అవతరణ దినోత్సవం ఓ గౌరవం.. ఓ గుర్తింపు

Kommineni Srinivasa Rao Guest Column November 1st AP Formation Day - Sakshi

విశ్లేషణ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నవంబర్‌ ఒకటిన రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించడం ద్వారా మళ్లీ ఆంధ్రులకు ఒక గౌరవం, ఒక గుర్తింపు తెచ్చారు. ప్రతి రాష్ట్రానికి అవతరణ దినోత్సవం ఉంటుంది. కాని 2014 నుంచి ఐదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్‌కు అలాంటి ఉత్సవం లేకుండా జరిగిపోయింది. నాటి సీఎం చంద్రబాబునాయుడు నవనిర్మాణ దీక్షల పేరుతో పెద్ద ప్రహసనం సృష్టించారు. చాలామంది విజ్ఞులు, మేధావులు, నవంబర్‌ ఒకటి లేదా, అక్టోబర్‌ ఒకటో తేదీన అవతరణ దినోత్సవం జరపాలని సూచించారు. అయినా ఆయన వినిపించుకోలేదు.

తెలంగాణ ఏర్పడిందని తెలంగాణ ప్రభుత్వం సంబరాలు జరుపుకుంటుంటే, వాటికి వ్యతిరేకంగా నవనిర్మాణ దీక్షల పేరుతో రోదనల కార్యక్రమం చేపట్టేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ, సోనియాగాంధీ ఆంధ్రులకు తీరని అన్యాయం చేశారని, ఆంధ్రుల పొట్టకొట్టారని ఇలా ఏవేవో డైలాగులు చెప్పడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, దీక్షలకు హాజరైన పార్టీ నేతలు, కార్యకర్తలతో ఏవేవో ప్రతిజ్ఞలు చేయించేవారు. ఏపీ ప్రజలను ఒక సమైక్య సెంటిమెంటుతో మభ్యపెట్టాలని ఆయన విశ్వప్రయత్నం చేశారు. కాని ప్రజలు ఆయన మాయలో పడలేదని గత ఎన్నికల్లో రుజువు అయింది. తదుపరి సీఎం అయిన వైఎస్‌ జగన్‌ పద్ధతి ప్రకారం నవంబర్‌ ఒకటిని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రకటించి, అందుకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించడం ముదావహం. తద్వారా ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఒక ఉనికి ఉందని ఆయన దేశానికి తెలియచేసినట్లయింది. 

ఒకప్పుడు కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు మద్రాస్‌ ప్రావిన్స్‌లో భాగంగా ఉండేవి. కానీ ఆంధ్రులు ప్రత్యేక రాష్ట్రం కావాలన్న డిమాండ్‌తో పెద్ద ఉద్యమం నడిపారు. చివరికి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతో కేంద్రంలోని జవహర్‌లాల్‌ ప్రభుత్వం దిగి వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని 1953 అక్టోబర్‌ ఒకటిన ఏర్పాటు చేసింది. ఆ సమయంలో హైదరాబాద్‌ రాష్ట్రం వేరుగా ఉండేది. ఆ రాష్ట్రంలో తెలుగు ప్రాంతం అయిన తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల లోని కొన్ని ప్రాంతాలు ఉండేవి. తదుపరి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలన్న ఆకాంక్ష దేశంలోని పలు రాష్ట్రాలలో వచ్చింది. అప్పటికే తెలుగువారంతా ఒక రాష్ట్రంగా ఏర్పడాలన్న ఆకాంక్ష పెరిగి ఆంధ్రప్రదేశ్‌ అవతరణకు దారి తీసింది. అయితే తెలంగాణ నేతలు కొందరు తమకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలని డిమాండ్‌ చేసేవారు.

అయినా ఇరు రాష్ట్రాల శాసనసభల మెజార్టీ నిర్ణయం ప్రకారం 1956 నవంబర్‌ ఒకటిన ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది. తదుపరి ప్రత్యేక ఉద్యమాలు వచ్చాయి. అయినా కేంద్రం ఉమ్మడి ఏపీ విభజనకు అంగీకరించలేదు. కానీ రాజకీయాలు ఎప్పుడూ ఒక రకంగా ఉండవు కదా.. 1998లో కాకినాడలో జరిగిన సమావేశంలో బీజేపీ ఒక ఓటు రెండు రాష్ట్రాల నినాదం తీసుకొచ్చింది. 1999లో టీడీపీ మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు అప్పటివరకు మంత్రిగా ఉన్న కేసీఆర్‌కు కొత్త క్యాబినెట్‌లో మంత్రి పదవి ఇవ్వలేదు. కొద్ది కాలానికి ఉపసభాపతి పదవి ఇచ్చినా, ఆయన అవమానంగా ఫీల్‌ అయ్యారు. ఆ తరుణంలో తెలంగాణ రాజకీయ ఉద్యమానికి సన్నాహాలు ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత ఆయన టీడీపీకి గుడ్‌బై చెప్పి సొంత పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసుకున్నారు. 

