ప్రజాస్వామ్యం పతనం కాకుండా...

Sakshi Guest Column On Democratic values in India by ABK Prasad

రెండో మాట 

భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలు దారుణంగా పతనమయ్యాయని స్వీడన్‌ యూనివర్సిటీ అనుబంధ సంస్థ ‘వి–డెమ్‌’ వెల్లడించింది. పాత్రికేయుల మీద వేధింపుల సంఖ్య పెరిగిందని కూడా నమోదు చేసింది. పారిశుద్ధ్య కార్మికులకు సరైన రక్షణ కవచాలు లేక వారు ప్రాణాలు విడుస్తున్న ఉదాహరణలను చూస్తూనే వున్నాం.

విష వాయు మాళిగల్లోకి వారిని ‘తోసి’ ప్రాణాలు తీసే పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా చూడం. ఇలాంటి పరిస్థితుల్లో పండుగలు, పబ్బాలు కూడా పేద వర్గాల జీవితాల్లో నామమాత్రం అయిపోయాయి. ఇన్ని సమస్యలు దేశంలో ఉండగా, పాలక వ్యవస్థను ప్రజావసరాలు తీర్చడానికి వినియోగించేందుకు నడుం బిగించడం మానేసి న్యాయ వ్యవస్థను తటస్థం చేసేందుకు పాలక పక్షం యత్నిస్తోంది.

‘‘2014 తర్వాత భారతదేశంలో ప్రజా స్వామ్య విలువలు దారుణంగా పతనమై నాయి. ఈ పతన దశ 1975 నాటి ఎమర్జెన్సీ కాలం పరిస్థితుల స్థాయికి 2022లో చేరుకుంది. 2014–2022 మధ్య కాలంలో ఇండియాలో ప్రజాస్వామ్య విలువల పతనం గ్రీస్, బ్రెజిల్, పోలెండ్, ఫిలిప్పీన్స్‌లలో పతన దశకు సమాన స్థాయిలో నమోదయింది.’’

– అమలులో ఉన్న వివిధ రకాల ప్రజాస్వామ్యాల గురించి గోథెన్‌బర్గ్‌ నగరంలోని స్వీడన్‌ యూనివర్సిటీ అనుబంధ సంస్థ ‘వెరైటీస్‌ ఆఫ్‌ డెమోక్రసీ’ (క్లుప్తంగా వి–డెమ్‌) పరిశోధనలో ఈ సత్యాలు వెల్లడ య్యాయి. ‘హిందూ’ పత్రిక ‘డేటా పాయింట్‌’ విశ్లేషకుడు విఘ్నేశ్‌ రాధా కృష్ణన్‌ ఈ వివరాలను పొందుపరిచారు.

(20 మార్చ్‌ 2023) ఈ వెల్లడి ఇలా ఉన్న సమయంలోనే బీజేపీ ప్రభుత్వ న్యాయశాఖా మంత్రి కిరణ్‌ రిజిజు ఒక ప్రకటన చేస్తూ (19 మార్చ్‌ 2023)– భారతదేశంలో కొందరు రిటైర్డ్‌ (విశ్రాంత) న్యాయమూర్తులు భారత వ్యతిరేక ముఠాతో చేతులు కలిపి పనిచేస్తున్నారనీ, వీరు భారత న్యాయ వ్యవస్థ ప్రతిపక్ష పార్టీ పాత్ర వహించాలని చూస్తున్నారనీ ఆరోపించారు. ఇది చెల్లుబాటు కాదని కూడా అన్నారు. ‘ఇది మంత్రి బెదిరింపు’ అని కాంగ్రెస్‌ నాయకుడు జైరామ్‌ రమేశ్‌ ఖండించారు!

