కర్ణాటక ఫలితాన్ని ఎలా చూడాలి?

Sakshi Guest Column On Mallepally Laxmaiah

కొత్త కోణం

కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచింది అనడం కన్నా బీజేపీ ఓడింది అనడం కరెక్టు. ఎందుకంటే కాంగ్రెస్‌ది సంపూర్ణ విజయం అనుకోలేం. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని వద్దనుకున్నవాళ్లు కాంగ్రెస్, జేడీ(ఎస్‌) మధ్య ఎటూ తేల్చుకోలేకపోయారు. ఈసారి మాత్రం కాంగ్రెస్‌ వైపు వచ్చారంతే! ఇప్పటికీ కర్ణాటకలో బీజేపీ బలమేమీ తగ్గలేదు.

కానీ విడిపోయిన ప్రజలను ప్రతిపక్షం వైపు నిలబడేటట్టు చేసి, తన ఓటమిని తానే రాసుకుంది బీజేపీ. కాంగ్రెస్‌ పార్టీ ఆర్థిక విధానాలకూ, బీజేపీ అమలు చేస్తున్న విధానాలకూ మౌలికమైన తేడా లేదు. దేశంలో నెలకొన్న అన్ని విషయాలపైనా, ప్రజల క్షేమం, సంక్షేమం, సమగ్రాభివృద్ధి అనేవి కాంగ్రెస్‌ ఆశయాలైతే, వాటికి అనుగుణమైన విధానాన్ని ప్రకటించాలి.

ఇది ప్రజా విజయం. అధికార భారతీయ జనతా పార్టీ ఓటమి. ఇదే ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సారాంశం. అంతేగానీ, ఇది కేవలం కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ విజయమనుకుంటే పొరపాటు. ఇది దేశ వ్యాప్తంగా రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో పునరావృతమవుతుందనుకుంటే అంతకన్నా పొరపాటు. అయితే, ఈ ఎన్నికల ఫలితాల వల్ల అంచనాలు తారుమారయ్యే అవకాశం మాత్రం ఉంది. 

మొదటిగా, ప్రజల విజయం విషయానికి వస్తే– గతంలో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీని కాదనుకున్నవాళ్ళు జనతాదళ్‌ (ఎస్‌)కు, కాంగ్రెస్‌కు మధ్యలో నిలిచిపోయారు. ఈ ఎన్నికల్లో వాళ్ళు తెలివిగా చాలా చోట్ల జనతాదళ్‌(ఎస్‌)ను పక్కన పెట్టి, కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేశారు. భారతీయ జనతాపార్టీకి వ్యతిరేకంగా జేడీ(ఎస్‌),కాంగ్రెస్‌ పోటీలో ఉంటే, బీజేపీని కాదనుకున్న వాళ్ళు కాంగ్రెస్‌ వైపు మొగ్గారు.

గత ఎన్నికల్లో జేడీ(ఎస్‌) 37 సీట్లలో విజయం సాధిస్తే, ప్రస్తుత ఎన్నికల్లో అది 19కి పడిపోయింది. అంటే సగానికి దిగజారిందని అర్థం. దీనికి కారణం, ప్రజల చతురత తప్ప మరొకటి కాదు. మూడు, నాలుగు పార్టీలు పోటీలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజలు అనుసరించడానికి ఇది ఒక నమూనా. 

ఉదాహరణకు, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ చాలా బలంగా ఉన్నట్టు మనం భావిస్తున్నాం. ఎందుకంటే, పార్లమెంటు ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని రెండుసార్లు నిలబెట్టుకుంది. అది కూడా అత్యంత అధిక సంఖ్యలో. అక్కడ నాలుగు పార్టీలు పోటీ పడుతు న్నాయి. అందులో గత ఎన్నికల్లో బహుజన సమాజ్‌ పార్టీ చాలా బలహీనపడింది. కాంగ్రెస్‌ కూడా అంతంత మాత్రంగానే తన ఉనికిని చాటగలగింది. అయితే అఖిలేశ్‌ యాదవ్‌ నాయకత్వంలోని సమాజ్‌ వాదీ పార్టీ (ఎస్పీ) బలమైన ప్రతిపక్షంగా నిలిచింది.

