ఇది డిజిటల్‌ చెల్లింపుల విప్లవం

Sakshi Guest Column On Digital payments revolution

డిజిటల్‌ చెల్లింపుల ఆవిష్కరణ భారత ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పును తీసుకొచ్చింది. పెద్దనోట్ల రద్దు తర్వాత ఆర్థిక లావాదేవీలన్నింటినీ పరివర్తన చెందించిన గొప్ప విప్లవ ఆవిష్కరణే ఈ డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ. దేశీయంగా మొదలైన ఈ సరికొత్త సాంకేతిక వ్యవస్థ కోట్లాదిమందిని సాంప్రదాయిక ఆర్థిక వ్యవస్థ చట్రం నుంచి బయటకు లాగడమే కాదు... దేశీయ వాణిజ్యాన్ని పునర్నిర్మించింది.

మన ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఇది ఒక గేమ్‌ ఛేంజర్‌లా పనిచేసింది. ప్రజా జీవితంలో,బ్యాంకింగ్‌ రంగంలో, నగదు లావాదేవీల్లో సరికొత్త మార్పును తీసుకొచ్చిన భారతీయ డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలందుకుంటోంది.

ఆధునిక ఆర్థిక వ్యవస్థకు భారతదేశం అందించిన అధునాతన సాంకేతిక విప్లవం– డిజిటల్‌ పేమెంట్‌ సిస్టమ్‌. భారత్‌ రూపొందించిన దేశీయ తక్షణ చెల్లింపుల వ్యవస్థ వాణిజ్య కార్యకలాపాలను పునర్ని ర్మించడమే కాదు, కోట్లాదిమంది ప్రజలను సాంప్రదాయిక ఆర్థిక వ్యవస్థ నుంచి బయటపడేసింది.

కేంద్ర ప్రభుత్వం దృఢమైన ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంలో దీన్ని రూపొందించింది. ఇది రోజువారీ జీవితాన్ని సౌకర్యవంతం చేసింది. రుణాలు, పొదుపులు వంటి బ్యాంకింగ్‌ సేవలను మరింతగా విస్తరింపజేసింది. కోట్లాది మంది భారతీయులకు ప్రభుత్వ కార్యక్రమాలను మరింతగా అందు బాటులోకి తీసుకొచ్చింది. పన్నుల సేకరణను కూడా సులభతరం చేసింది.

ప్రధాని నరేంద్రమోదీ జీ20 ఆర్థిక మంత్రులతో ముచ్చటిస్తూ, డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ పాలనను మౌలికంగానే మార్చివేసిందని చెప్పారు. డిజిటల్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ను అతి తక్కువ ఖర్చుతో ఏర్పర్చిన సాంకేతిక ఆవిష్కరణగా చూడవచ్చు. దీంతో మునుపెన్నడూ కనీవినీ ఎరగని స్థాయిలో అభివృద్ధి చెందిన దేశాలను సైతం ఎలా ప్రభావితం చేయవచ్చో భారత్‌ నిరూపించింది.

భౌతిక మౌలిక వసతుల వ్యవస్థ వెనుకంజ వేస్తున్న పరిస్థితుల్లో కూడా ఇది  ఆర్థిక పురోగతికి దోహదం చేస్తుంది. ప్రపంచంలోకెల్లా నిరుపేద దేశాలను కూడా పైకి లేపేటటు వంటి ఆలోచనల ఇంక్యుబేటర్‌గా భారత్‌ ఎగుమతి చేయాలనుకుంటున్న పబ్లిక్‌–ప్రైవేట్‌ మోడల్‌ ఇది. 

భారత్‌ ప్రారంభించిన ఈ గొప్ప ఆవిష్కరణ కేంద్ర భాగంలో ‘జేఏఎమ్‌’ త్రయం ఉన్నాయి. అవి: జన్‌ ధన్‌ ఖాతాలు, ఆధార్, మొబైల్‌. ఈ మూడు మూలస్తంభాలూ భారత ఆర్థిక పర్యావరణ వ్యవస్థను సమూలంగా విప్లవీకరించాయి.

మొదటి స్తంభమైన ప్రధాన్‌ మంత్రి జన్‌ ధన్‌ యోజన ప్రతి వయోజన భారతీయుడికి ఒక బ్యాంక్‌ ఖాతాను గ్యారంటీగా అందించే ఆర్థిక కార్యక్రమం. 2022 నాటికి, ఈ పథకం కింద 46.25 కోట్ల బ్యాంక్‌ ఖాతాలను తెరిచారు. వీటిలో 56 శాతం మహిళల ఖాతాలు కాగా, 67 శాతం ఖాతాలు గ్రామీణ, అర్ధ పట్టణ ప్రాంతాల్లో తెరిచారు. ఈ ఖాతాల్లో రూ. 1,73,954 కోట్లు జమ అయ్యాయి.

