
విశ్లేషణ
భారత అణు కేంద్రాలు ఏపాటి సురక్షితమైనవి? చెర్నోబిల్ అణు కేంద్ర ప్రమాదం (1986) తర్వాత భారత్ అణుశక్తి సంస్థ అధిపతికి ఈ ప్రశ్న ఎదురైంది. ‘‘మన అణు కేంద్రాలు ఎంత సురక్షితమైనవంటే వాటిని ఒక క్షిపణి తాకినా, విమానం వాటిపై కూలినా అవి చెక్కుచెదరవు’’ అని ఆయన జవాబిచ్చారు. అణు విద్యుత్ కేంద్రాన్ని లేదా తత్సంబంధిత సదుపాయాలను నెలకొల్పేటప్పుడు యుద్ధంతో సహా ఎటువంటి విపత్తు సంభవించినా తట్టుకుని నిలబడేటట్లు అణు ఇంజనీర్లు ప్లాన్ చేస్తారు.
ఏ అణు సదుపాయాన్ని ఏర్పాటు చేసేటప్పుడైనా దాని భద్రతకు ప్రధానంగా పూచీ వహేంచే అంశం ఏదైనా ఉందీ అంటే అది దానిని ఎక్కడ నెలకొల్పుతున్నారో ఆ భౌగోళిక ప్రాంతమే. భౌగోళిక సుస్థిరతతోపాటు జనావాసాలకు దూరంగా ఉండటం ముఖ్యం. సాధారణంగా అటువంటి సదుపాయాలు వ్యూహాత్మక ప్రయోజనాల రీత్యా అంతర్జాతీయ సరిహద్దులకు దూరంగా ఉంటాయి.
అణుదాడులు బాధ్యతారాహిత్యం
ఇరాన్‌లోని ఫర్దో, నతాంజ్, ఇస్‌ఫహాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ ఇటీవల దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఫర్దో యురేనియం శుద్ధి సదుపాయాన్ని ఇరాన్ కేంద్ర ప్రాంతంలో పర్వతాల లోపల లోతున నిర్మించారు.
యరేనియం శుద్ధి కేంద్రాలు, ఇంధన కడ్డీల తయారీ యూనిట్లు, విద్యుదుత్పాదన కేంద్రాలు, వ్యర్థాలను భద్రపరచే ప్రదేశాలు వంటి అణు సదుపాయాల భద్రత... అంతర్జాతీయ సమాజానికి ఎప్పుడూ ఆందోళనకర అంశంగానే ఉంటూ వస్తోంది.
యాదృచ్ఛికంగానైనా లేదా ఉద్దేశపూర్వకంగానైనా ఎలాంటి ప్రమాదం సంభవించినా అది అణు ధార్మికత విడుదలకు కారణమై అటు మానవాళికి, ఇటు పర్యావరణానికి హానికరంగా పరిణమించవచ్చు. ఇటీవలి ఘర్షణలో ఆ మూడు చోట్ల వైమానిక దాడుల్లో అణు రియాక్టర్లను లక్ష్యంగా చేసుకోలేదని చెబుతున్నారు. ఫలితంగా, వాటి చుట్టూ ఉన్న ఇతర సదుపాయాలు ధ్వంసమయ్యాయి.
ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధంలో ఈమధ్య ఉక్రెయిన్‌లోని జపొరియిష వంటి అణు సదుపాయాలు దాడులకు లోనుకావచ్చని వాటి భద్రతపై ఆందోళన నెలకొంది. అలాగే, ఉత్తర కొరియా కూడా అణు బూచికి చిరునామాగా మారింది. పైగా, అది అంతర్జాతీయ తనిఖీలకు అంగీకరించడం లేదు.
అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) ఇలాంటి విషయాల్లో ప్రపంచ పెద్దమనిషిగా వ్యవహరించవలసి ఉంది. అణు విచ్ఛిత్తి పదార్థాల రవాణాతోపాటు, అణు ధార్మికతకు దారితీయగల ప్రమాదాలపై అది ఒక కన్ను వేసి ఉంచుతుంది (తాజాగా ఐఏఈఏకు సహకారాన్ని నిలిపివేయాలని ఇరాన్ నిర్ణయించింది).
ఒక రియాక్టర్ పై దాడి జరిగి, అది ధ్వంసమైతే దాని నుంచి విడుదలయ్యే అణు ధార్మికత సుదూర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తుంది. చెర్నోబిల్, ఫుకుషిమా దుర్ఘటనల్లో అదే జరిగింది. రెండు దేశాల మధ్య ఘర్షణలు సాగుతున్నప్పుడు ఏ పక్షమైనా సరే రెండవ పక్షానికి చెందిన అణు రియాక్టర్‌పై దాడికి దిగినా, ధ్వంసం చేసినా అది సదరు దేశం పక్షాన పూర్తి బాధ్యతారాహిత్యం అవుతుంది.
అసమానతే అంతస్సూత్రమా?
రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలంలో సైన్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని భావించడం జరిగింది. ఐఏఈఏ 1957లో ఏర్పడడానికి ప్రేరణ ఇచ్చిన అంశాల్లో అది కూడా ఒకటి.
ప్రభుత్వాలనన్నింటినీ ఒకచోట చేర్చడం, టెక్నాలజీ అంశాలపై వాటికి దారి చూపడం, అణు శక్తి శాంతియుత ప్రయోజనాలపై సమాచారాన్ని క్రోఢీకరించడం అనే భావనతో అది ఏర్పడింది. ఐఏఈఏ ఏర్పాటుకు దారితీసిన చర్చల్లో భారత్ కూడా పాల్గొంది. అందులో భారత్ వ్యవస్థాపక సభ్యురాలు. కొన్ని దశాబ్దాలుగా, ఆ సంస్థ గవర్నర్ల బోర్డులో సభ్యురాలిగా ఉంటూ కీలక పాత్ర పోషిస్తోంది.