2017లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 312 సీట్లు గెలుచుకోగా, 2022లో దాని బలం 255కు పడిపోయింది. సమాజ్‌వాదీ పార్టీ 2017 ఎన్నికల్లో 47 స్థానాలకు పరిమితం కాగా, 2022లో 111 స్థానాలకు తన బలాన్ని పెంచుకున్నది. అంటే క్రమంగా సమాజ్‌వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి బలమైన ప్రతిపక్షంగా ఎదుగుతోంది. మిగతా రెండు పార్టీల పరిస్థితిని చూస్తే, ఇది మనకు అర్థం అవుతుంది. కాంగ్రెస్‌ పార్టీ 2017 ఎన్నికల్లో 7 స్థానాల్లో గెలిచి, 6.25 శాతం ఓట్లను సాధించుకుంటే, 2022 ఎన్నికల్లో రెండు సీట్లకు పరిమితమై పోయి, 2.33 శాతం ఓట్లను మాత్రమే పొందగలిగింది.

బహుజన్‌ సమాజ్‌ పార్టీ 2017 ఎన్నికల్లో 22.23 శాతం ఓట్లను సంపాదించి, 19 స్థానాల్లో విజయం సాధించింది. అయితే 2022 ఎన్నికల్లో ఓట్ల శాతం 12.88కి పడిపోగా, కేవలం ఒక్క స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. కాంగ్రెస్, బీఎస్‌పీ క్రమంగా తమ రాజకీయ బలాలను కోల్పోతున్నట్టు కనిపిస్తున్నది. ఒకవేళ అక్కడ బీజేపీని ఓడించాలనుకునే ప్రజలు సమాజ్ వాదీ పార్టీవైపే మొగ్గితే భారతీయ జనతాపార్టీ ఉత్తరప్రదేశ్‌లో తన ప్రాధా న్యతను కోల్పోవాల్సి వస్తుంది.

అంటే జాతీయస్థాయి ఎన్నికల్లో కూడా బీజేపీ తన ఆధిపత్యాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడక తప్పదు. దానికి ఉదాహరణగా సీట్లు మాత్రమే కాదు, ఓట్ల శాతాన్ని కూడా చూడాలి. సమాజ్‌వాదీ పార్టీ 2017 ఎన్నికల్లో 21.82 శాతం ఓట్లను పొందితే, 2022 ఎన్నికల్లో అది 32.06 శాతానికి పెరిగింది. అంటే దాదాపు పది శాతానికి పెరిగింది. కాంగ్రెస్, బహుజన సమాజ్‌వాదీ పార్టీలు ప్రజాదరణ కోల్పోతున్నట్లు, సమాజ్‌వాది పార్టీ వైపు ప్రజలు వెళుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. 

ఇక రెండో విషయం, బీజేపీ ఓటమి: నిజానికి కర్ణాటక రాష్ట్ర చరిత్రలో ఇప్పటికీ ఒకే పార్టీ రెండు పర్యాయాలు అధికారంలోకి రాలేదు. 1985 నుంచి ఇదే చరిత్ర పునరావృతమవుతూ ఉంది. 1985 వరకు కర్ణాటకలో కాంగ్రెస్‌ పాలన కొనసాగింది. 1985లో మొదటి సారిగా జనతాపార్టీ నాయకత్వంలో రామకృష్ణ హెగ్డే ప్రభుత్వం ఏర్పా టయ్యింది. ఇదే మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం.1994లో జనతాదళ్‌ 227 సీట్లతో అధికారంలోకి వచ్చింది.

1999లో కాంగ్రెస్, 2004లో జనతాదళ్‌ సంకీర్ణ ప్రభుత్వం, 2008లో బీజేపీ ప్రభుత్వం, 2013లో మళ్ళీ కాంగ్రెస్, 2018లో మళ్ళీ బీజేపీ అధికారాన్ని అందుకున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్‌ గెలిచింది. ఇది కర్ణాటక అసెంబ్లీ చరిత్ర. కర్ణాటక ప్రజలు 1985 నుంచి ఇప్పటి వరకు ఒకే పార్టీకి రెండవసారి అధికారం కట్టబెట్టలేదు. అయితే బీజేపీ ఈ చరిత్రను తిరగరాయాలని ఉవ్విళ్ళూ రింది. అది ప్రజల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చూసింది. సూటిగా చెప్పాలంటే ముస్లింల మీద వ్యతిరేకతను రెచ్చ గొట్టి, మిగతా ప్రజలందరినీ తమవైపు తిప్పుకోవాలని చూసింది.

