
ఈ ఏడాది ఉగాది నుంచి ‘స్వర్ణాంధ్ర–2047’ విజన్‌లో భాగంగా రాష్ట్రంలోని అత్యంత నిరుపేదలను ఆదుకోవడానికి చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ‘ప్రభుత్వ–ప్రైవేటు–ప్రజల భాగ స్వామ్యం’ (పీ4). మరింత వివరంగా చెప్పాలంటే, అత్యంత పేదరికం (జీరో పావర్టీ)తో మగ్గిపోతున్న 20 శాతం కుటుంబాలను అత్యున్నత స్థాయిలో ఆర్థికంగా నిలదొక్కుకున్న 10 శాతం మంది మార్గదర్శకులు పేదరికం నుండి విముక్తి చేసే బాధ్యతను చేపట్టాలని చంద్రబాబు నిర్దేశి స్తున్నారు.
ఈ పథకంతో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించటం సాధ్యమేనా? 1991 తర్వాత దేశంలో ప్రవేశపెట్టబడిన సరళీకృత ఆర్థిక విధానాలు ఏ వర్గాలకు ఉపయోగపడ్డాయి? ఈ విధానాలు ఆశ్రిత పెట్టు బడిదారీ వర్గం పెరగడానికి తోడ్పడ్డాయి. కనుకనే జాతీయ ఆర్థిక అభివృద్ధి పెరిగినట్లు కనిపిస్తోంది కానీ పేదరికం తగ్గలేదు. ఫలితంగా భారత దేశం ఆకలి సూచీలో 150వ స్థానానికి దిగజారింది. ఈ అసలు వాస్తవా లను మరుగుపరిచి చంద్రబాబు ‘పీ4’ పథకంతో పేదరికాన్ని నిర్మూలి స్తానని చెప్పటం వృథా ప్రయాస.
వాస్తవానికి ఈ పీ4 విధానం చంద్ర బాబు కొత్తగా కనిపెట్టినది ఏమీ కాదు! ఏనాడో గాంధీ ప్రబోధించిన ధర్మకర్తృత్వ సిద్ధాంతంలో భాగంగా వచ్చినదే. 2013లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే నూతన ఆర్థిక సంస్కరణల అమలులో భాగంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సి బిలిటీ (సీఎస్‌ఆర్) పథకాన్ని చట్టం రూపంలోకి తీసుకొచ్చారు. కార్పొరేట్ సంస్థలు రాష్ట్రంలో ఏదైనా ప్రాజెక్టులు చేపట్టినా, పెట్టు బడులు పెట్టినా ఓ ప్రాంతాన్ని లేదా మండలాన్ని లేదా గ్రామాన్ని దత్తత తీసుకోవాల్సి ఉంటుంది.
అక్కడ అభివృద్ధి చేయడమే కాదు, ప్రజలను కూడా పేదరికం నుంచి గట్టెక్కించాలి. సింపుల్‌గా ఇదే పీ4 కాన్సెప్ట్. టాటాలు మొదలుకొని మైక్రోసాఫ్ట్ అధినేతల వరకు అనేక ట్రస్టుల పేరులతో కొన్ని వేల కోట్ల రూపాయల వరకు వివిధ రూపాలలో సామా జిక అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు. అయినా దేశ సామాజిక చిత్రంలో మౌలిక మార్పులు జరిగాయా! లేకపోగా దేశ సామాజిక చిత్రపటం మరింతగా మసకబారి పోయింది. ఈ వాస్తవాల నేపథ్యంలో చూసిన ప్పుడు పీ4 పథకంతో పేదరికాన్ని నిర్మూలించడం సాధ్యమేనా?
అసలు పీ4 పథకంలో ప్రకటించిన మార్గదర్శకులు ఎవరు? నూతన ఆర్థిక విధానాలలో భాగమైన ప్రైవేటీకరణకు పుట్టిన బిడ్డలే కదా! సహ జంగా ఈ సమాజంలో నెలకొన్న జీవ కారుణ్య సిద్ధాంతాలలో భాగంగా ధనవంతులు పేదవారికి సహాయం చేస్తున్నారు. కానీ చంద్రబాబు అమలు చేస్తున్న ప్రైవేటీకరణ విధానాల ఫలితంగా లాభం పొందిన పెట్టుబడిదారులకు ‘మార్గదర్శకులు’ అని పేరు పెట్టడం అన్యాయం.
వివిధ రాయితీల రూపంలో ప్రజల ఆస్తులను చౌకగా కట్టబెట్టిన పెట్టు బడిదారుల చేత సహాయం చేయించి, పేదరికాన్ని నిర్మూలించాలను కోవడం ఎవరి ప్రయోజనాలను కాపాడటం కోసం? సామాజిక వ్యవస్థలో నానాటికీ పెరుగుతున్న ఆర్థిక అసమానతల ఫలితంగా ఉద్య మాలవైపు ఆకర్షితులవుతున్న ప్రజల్ని పేదరిక నిర్మూలన జరుగుతుందనే ఊహాజనిత భ్రమల్లో ముంచడానికి ప్రపంచ బ్యాంకు నిర్దేశిత పథకాల్లో ఒకటైన పీ4 పథకాన్ని ప్రజలపై ప్రయోగించటానికి పూనుకున్నారు చంద్రబాబు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ‘జన్మభూమి’ పథకాన్ని కొత్తరూపంలో ప్రవేశపెట్టిందే పీ4 పథకం!
ఉత్పత్తి సాధనాలపై ప్రజల యాజమాన్యంలో భాగంగా ‘దున్నే వానికే భూమి’, అటవీ ప్రాంతాల్లో అపారంగా ఉన్న ఖనిజ వనరులపై ఆదివాసులకు పూర్తి హక్కులు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పటం, ప్రైవేటీకరణ విధానా లను విడనాడి ప్రభుత్వ రంగంలో అన్ని రంగాల పరిశ్రమలనూ నెలకొల్పడం లాంటి విధానపరమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమాల బాట పడుతున్న ప్రజల్ని ఉద్య మాల బాట వైపు వెళ్లకుండా నిరోధించటా నికి, అంతిమంగా ప్రజలు తమ పట్ల విధేయ తాభావంతో ఉండి తమను నాలుగు కాలాల పాటు అధికారంలో కొనసాగేలా, తమను ప్రజల పాలిట ధర్మ ప్రభువులుగా పొగిడేలా చేసుకోవడానికి ఈ పథకం ప్రవేశపెట్టారన్నది అసలు రహస్యం.
ఎన్నికల్లో అధికారంలోకి రావటానికి, ప్రజల ఓట్లను కొల్ల గొట్టడానికి ఆచరణ సాధ్యం కానీ ‘సూపర్ సిక్స్’ హామీలు ఇచ్చి, ఆ పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను నెరవేర్చటంలో తమ ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై విసురుతున్న ‘పీ4’ లాంటి మాయా పథకాలను ఈ దృక్కోణంతోనే చూడాలి. ప్రజలను ఆ భ్రమల్లో పడనీయకుండా చైతన్య పరుస్తూ, ప్రజా పోరాటాలను ఉద్ధృతం చేయాలి!
– ముప్పాళ్ళ భార్గవ శ్రీ
సీపీఐ ఎంఎల్ నాయకులు ‘ 98481 20105