ఆట్టే చూస్తుంటే ఈ పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణల తంతు ఎలా ఉందంటే, ‘అభిరుచి భేదాల’ గురించి రష్యన్‌ మహాకవి మయ కోవస్కీ చెప్పిన వ్యంగ్య రచన గుర్తుకొస్తోంది: వెనకటికొక

‘‘గుర్రం ఒంటె వైపు చూపు సారించి అరిచింది, ఛీ! ఇది సంకర జాతికి చెందిన గుర్రం’ అని. ఒంటె (తాను మాత్రం తక్కువ తిన్నానా అనుకుని) అన్నది కదా ‘నువ్వు గుర్రానివి కావు చిన్న సైజు ఒంటెవి అంతే అనుకో’ అని! కానీ అసలు సంగతి ఆ దేవునికే తెలుసు! విశాల నక్షత్ర వీధుల్లో ఆ విశ్వ ప్రభువుకి, ఈ రెండూ రెండు విభిన్న జాతులకి చెందిన మృగాలని తెలుసు’’!

భారత లౌకిక రాజ్యాంగం గుర్తించి రూపొందించిన వాక్, సభా స్వాతంత్య్రం లాంటి ప్రాథమిక హక్కులను నర్మగర్భంగా అణచివేసే పద్ధతుల్ని ఏ పాలకులు అనుసరిస్తున్నా, కనీస ప్రజాస్వామ్య విలు వల్ని రకరకాల ‘మిష’ చాటు చేసుకుని గౌరవించని దశలోనే ఇలా ‘అభిరుచిలో భేదాలు’ బాహాటంగా చోటు చేసుకుంటాయని మరచి పోరాదు! అంతేగాదు, 2014–2022 మధ్య కాలంలో దేశంలో పెక్కు మంది పాత్రికేయుల మీద వేధింపుల సంఖ్య కూడా పెరిగిందని ‘వి–డెమ్‌’ సంస్థ నమోదు చేసింది.

పశువులకు మేత లేక తిండి కరవుతో చస్తున్నా, ‘మతం’ పేరిట ముస్లిం యువకుల్నీ, వారి కుటుంబాలనూ వేధిస్తున్న ఘటనలకు అసాధారణ చొరవ చూపారు ఉత్తర ప్రదేశ్‌ పాలకులు. ‘గోరక్షణ’ పేరిట పలుచోట్ల జరిగిన దారుణమైన దాడులు సామాజిక అశాంతికి దారి తీశాయి. ఇలాంటి ఎన్నో ఘటన లను ‘హిందూ’ పత్రిక అనుబంధ విశిష్ట పక్ష పత్రిక ‘ఫ్రంట్‌లైన్‌’ (మార్చి 10, 2023) నమోదు చేసింది. 

ఇదిలా ఉండగా– చివరికి పారిశుద్ధ్య కార్మికులకు సరైన రక్షణ కవచాలు లేక అనేక సీవేజ్‌ గుంటల్లో ప్రాణాలు విడుస్తున్న ఉదా హరణలను పేర్కొంటూ సుప్రీంకోర్టు చలించిపోయింది.

దుర్గంధపూరిత విష వాయువుల మధ్య చనిపోతున్న పారిశుధ్య కార్మికుల పరిస్థితులను ప్రస్తావించి, ఇలా ‘విష వాయు మాళిగ (గ్యాస్‌చాంబర్స్‌)ల్లోకి తోసి ప్రాణాలు తీసే పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా చూడ బోమని’ (2019లో) వ్యాఖ్యానించింది! పారిశుద్ధ్య కార్మికుల ఉద్యమ నాయకుడు బెజవాడ విల్సన్‌ దేశంలో వీరి పరిస్థితి ఎందుకు మెరుగవటం లేదో కారణాలు వివరంగా పేర్కొన్నారు: ‘‘కుల వ్యవస్థ దేశంలో బలంగా ఉన్నందున, ఈ కార్మికుల ఆరోగ్య పరిస్థితుల్ని పట్టించుకోవడం లేదు.