ఇక రెండో మూలస్తంభం: ఆధార్‌ పరివర్తిత ఐడెంటిటీ సేవలు. ఆధార్‌ ఐడీని రెండు అంశాల ప్రామాణీకరణ లేదా బయోమెట్రిక్‌ ద్వారా ఉపయోగించవచ్చు. ఆధార్‌ ప్రామాణీకరణ బ్యాంకులు, టెల్కో వంటి సంస్థలకు మూలాధారంగా మారింది.

ఈరోజు దేశంలోని 99 శాతం వయోజనులు బయోమెట్రిక్‌ గుర్తింపు నంబర్‌ను కలిగి ఉన్నారు. ఇంతవరకు 1.3 బిలియన్‌ ఐడీలు జారీ అయ్యాయి. ఈ ఐడీలు బ్యాంక్‌ ఖాతాల రూపకల్పనను సరళతరం చేసి సత్వర చెల్లింపుల వ్యవస్థకు పునాదిగా మారాయి.

ఇక మూడో మూలస్తంభం: మొబైల్‌. ఇది భారతీయ టెలికామ్‌ రంగంలో కీలకమైన డిజిటల్‌ ఆవిష్కరణ. 2016లో రిలయెన్స్ జియో టెలికామ్‌ రంగంలోకి దూసుకొచ్చిన తర్వాత డేటా ఖర్చు 95 శాతం వరకు పడిపోయింది. ప్రతి భారతీయుడికి ఇంటర్నెట్‌ను అతి తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తెచ్చింది.

ఈ–కామర్స్, ఫుడ్‌ డెలివరీ, ఓటీటీ కంటెంట్‌ వంటి సమాంతర వ్యవస్థలకు జీవం పోసింది. ఇంకా ముఖ్యమైనది ఏమిటంటే, అత్యంత మారుమూల ప్రాంతాల్లోని చిట్ట చివరి వ్యక్తికి కూడా డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇంటర్నెట్‌ అందుబాటు, స్మార్ట్‌ ఫోన్ల వ్యాప్తిని టెలిఫోన్‌ కంపె నీలు వేగవంతం చేయడం; ఆధార్‌ ప్రామాణీకృత జన్‌ ధన్‌ ద్వారా భారతీయ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థ సమూల మార్పునకు గురైంది. ఈ సమూల మార్పు బ్యాంక్‌ ఖాతాకు నగదు రహిత చెల్లింపులను అనుసంధానించే ‘ఏకీకృత చెల్లింపుల మధ్యవర్తి’ (యూపీఐ) భావనకు దారితీసింది.

యూపీఐ ఒక ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) వ్యవస్థ. ఇది నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్పీసీఐ) నేతృత్వంలో పనిచేసే వేదిక. ఈ వేదిక వందలాది బ్యాంకులు, డజన్లకొద్దీ మొబైల్‌ పేమెంట్‌ యాప్స్‌ నుంచి సేవలను అందిస్తుంది. దీనికి ఎలాంటి ట్రాన్సాక్షన్‌ ఫీజులు ఉండవు. ఫిన్‌ టెక్, బ్యాంకులు, టెల్కోలు ఈ వేదికను స్వీకరించాయి. పైగా ‘మర్చంట్‌ పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌’ (పీఓఎస్‌) వద్ద క్యూఆర్‌ కోడ్‌ ప్లేస్‌మెంట్ల వల్ల యుపీఐ భావన మరింత పురోగమించింది.

ఎన్పీసీఐ మేనేజింగ్‌ డైరెక్టర్‌ దిలీప్‌ అస్బె ప్రకారం – ఈ యేడాది జనవరిలో రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన 800 కోట్ల లావాదేవీలు యూపీఐ ద్వారా జరిగాయి. ఈరోజు అన్ని రకాల చెల్లింపుల్లో 40 శాతం డిజిటల్‌గా జరుగుతున్నాయి. గత సంవత్సరం భారత్‌లో జరిగిన తక్షణ డిజిటల్‌ లావాదేవీల విలువ అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల మొత్తం డిజిటల్‌ లావాదేవీల కంటే ఎక్కువని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఈ జనవరిలో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో తెలిపారు.

