వేలోనూ ఆఖరికి బీజేపీని బలపరిచే విశ్లేషకులు సైతం 250కి మించి రావని చెప్పాల్సిన పరిస్థితి. బీజేపీ ప్రభుత్వం ఈ దశాబ్దంలో ఏ సోషల్‌ మీడియాలోనైతే దళిత బహుజన మైనార్టీ స్త్రీల మీద, రాజ్యాంగం మీద, మానవ హక్కుల మీద, విద్యార్థుల ప్రతిభ మీద, దళితుల జీవన సంస్కృతి మీద, ముస్లింలు జీవించే హక్కు మీద దాడి చేసిందో అదే సామాజిక మాధ్యమాన్ని ఉపయుక్తం చేసుకొని ఈ సామాజిక శ్రేణుల అన్నింటిలో వున్న మే«ధావర్గం ఎదురుదాడి ప్రారంభించింది. 

నిజానికి మోడీ ద్వంద్వ భావజాల ఘర్షణలో ఇరుక్కుపోయారా అనిపిస్తుంది. ఏ ప్రజలైతే ఏ బడుగువర్గాలైతే అధిక ఓట్ల శక్తిగా ఉన్నాయో, ఆ వర్గాల జీవన వ్యవస్థలను ధ్వంసం చేస్తూ చేస్తూ, కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాస్తూ ఈ వర్గాలను మతం పేరుతో ఓట్లు అడుగుతున్న సందర్భంగా, తమ కాళ్ల కింద పునాదులు తొలగిపోతున్న స్థితిలో కేవలం మతోన్మాద నినాదం ఫలిస్తుందా? అనేది ఇప్పుడు మోడీ ముందు నిలబడిన పెద్ద ప్రశ్నలా కనిపిస్తోంది.

ఉత్తర ప్రదేశ్‌ కేంద్రంగా మొత్తం భారతదేశం గురించి మనం ఆలోచించినప్పుడు అన్ని మతాల్లో బానిసలుగా బతుకుతున్న వారికి సమాన గౌరవ జీవన వ్యవస్థ లేకపోవటం కనిపిస్తోంది. మతోన్మాద నినాదం గౌరవం ఇవ్వదు. ఆచరణ గౌరవం ఇస్తుంది. భారతదేశంలో కుల గణన చేయిస్తామని కాంగ్రెస్‌ పేర్కొన్నాక ఓబిసీలు ఆలోచనలో పడినట్లే ఉంది. తమకు రిజర్వేషన్‌ హక్కు వస్తుందని, రిజర్వేషన్‌ వల్ల విద్య, ఉద్యోగ హక్కులు విస్తృతం అవుతాయని ఓబిసీలు భావించడం ద్వారా భారతదేశంలో అతి పెద్ద సామాజిక తరగతి ‘ఇండియా’ కూటమి వైపు మొగ్గుతుందనక తప్పదు. 

‘ఇండియా’ కూటమికి నూతన దశ వస్తున్న ఈ తరుణంలో అంబేడ్కర్‌ నిర్మించిన రాజ్యాంగ సౌధాన్ని ఆయన సూత్రాలతోనే పునర్నిర్మించాలి అనే నూతన భావన ఆ కూటమికి ఉంటే అంబేడ్కర్‌ కుల నిర్మూలన భావాన్ని, సామ్యవాద భావాల్ని తప్పక ఆచరించవలసిన చారిత్రక సందర్భం ఇది. ఆ పరిణతి మాత్రం ‘ఇండియా’ కూటమికి వచ్చినట్టు లేదు. అంబేడ్కర్‌ పరిశ్రమలను జాతీయం చేయండి, భూములను జాతీయం చేయండి అనే ప్రధాన సూత్రాన్ని ముందుకు తెచ్చారు. 

ఆయా రాష్ట్రాల ఆధిపత్య కులాల పార్టీ నుంచి వస్తున్న ‘ఇండియా’ కూటమి ఇంకా సామాజిక, సామ్యవాద భావాలను పరిపుష్టం చేయవలసిన అవసరం ఉంది. విశ్వవిద్యాలయాల్లో చారిత్రక, సాంస్కృతిక శాస్త్ర జ్ఞాన పునరుజ్జీవనానికి కూడా వీరు హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మండల కమిషన్‌ రిపోర్ట్స్‌ను, సచార్‌ కమిటీ రిపోర్ట్స్‌ను, రిపబ్లికన్‌ పార్టీలోని మూల సూత్రాలను ‘ఇండియా’ కూటమి తీసుకోగలిగితే నిజమైన ప్రత్యామ్నాయంగా నిలబడుతుంది. 

భారతదేశం పునర్నిర్మాణంలో ప్రతి సందర్భంలోను డా‘‘ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సూత్రాలే నిజమైన ప్రత్యామ్నాయాన్ని అందించగలుగుతున్నాయి. ఈసారైనా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ఒక దళిత ప్రధానమంత్రిని ప్రకటించగలిగిన విశాలతను సంతరించుకోవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా భారతదేశంలోని రాజకీయ నాయకుల వ్యక్తిత్వ నిర్మాణంలో నైతికత, అవినీతి రహిత, రుజువర్తన జీవన విధానం, మానవతా స్పృహ, సామాజిక విప్లవ భావన, ఆర్థిక స్వావలంబనా దృష్టి అనుసరణీయం అవ్వవలసి ఉంది. రాజకీయ నీతిశాస్త్ర అధ్యయనం ఈనాటి చారిత్రక కర్తవ్యం. అంబేడ్కర్‌ రాజకీయ జీవన మార్గమే దేశానికి దిక్సూచి.

డా‘‘ కత్తి పద్మారావు 
వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు

Advertisement
 
Advertisement
 
Advertisement