పాలకులు రాజ్యాంగ విధుల్ని పాటించడం మానేశారు. దేశంలో ప్రతి మూడవ రోజున ఒక పారిశుద్ధ్య కార్మికుడు చనిపోతున్నాడు. అయినా వారి రక్షణ గురించిన పల్లెత్తు హామీ లేదు.’ (ఫ్రంట్‌లైన్, 10 మార్చ్‌ 2023)ఇలాంటి పరిస్థితుల్లో చివరికి పండుగలు, పబ్బాలు కూడా పేద వర్గాల జీవితాల్లో నామ మాత్రం అయిపోయాయి.

దేవులపల్లి కృష్ణశాస్త్రి ఇలాంటి దీన పరిస్థితుల్ని తలచుకున్నప్పుడల్లా ‘మాకు గాదులు లేవు, ఉగాదులు లేవ’ని పలుమార్లు ఎత్తిపొడుస్తూ వచ్చాడు. చివరికి ‘ఎంత పెద్ద పండుగ’ వచ్చినా పేదసాదలు యథాలాపంగా జరుపుకోవడమేగానీ, వారి బతుకుల్లో నిజమైన వెలుగులు చూడలేక పోతున్నాం! అందుకే శ్రీశ్రీ కూడా ‘పండుగెవరికి? పబ్బమెవరికి?’ అన్న పాటలో సమాధానాలు లేని ప్రశ్నల వర్షం కురిపించాల్సి వచ్చింది:

‘‘పెద్ద పండుగ, పెద్ద పండుగ, పేరు దండగ! పండుగెవరికి, పబ్బమెవరికి? తిండి లేక, దిక్కు లేక దేవులాడే దీన జనులకు పండుగెక్కడ! పబ్బమెక్కడ? ఎండు డొక్కల పుండు రెక్కల బండ బతుకుల బానిసీండ్రకు పండుగేమిటి? పబ్బమేమిటి? ఉండటానికి గూడు లేకా ఎండవానల దేబిరించే హీన జనులకు పేద నరులకు పండుగొకటా? పబ్బమొకటా?’’

ఇన్ని ఈతిబాధలు పేద వర్గాలను నిత్యం వెంటాడుతుండగా– పాలక వ్యవస్థను ప్రజావసరాలు తీర్చడానికి వినియోగించేందుకు నడుం బిగించడం మానేసి న్యాయ వ్యవస్థను తటస్థం చేసేందుకు పాలక పక్షం యత్నిస్తోంది. అఖిల పక్ష– పాలక వర్గ, ప్రతిపక్ష, న్యాయ వ్యవస్థ ప్రతినిధులతో సమాన ఫాయాలో ఏర్పడే క్రియాశీల సంస్థ ఉంటేనే వివక్షకు తావుండదని న్యాయ వ్యవస్థ భావించింది. ఇది ఆచరణలోకి వస్తే పాలక వర్గ ఏకపక్ష నిర్ణయాలూ, ఆటలూ సాగవు.

అలాంటి పరిణామానికి ప్రస్తుత క్రియాశీల అత్యున్నత ధర్మాసనం సానుకూలం. కేంద్రం ప్రతికూలం. ఈ వైరుధ్యం, రాజ్యాంగం ఉభయ శాఖలకు నిర్దేశించిన పరిధుల్ని గౌరవించి వ్యవహరించినంత కాలం తలెత్తదు. ఇప్పుడా పరిధిని పాలకులు అతిక్రమించడానికి ఘడియలు లెక్కపెడుతూ కూర్చున్నందుననే ప్రజలకు సమస్యలు ఎదురవుతున్నాయి!

ప్రస్తుత పాలకవర్గానికి అసలు భయమంతా – 2024 జనరల్‌ ఎన్నికల వరకే గాక ఆ తరువాత కూడా ప్రస్తుత క్రియాశీల ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ మరికొంత కాలం పదవిలో ఉండ బోవడమే! ప్రస్తుతం కిరణ్‌ రిజిజు మనోవేదనంతా సుప్రీం చుట్టూనే తిరుగుతోంది!

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 
abkprasad2006@yahoo.co.in 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top