బంగ్లా సుస్థిరత కొనసాగేనా? | Sakshi
Sakshi News home page

బంగ్లా సుస్థిరత కొనసాగేనా?

Published Fri, Jan 5 2024 4:19 AM

Sakshi guest column on Bangladesh Elections

భారత్‌కు సన్నిహిత పొరుగుదేశం, నమ్మదగిన భాగస్వామి అయిన బంగ్లాదేశ్‌లో జనవరి 7న ఎన్నికలు జరగనున్నాయి. 2009 నుంచి దేశ ప్రధానిగా అప్రతిహతంగా కొనసాగుతున్న షేక్‌ హసీనా ఈసారి కూడా తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. అయితే, ఎన్నికలు స్వేచ్ఛగా జరగడం లేదనీ, హసీనా ఇటీవలి సంవత్సరాలలో నియంతగా మారిందనీ ఆమె విమర్శకులు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో ఆమె పదవీకాలం బంగ్లాదేశ్‌లో రాజకీయ సుస్థిరతను తెచ్చిపెట్టింది. గత దశాబ్దంలో బంగ్లాదేశ్‌ తలసరి ఆదాయం మూడు రెట్లు పెరిగింది. గడచిన 20 ఏళ్లలో 2.5 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుండి బయటపడినట్లు ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.

జనవరి 7న బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. పాలక అవామీ లీగ్‌ అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని చూస్తోంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ(బీఎన్‌పీ) ఎన్నికలను బహిష్కరించడం వల్ల ఈ పని మరింత సులభమవుతోంది. స్వతంత్ర అభ్యర్థులతో పాటు కొన్ని చిన్న, పెద్దగా పేరులేని రాజకీయ పార్టీలు అధికార పక్షానికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నప్పటికీ, అవి పెద్ద సవాలుగా మారే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి అఖండ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే, బీఎన్ పీ ఈ ఎన్నికలలో పాల్గొనక పోవడం అనేది అవామీ లీగ్‌ సాధించనున్న విజయంలోని ఆకర్షణను అయితే కచ్చితంగా తగ్గిస్తుంది.

బేగమ్‌ల పోరు
బంగ్లాదేశీయులు దేశ పితామహుడిగా భావించే షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ కుమార్తె అయిన షేక్‌ హసీనా అవామీ లీగ్‌ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. సైనిక నియంత జియావుర్‌ రెహమాన్‌ భార్య ఖలీదా జియా బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీకి సారథ్యం వహిస్తు న్నారు. ఈ ఇద్దరు మహిళలను బంగ్లాదేశ్‌లోని పరస్పరం పోరాడు తున్న బేగమ్‌లు (‘బ్యాట్లింగ్‌ బేగమ్స్‌’) అని కూడా పిలుస్తారు.

బంగ్లాదేశ్‌లో 1990లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ తర్వాత జరి గిన తొలి మూడు ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వంతులవారీగా అధికారంలో ఉన్నాయి. అయితే 2009 నుంచి దేశానికి హసీనా సారథ్యం వహిస్తున్నారు. గత దశాబ్దపున్నర కాలంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగలేదని విమర్శకులు ఆరోపించారు. 2014 ఎన్నికలను బహిష్కరించడం బీఎన్ పీ చేసిన తప్పిదమనీ, అవామీ లీగ్‌ భారీ మెజారిటీతో అధికారాన్ని నిలుపుకోవడానికి అది వీలు కల్పించిందనీ కొందరు అంటున్నారు. ఈ నిర్ణయం బీఎన్ పీనీ,  దాని అగ్రనేతలనూ పార్లమెంటుకు చాలాకాలం పాటు దూరంగా ఉంచింది.