దేశంలోని 30 కోట్లమంది వ్యక్తులు, 5 కోట్లమంది వర్తకులు యూపీఐని ఉపయోగిస్తున్నారని దిలీప్‌ అస్బె తెలిపారు. అత్యంత చిన్న లావాదేవీలను కూడా డిజిటల్‌ చెల్లింపుల ద్వారా చేస్తున్నారు. 10 రూపాయల విలువ చేసే కప్పు పాలు లేదా రూ.200 విలువ చేసే సంచీడు తాజా కూరగాయలు వంటి లావాదేవీలు కూడా డిజిటల్‌ ద్వారానే జరుగుతున్నాయి.

సుదీర్ఘకాలంగా నగదు చెల్లింపులు సాగు తున్న ఆర్థికవ్యవస్థలో ఇది గణనీయమైన మార్పు. నల్లధనం నిర్మూ లనకు తీసుకొచ్చిన పెద్ద నోట్ల రద్దు, కోవిడ్‌ మహమ్మారి కాలంలో సామాజిక దూరం పాటించడం వంటివి కూడా డిజిటల్‌ పేమెంట్‌ వ్యవస్థను మరింతగా ముందుకు నెట్టాయి.

భారత ప్రభుత్వం గోప్యత, సృజనాత్మక ఆవిష్కరణ మధ్య సరైన సమతూకాన్ని తీసుకొచ్చిందని జీ20 షేర్పా అమితాబ్‌ కాంత్‌ వ్యాఖ్యా నించారు. డిజిటల్‌ చెల్లింపులను ఇంకా అమలు పర్చని రంగాల్లో కూడా, ఉదాహరణకు కేరళలోని మత్స్య పరిశ్రమలో ఐడెంటిటీ సంఖ్య, బ్యాంక్‌ ఖాతాలు, మొబైల్‌ ఫోన్‌ యాప్‌ల వంటి డిజిటల్‌ ప్రాథమిక పునాదులు సేవల సులభ పంపిణీకి వీలు కల్పిస్తున్నాయి.

డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ విజయం డిజిటల్‌ పేమెంట్‌ మౌలిక వసతుల దృఢత్వంపై మాత్రమే ఆధారపడలేదు... అది నగదు నుంచి డిజిటల్‌కు మారడానికి ప్రజల్లో తెచ్చిన ప్రవర్తనాపరమైన ప్రోత్సాహంపై కూడా ఆధారపడి ఉంది.

టీ స్టాల్స్‌ వంటి వాటి వద్ద అమర్చిన పేమెంట్‌ యాప్స్‌ ద్వారా అందించిన చిన్న వాయిస్‌ బాక్సుల వంటి ఆసక్తికరమైన ఆవిష్క రణల్లో కూడా వీటి విజయం దాగి ఉంది. వీటి ద్వారా ప్రతి చిన్న లావాదేవీ తర్వాత అమ్మకందారులు ఫోన్‌ మెసేజ్‌లు తనిఖీ చేస్తూ బిజీగా ఉంటున్నారు.

క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ప్రతి పేమెంట్‌తో తక్షణం అందుకునే డబ్బు ఎంతో సిరి వంటి వాయిస్‌ ప్రకటిస్తుంది. నగదు లావాదేవీలను దీర్ఘకాలంగా ఉపయోగిస్తున్న వర్తకులలో ఏర్పడే అవిశ్వాసాన్ని తొలగించడంలో ఇది సాయపడుతుంది.

‘కౌంటర్‌పాయింట్‌’ ప్రకారం, భారత్‌లో 120 డాలర్ల సబ్‌ ఫోన్లకు మార్కెట్‌ వాటా రెండేళ్లకు ముందు 41 శాతం ఉండగా, 2022లో అది 26 శాతం పడిపోయింది. ఇదే కాలానికి 30 వేల రూపాయల (360 డాలర్లు) పైబడిన ధర కలిగిన ప్రీమియం ఫోన్ల వాటా రెట్టింపై 11 శాతానికి చేరుకుంది.

ఫోన్లకోసం రుణాలు వంటి ఫైనాన్స్ ప్రొడక్ట్‌ ఆవిష్కరణలు ప్రీమియం ఫోన్లను చిన్న చిన్న పట్టణాలలోని సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆధార్‌ ప్రామాణికత, మొబైల్‌ ఇంటర్నెట్‌ ఉపయోగంపై ఆధారపడిన సమీ కృత ఆర్థిక వ్యవస్థ కారణంగా ఇది సాధ్యమైంది. 

ఇవన్నీ దేశంలో వ్యాపారాన్ని, ఆంట్రప్రెన్యూర్‌షిప్‌ని, వినియోగ నమూనాలను విప్లవీకరించి భారతీయ డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థను గేమ్‌ ఛేంజర్‌గా చేయడమే కాకుండా, ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిపాయి.
– బీఎన్‌/‘పీఐబీ’ రీసెర్చ్‌ వింగ్‌ 

మరిన్ని వార్తలు :

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top