అణు శక్తిని ద్వంద్వ ఉపయోగ టెక్నాలజీగా వినియోగిస్తున్నారు. దాంతో, ఆ కార్యకలాపాలు గోప్యంగా సాగుతూ, సమాచార వినిమయం క్లిష్టంగా మారింది. అణు పదార్థాలను సురక్షితంగా వ్యవహరించేటట్లు చూడటంతోపాటు, అణ్వాయుధాల తయారీకి వాటిని బదలాయించకుండా నివారించడం కూడా ఐఏఈఏ ప్రధాన కర్తవ్యం. కానీ, ఆది నుంచి కూడా ఈ నిఘా సంస్థ విధి నిర్వహణలో ఒక రకమైన అసమానత అంతర్లీనంగా ఉంటూ వస్తోంది.
ఐఏఈఏ వైజ్ఞా్ఞనిక సలహా మండలికి మన హోమి జహంగీర్ భాభా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ మండలి, 1960లలో ప్రతిపాదించిన సురక్షితా ప్రమాణాల స్వరూప స్వభావాలపై కఠిన వైఖరిని అవలంబించింది. ఎటువంటి తనిఖీలకు అంగీకరించేది లేదని తెగేసి చెప్పిన కొన్ని దేశాలకు ఒక తరహా నిబంధనలు, ఐరోపా దేశాలకు మరో రకమైన నిబంధనలు విధించడాన్ని ప్రశ్నించింది.
మిగిలిన దేశాలను మాత్రం కఠినమైన నిరోధాలు, తనిఖీలకు లోనుచేశారు. అణు శక్తి రంగంలో ఐరోపా దేశాలు ఎంతో ప్రగతిని సాధించినందువల్ల వాటి భద్రతను అవి చూసుకోగలవనే అభిప్రాయం వ్యక్తమయ్యేది. అయితే, ఈ వ్యవస్థతో ఏకీభవించనివారు దిగ్భంధనాలను ఎదుర్కోవలసి వస్తోంది.
అణు విస్ఫోటనాలను సైనికేతర ప్రయోజనాలకు వినియోగించినా వివాదం నెలకొంటోంది. భారీ స్థాయి ఇంజినీరింగ్, గనుల తవ్వకం, ఇతర తవ్వకాలు లేదా భూగర్భ జలాశయాలను నిర్మించడం వంటివి ఆ కోవలోకి వస్తాయి.
ప్రాజెక్ట్ రూలిసన్ వంటి శాంతియుత విస్ఫోటనాలను అమెరికా నిర్వహించినప్పుడు, వాటిని వైజ్ఞానిక విజయాలుగా జేజేలు కొట్టారు. మన దేశం 1974లో శాంతియుత విస్ఫోటనాన్ని నిర్వహించినపుడు మనపై ఆంక్షలు విధించారు. ఇరాన్ అణ్వాయుధాలను నిర్మించగల సామర్థ్యాన్ని సంతరించుకోగల స్థితిలో ఉందనే అభిప్రాయమే ఇరాన్ అణు సదుపాయాలపై ఇటీవల అమెరికా దాడులకు కారణం.
అందరికీ ఒకే న్యాయం
అణు శక్తి దాని తొలినాటి శాస్త్రీయ సహకార పరిధిని ఏనాడో అతిక్రమించింది. భారీ పారిశ్రామిక కార్యకలాపాలతో అది ఇపుడు ముడిపడి ఉంది. అణు కార్యకలాపాలు అపారమైన ఆర్థిక పెట్టుబడులు, భౌగోళిక రాజకీయాలతో సన్నిహిత సంబంధం కలిగినవిగా రూపాంతరం చెందాయి.
భారత్‌తో సహా, అనేక దేశాలలో అణు శక్తి రంగంలోకి ప్రైవేటు సంస్థలు అడుగిడబోతున్నాయనే మాటలు వినవస్తున్నాయి. ప్రైవేటు అణు విద్యుదుత్పాదన కేంద్రాలు ఐఏఈఏ పర్యవేక్షణలోకి పరోక్షంగా వస్తాయి. అవి దానికి విధేయత చూపేటట్లు చూడవలసిన బాధ్యత ఆ యా ప్రభుత్వాల పైనే ఉంటుంది.
అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం కింద తనకు లభించిన సంప్రదాయ సిద్ధమైన నిఘా పాత్రతోపాటు, అలాంటి సవాళ్లకు కూడా ఐఏఈఏ తనను తాను సిద్ధం చేసుకోవలసి ఉంటుంది. దేశాలు అణు పదార్థాలను ఆయుధాల తయారీకి తరలించకుండా చూడటం ఆ ఒప్పందం ప్రకారం ఐఏఈఏకి అప్పగించిన ప్రాథమిక కర్తవ్యం.
అంతర్జాతీయ సుస్థిరతకు, న్యూక్లియర్ టెర్రరిజం బెడదను తగ్గించడానికి పరిస్థితులను సరిచూసే, తనిఖీ వ్యవస్థ కీలకం. కానీ, దాని పనితీరు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండాలి. అణ్వస్త్రాల వ్యాప్తిని నిరోధించడంలో ఐఏఈఏ పాత్రను చాలా దేశాలు బలపరుస్తున్నాయి. కానీ, జాతీయ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని, అణు సాంకేతికతను వినియోగించుకోవడంలో అందరికీ సమాన సౌలభ్యం ఉండాలని అవి డిమాండ్ చేస్తున్నాయి.
దినేశ్ సి. శర్మ
వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)