అందులో భాగంగానే హిజాబ్, అజాన్, ఉమ్మడి సివిల్‌ కోడ్, పశుసంరక్షణ పేరుతో దాడులు, ఒక రకంగా, ఉత్తర ప్రదేశ్‌లో అనుసరించిన అన్ని విధానాలను ఇక్కడ అమలు చేయాలని శతవిధాలుగా ప్రయ త్నించింది. కానీ ఆ విషయాలేవీ కర్ణాటక ప్రజలు పట్టించుకోలేద నడానికి ఈ ఫలితాలే నిదర్శనం. 

ఇది మతాల మధ్య విభజన అయితే – ఇక కులాల మధ్య ముఖ్యంగా ఎస్సీలలో ఉన్న వ్యత్యాసాలను ఉపయోగించుకొని మాదిగల ఓట్లను పొందడం కోసం రిజర్వేషన్ల విభజనను తెరపైకి తీసుకొచ్చింది. అదికూడా ఫలించలేదు. తన ఆర్థిక, సామాజిక కార్య క్రమాలు, అభివృద్ధి పనులను చూపించుకోవడం కాకుండా, ఇటువంటి విభజనతో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలనుకున్నది. ఇప్పటికీ కర్ణాటకలో బీజేపీ బలమేమీ తగ్గలేదు. కానీ విడిపోయిన ప్రజలను ప్రతిపక్షం వైపు నిలబడేటట్టు చేసి, తన ఓటమిని తానే రాసుకుంది బీజేపీ. 

మూడో విషయం, కాంగ్రెస్‌ గెలుపు: ఇది బీజేపీ ఓడిపోయి,అందించిన గెలుపు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులైన శివకుమార్, సిద్ధరామయ్య ఐక్య కృషి తోడైనప్పటికీ తనకు తాను గెలిచిన గెలుపు కాదిది. ఎందుకంటే, పదేళ్ళ కిందట దేశంలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌ పార్టీ ఆర్థిక విధానాలకూ, ఇప్పడు బీజేపీ అమలు చేస్తున్న విధానాలకూ మౌలికమైన తేడా లేదు. అయితే ఇటీవల ఆ పార్టీ నాయ కుడు రాహుల్‌ గాంధీ మాట్లాడుతున్న మాటలు గత కాంగ్రెస్‌ విధా నాలకు భిన్నంగా ఉన్నాయి.

ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, అదే విధంగా కార్పొరేట్ల గుత్తాధిపత్యం మీద రాహుల్‌ చేస్తున్న విమర్శల్లో ఆ మార్పును చూడవచ్చు. కానీ అవి పార్టీ విధానంగా ప్రకటించాలి. అదే విధంగా గతంలో తాము అనుసరించిన ఆర్థిక, రాజకీయ విధానాల పైన ఆత్మవిమర్శ చేసుకోవాలి. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండగా అంబానీలను ఆకాశానికెత్తిన విషయాన్ని గుర్తు చేసుకొని సవరించుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీపై ఉంది. అదే విషయంపై కొన్ని విషయాల్లో వ్యతిరేకించిన జైపాల్‌రెడ్డి లాంటి నాయ కులు పదవులు కోల్పోవాల్సి వచ్చింది.

ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అదే సంవత్సరంలో రాజీవ్‌ గాంధీ లాంటి నాయకులు అనుసరించిన హిందూత్వ అనుకూల విధానాలను సమీక్షించుకోవాలి. అయితే బీజేపీని కేవలం అధికారం కోసం మాత్రమే వ్యతిరేకించాలనే భావన ఉంటే కాంగ్రెస్‌ పార్టీ ఎదుగుదలను ఆశించలేం. దేశంలో నెల కొన్న అన్ని విషయాలపైనా, ప్రజల క్షేమం, సంక్షేమం, సమగ్రాభివృద్ధి అనేవి కాంగ్రెస్‌ ఆశయాలైతే, వాటికి అనుగుణమైన విధానాన్ని ప్రక టించాలి. కేవలం ఎన్నికల సమయంలో, లేదా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని, ఆ తర్వాత దాని ఊసుఎత్తక పోతే, కాంగ్రెస్‌కు కర్ణాటక లాంటి గెలుపులు కష్టమనే చెప్పాలి.అందుకే ఇకనైనా కాంగ్రెస్‌ చేసిన తప్పులకు లెంపలేసుకొని, సరికొత్త ప్రజా మార్గాన్ని ఎంచుకోక తప్పదు. 

మల్లెపల్లి లక్ష్మయ్య 
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్‌: 81063 22077

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top