ఖలీదా, తారిఖ్‌ రెహమాన్‌ (ఖలీదా కుమారుడు, రాజకీయ వారసుడు) సహా చాలా మంది నాయకులు అవినీతి కేసుల్లో చిక్కు కోవడంతో పార్టీ మరింత అపఖ్యాతి పాలైంది. వారి అక్రమాలకు సంబంధించి విచారణ జరిపి వారికి శిక్ష విధించారు. రెహమాన్‌ బంగ్లాదేశ్‌ రాజకీయాలతో సంబంధం లేకుండా లండన్‌లో ఉంటు న్నారు. ఖలీదా గృహనిర్భంధంలో ఉన్నారు; పైగా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆమె తన పార్టీ రాజకీయ అదృష్టాన్ని పునరుద్ధరించడం కష్టమైపోయింది.

మునుపటి ఎన్నికలకు ముందు బీఎన్ పీ హింసాత్మక చర్యల్లో పాల్గొంది. ఇది బీఎన్ పీకి చెందిన మరికొందరు అగ్రనేతలను విచారించే అవకాశాన్ని కూడా అవామీ లీగ్‌కు ఇచ్చింది. ఫలితంగా పార్టీ ఇప్పుడు చాలా బలహీనంగా ఉంది. అవామీ లీగ్‌ను ఏ విధంగానూ ఎదుర్కొనే స్థితిలో లేదు.

ఆపద్ధర్మం స్థానంలో...
బీఎన్ పీ కూటమి కీలక భాగస్వామి అయిన బంగ్లాదేశ్‌ జమాత్‌– ఎ–ఇస్లామీని ఎన్నికలలో పోటీ చేయకుండా నిషేధించారు. పార్లమెంటరీ చట్టాలపై తమకు నమ్మకం లేదనీ, ఇస్లామిక్‌ చట్టం, పాలనకు మాత్రమే కట్టుబడి ఉన్నామనీ ఆ పార్టీ పదేపదే ప్రకటించింది. దీంతో బంగ్లాదేశ్‌ ఎన్నికల సంఘం జమాత్‌ పార్టీ రిజిస్ట్రేషన్ ని రద్దు చేసింది. హసీనా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన యుద్ధ నేరాల విచారణ నేపథ్యంలో జమాతే ఇస్లామీ అగ్రనేతలకు ఉరిశిక్షలు పడ్డాయి. దాంతో పార్టీ మరింత నష్టపోయింది.

సార్వత్రిక ఎన్నికలను తటస్థ మధ్యంతర ప్రభుత్వం నిర్వహించాలని బీఎన్ పీ డిమాండ్‌ చేస్తోంది. హసీనా ప్రభుత్వం స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించదని ఆ పార్టీ భయపడుతోంది. అయితే ప్రతిపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించడం లేదు. 2018 ఎన్నికలలో పాల్గొనడం ద్వారా తాము తప్పు చేశామని బీఎన్ పీ ఇప్పుడు నమ్ముతోంది.

2011లో 15వ రాజ్యాంగ సవరణ ద్వారా తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటును అవామీ లీగ్‌ ప్రభుత్వం తొలగించింది. అంతకు ముందు ఆపద్ధర్మ ప్రభుత్వం నిర్ణీత గడువులోగా ఎన్నికలు నిర్వహించి ఎన్నికైన పార్టీకి అధికారాన్ని అప్పగించేది. ఏది ఏమైనప్పటికీ, తాత్కాలిక ప్రభుత్వం కొన్ని సంవత్సరాలు (2007–09) కొనసాగింది, సాధారణ ప్రభుత్వం వలె పనిచేయడమే కాకుండా దాని అధికార పరిధికి మించిన అనేక చర్యలు కూడా తీసుకుంది. అలాగే హసీనా, ఖలీదాలను కూడా విచారించింది. స్పష్టంగా, ఆపద్ధర్మ ప్రభుత్వం తప్పు చేయలేని వ్యవస్థ అయితే కాదు. అందుకే బంగ్లాదేశ్‌ ఇతర ప్రజా స్వామ్య దేశాలలో మాదిరిగా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించగల సంస్థలతో ముందుకు రావాలి.

