Puvvada Ajay Kumar: అప్రతిహత ప్రగతికి పట్టం కట్టండి

Puvvada Ajay Kumar Write on Munugode Bypoll, Development in Telangana - Sakshi

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఎన్నో పోరాటాల ఫలితం. రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్‌ ప్రభుత్వం చేస్తున్న కృషి అనన్యం. ‘రైతుబంధు’ నేడు దేశానికే ఆదర్శవంతమైన పథకం. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వృద్ధాప్య పింఛన్లు, డబుల్‌ బెడ్రూం ఇండ్లు వంటి కార్యక్రమాలతో ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా తెలంగాణ నిలుస్తున్నది.

ఒక నాడు ఎక్కడ చూసినా నెర్రెలు– మట్టి నిండిన ఒర్రెలు, సాగు మొత్తం ఆగమయ్యిందే అని దిగాలు పడ్డ తెలంగాణ... ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ అయ్యిందంటే ఎంత అద్భుతం! అందుకు ఎన్ని ప్రణాళికలు కావాలి, ఎంత ఆచరణాత్మక కృషి జరగాలి? మీకు వ్యవసాయం వస్తదా? అని ప్రశ్నించిన నోళ్లతోనే మీకే వ్యవ సాయం వస్తదని చెప్పించాలంటే ఎంత సమర్థ వంతమైన నాయకత్వం కావాలి? ఎంతటి అకుంఠిత కార్యాచరణ అవసరం. అంత అద్భుతం జరిగింది కేసీఆర్‌ వల్లనే. 

దేశంలో 20, 30 టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులు కట్టడానికే ఎన్నో ఏండ్లు తీసుకుంటున్న సమయంలో 200 టీఎంసీల నిలువ సామర్థ్యం, అవసరాన్ని బట్టి దాదాపు 500 టీఎంసీల వరకు సామర్థ్యం పెరిగే కాళేశ్వరం లాంటి అతిపెద్ద ప్రాజెక్టు నిర్మాణాన్ని మూడేండ్లలో పూర్తిచేసి ప్రారంభించడం కేసీఆర్‌ దక్షతకు నిదర్శనం.

ఒకవైపు భారీ ప్రాజెక్టులను నిర్మిస్తూనే మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులను సైతం సర్కారు అంతే వేగంగా నిర్మించింది. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో ఏండ్ల తరబడి సాగదీతకు గురై, వెనక్కి నెట్టివేయ బడ్డ కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎల్లంపల్లి, భీమా, మిడ్‌ మానేరు, సింగూరు, కొమ్రం భీం, నీల్వాయి, జగన్నాథ్‌పూర్, కోయిల్‌సాగర్‌ లిఫ్ట్‌ ప్రాజెక్టులను పూర్తిచేసింది. ఇక చనఖా– కొరటా, సదర్‌మట్, సీతమ్మసాగర్, గట్టుప్రాజెక్టులు చివరిదశలో ఉండగా సమ్మక్క బ్యారేజీ ఇప్పటికే పూర్తయింది. ఇవేకాదు, నీటిపారుదల రంగంలో రికార్డులు తిరగ రాస్తూ 11 నెలల్లోనే ఖమ్మంలో భక్త రామదాసు, జోగులాంబ గద్వాల జిల్లాలో తుమ్మిళ్ల ఎత్తిపోత లను పూర్తిచేసింది. ప్రాజెక్టులన్నీ పూర్తయితే దాదాపు కోటిన్నర ఎకరాలకు సాగునీరు అందు తుంది. తెలంగాణలోని ప్రతి అంగుళం భూమికి సాగునీరు చేరుతుంది.

తెలంగాణ వచ్చేనాటికి విస్తీర్ణ యోగ్యమైన కోటి 40 లక్షల ఎకరాల భూమిలో సగానికి కొంచెం అటూ ఇటుగా రైతులు సాగుచేసేవారు. కానీ నేడు 2 కోట్ల 5 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది. అంటే 50 శాతానికి పైగా వృద్ధి చెందింది. వ్యవసాయరంగం ఏటా 14.5 శాతం వృద్ధిరేటును నమోదు చేస్తూ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదుగుతున్నది. ఈ ప్రగతి అప్రతిహతంగా కొన సాగాలి. మనమందరం ఈ అభివృద్ధిలో భాగస్వా ములం కావాలి. ప్రతీ ఒక్కరు తనవంతు సహ కారం ప్రభుత్వానికి అందించాలి. 