నిశ్శబ్ద విజయాలు ఉన్నప్పటికీ...
షేక్‌ హసీనా ఇటీవలి సంవత్సరాలలో నియంతగా మారిందని ఆమె విమర్శకులు ఆరోపిస్తుండగా, ఆమె పదవీకాలం బంగ్లాదేశ్‌లో రాజకీయ సుస్థిరతను తెచ్చిపెట్టిందన్నది మరో నిజం. ఇది బంగ్లాదేశ్‌కూ, దాని ప్రజలకూ ప్రయోజనకరంగా నిరూపితమైంది. దేశం వేగవంతమైన ఆర్థిక వృద్ధిని చవిచూస్తోంది. దక్షిణాసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో బంగ్లాదేశ్‌ ఒకటి. గత దశాబ్దంలో దాని తలసరి ఆదాయం మూడు రెట్లు పెరిగింది. గత 20 ఏళ్లలో 2.5 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుండి బయటపడినట్లు ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.

అనేక ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా హసీనా ప్రభుత్వం అమలు చేసింది. దేశ సొంత ఆర్థిక వనరులు, రుణాలు, అభివృద్ధి సహాయాల కలయికతో, కీలకమైన 2.9 బిలియన్‌ డాలర్ల పద్మ వంతెనను గంగానదిపై నిర్మించారు. ఈ వంతెన ఒక్కటే దేశ జీడీపీని 1.23 శాతం పెంచడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు.

ఈ విజయాలు ఉన్నప్పటికీ, కోవిడ్‌ –19 మహమ్మారి నేపథ్యంలో బంగ్లాదేశ్‌ ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. నవంబరులో ద్రవ్యోల్బణం 9.5 శాతానికి చేరుకోవడంతో పెరుగుతున్న జీవన వ్యయంతో దేశం పోరాడుతోంది. విదేశీ మారక నిల్వలు ఆగస్టు 2021లో రికార్డు స్థాయిలో 48 బిలియన్ల డాలర్ల నుండి ఇప్పుడు దాదాపు 20 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. ఇవి మూడు నెలల దిగుమతులకు కూడా సరిపోవు. అదనంగా, దాని విదేశీ రుణం 2016 నుండి రెట్టింపు అయింది. అయితే, భారతదేశం అవసరమైన వస్తువులను సరఫరా చేయడం ద్వారా బంగ్లాదేశ్‌కు సహాయం చేసింది.

దశాబ్దపున్నర కాలంగా బంగ్లాదేశ్‌లో ఉన్న రాజకీయ సుస్థిరత ఆర్థికాభివృద్ధికి కారణమైందనడంలో సందేహం లేదు. భారతదేశం, బంగ్లాదేశ్‌ ఇప్పుడు మరింతగా ఎక్కువ స్థాయి విశ్వాసాన్ని కలిగివున్న భాగస్వామ్య పక్షాలు. దీని ఫలితంగా ఇరు దేశాల మధ్య మెరుగైన రైలు కనెక్టివిటీ, ద్వైపాక్షిక వాణిజ్యం ఏర్పడింది.

అయితే, చైనా నేతృత్వంలోని అంతర్జాతీయ వాణిజ్య కూటమి, రీజినల్‌ కాంప్రహెన్సివ్‌ ఎకనామిక్‌ పార్ట్‌నర్‌షిప్‌లో బంగ్లాదేశ్‌ ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో పొరుగుదేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చలపై భారత్‌ను జాగ్రత్తగా నడుచుకునేలా చేసింది. భారతదేశం పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించాక పరిస్థితులు తనకు అనుకూలంగా పని చేస్తాయని ఆశిస్తోంది.
ఆనంద్‌ కుమార్‌  
వ్యాసకర్త అసోసియేట్‌ ఫెలో, మనోహర్‌ పారీకర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డిఫెన్స్‌ స్టడీస్‌ అండ్‌ ఎనాలిసెస్, న్యూఢిల్లీ

Advertisement
 
Advertisement