ఈ నిలువెత్తు ప్రగతి విమర్శకులకు కనిపించదా? అవసరం కోసం, అవకాశాల కోసం రాజకీయాలు చేసేవాళ్లు ఎన్నైనా మాట్లాడుతుంటారు, కానీ బాధ్యతల్ని భుజాలపై మోసే నాయకత్వానికే తెలుస్తుంది కదా ప్రజల జీవితాలను ప్రగతిపథం వైపు ఎట్లా నడిపించాలో! 

తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం పట్ల బీజేపీ శ్రద్ధ ఎప్పుడూ ప్రశ్నార్థకమే. ప్రాంతీయ అస్తిత్వాలను జాతీయ పార్టీలు ఏనాడూ పట్టించుకోలేదు. గడిచిన ఐదారు దశాబ్దాల్లో జరిగిందిదే. జాతీయ స్థాయి పథకాల గురించి మాట్లాడే బీజేపీ తెలంగాణకు ఒరగ బెట్టిందేమీ లేదు. కాళేశ్వరానికి కానీ, ఇక్కడి మరొక నీటి పథకానికి కానీ జాతీయ హోదాను ఇవ్వడం లేదు. ఆర్థిక సహాయం చేయడం లేదు. పసుపు బోర్డుపై చేసిన వాగ్దానం అట కెక్కింది. కాజీపేట వర్క్‌ షాపు కాగితాల్లో మురిగింది. తెలంగాణ ఆత్మగౌరవం గురించి కానీ, బడుగు బలహీన వర్గాల ఉన్నతిని గురించి కానీ ఆ పార్టీకి ఉన్న శ్రద్ధ ఎంతనో తెలంగాణలో అందరికీ స్పష్టం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వరుస పరాజయాలు పొందిన ఈ పార్టీ టీఆర్‌ఎస్‌కు ఏ మాత్రం ప్రత్యామ్నాయంగా నిలువ లేదని ప్రజలకు స్పష్టమైంది.

తెలంగాణ అస్తిత్వాన్ని వచ్చే దశాబ్దాలకు కూడా కాపాడగలిగిన యువనాయకత్వం కూడా టీఆర్‌ఎస్‌కే ఉన్నది. ప్రాంతీయ అస్తిత్వాలను, ఆత్మ గౌరవాన్నీ కాపాడగలిగేది ప్రాంతీయ పార్టీలే అని చాలా రాష్ట్రాల్లో రుజువైంది. తెలంగాణ అస్తి త్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడగలిగేది నేడున్న పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌ మాత్రమేనని ప్రజల్లో స్థిరభావం ఏర్పడింది.

ఇటీవల అందరూ తమ దృష్టిని కేంద్రీకరించి ఉన్న మునుగోడు ఉప ఎన్నికలో అధికారం కోసం పాకులాడే పార్టీలు ఒకవైపు, తెలంగాణను బల మైన రాష్ట్రంగా తీర్చిదిద్ది సబ్బండ వర్గాల ఆర్థిక స్థితి గతులను పెంచటానికి కృషి చేస్తున్న టీఆర్‌ఎస్‌ మరోవైపు ఉన్నాయి. ప్రజలు దూరదృష్టితో ఆలోచించి టీఆర్‌ఎస్‌ పక్షాన నిలబడి ఉద్యమ పార్టీకి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఢిల్లీని ప్రతిపక్షాలు నమ్ముకుంటే, టీఆర్‌ఎస్‌ పార్టీ గల్లీ ప్రజలనే నమ్ముకుంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలం గాణ వ్యతిరేకులకు ప్రజలు బుద్ధిచెప్పాలి అని విజ్ఞప్తి చేస్తున్నాం. (క్లిక్ చేయండి: ఓటుబ్యాంకు రాజకీయాలు ఎన్నాళ్లు?)


- పువ్వాడ అజయ్‌ కుమార్‌
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top