ఆ సమయంలో తెలంగాణ కాంగ్రెస్‌ వాదులు కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలంటే తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని, టీఆర్‌ఎస్‌ తో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీని డిమాండ్‌ చేసేవారు. అందుకు ఆమె అంగీకరించి తెలంగాణకు అనుకూల ప్రకటన చేస్తూనే దేశంలోని మరికొన్ని ఇతర రాష్ట్రాలకు లింక్‌ పెట్టారు. తదుపరి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం, కేంద్రంలో మన్మోహన్‌ సింగ్‌ ఆధ్వర్యంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడ్డాయి.. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించడం లేదని ఆరోపిస్తూ కేసీఆర్‌ కేంద్రమంత్రి పదవినుంచి, అలాగే టీఆర్‌ఎస్‌ మంత్రులు రాష్ట్రం నుంచి వైదొలిగారు. ఆ తర్వాత వైఎస్‌ హయాంలో టీఆర్‌ఎస్‌ కొంత బలహీనపడింది. ఆ తరుణంలో తెలుగుదేశంలో తెలంగాణ నేతలు ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ చేసేవారు. అప్పుడుకూడా ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అభిప్రాయ సేకరణ పేరుతో ఒక తంతు నడిపి ఆంధ్ర, రాయలసీమ నేతల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేశారు.

మరోవైపున కేంద్రం ఎలాగూ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వదని పార్టీ నేతలతో చెబుతుండేవారు. 2009లో టీఆర్‌ఎస్, వామపక్షాలతో కలిసి తెలుగుదేశం పోటీచేసినా ఆ కూటమి అధికారంలోకి రాలేక పోయింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఒంటి చేత్తో కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తెచ్చారు. కాని అనూహ్యంగా వైఎస్‌ మరణంతో రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. అప్పుడు మెజార్టీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వైఎస్‌ జగన్‌ను సీఎం చేయాలని అధిష్టానాన్ని కోరినా కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం అంగీకరించలేదు. సీనియర్‌ వృద్ధనేత రోశయ్యకు అవకాశం ఇచ్చారు. తదుపరి రోశయ్య ఆధ్వర్యంలో ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయగా, టీడీపీ అప్పుడు కూడా తెలంగాణకు అనుకూలంగా అభిప్రాయం చెప్పింది. అసెంబ్లీలో సైతం తెలంగాణ తీర్మానం మీరు పెడతారా, తమను పెట్టమంటారా అన్నంతవరకు టీడీపీ వెళ్లింది. 

ఈ క్రమంలో కేంద్రంలో కాంగ్రెస్‌ వైఖరిలో కూడా తేడా వచ్చింది. సడన్‌గా తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా యూపీఏ పక్షాన, కాంగ్రెస్‌ తరపున ఆనాటి హోం మంత్రి చిదంబరం ప్రకటన చేశారు. కాని అప్పుడు చంద్రబాబు, ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అంతా కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఆంద్ర, రాయలసీమ ప్రాంతాల ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిం చారు. దాంతో కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పెండింగులో పెట్టి మళ్లీ సంప్రదింపుల ప్రక్రియ, శ్రీకృష్ణ కమిషన్‌ ఏర్పాటు తదితర చర్యలు చేపట్టింది. రోశయ్య తర్వాత సీఎం అయిన కిరణ్‌కుమార్‌ రెడ్డి పూర్తిగా సమైక్యవాది. కాని ఆయన పరిస్థితిని అదుపు చేయలేకపోతున్నారన్న అభిప్రాయానికి వచ్చిన కాంగ్రెస్‌ అధిష్టానం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు దిశగా ముందుకు వెళ్లింది. ఆ తరుణంలో కిరణ్‌ కుమార్‌రెడ్డి కొందరు టీడీపీ ఎమ్మెల్యేల ద్వారా చంద్రబాబుకు కబురు చేసి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వవద్దని వర్తమానం పంపించారు.

కాని చంద్రబాబు మాత్రం రెండోసారి కూడా తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చారు. అప్పటికే కాంగ్రెస్‌ రాజకీయాలలో మార్పులు వచ్చి కడప ఎంపీగా ఉన్న వైఎస్‌ జగన్‌ సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ పార్టీ ఆర్టికల్‌ మూడు కింద దీనిపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని తొలుత చెప్పినా, ఆ తర్వాత రాష్ట్రం సమైక్యంగా ఉండాలని స్పష్టం చేసింది. కాని చంద్రబాబు మాత్రం రెండు కళ్ల సిద్ధాంతం అంటూ ప్రచారం చేశారు. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రవాదన, ఏపీలో సమైక్యవాదానికి అనుకూలంగా వ్యవహరించడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరచేవారు. విభజనతో ఏపీకి అన్యాయం జరిగిందంటూ యాత్రలు కూడా చేశారు. ఈ రకంగా డబుల్‌ గేమ్‌ ఆడుతూనే వ్యూహాత్మకంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు మోదీ వేవ్‌ బాగా ఉండడం, పవన్‌ కళ్యాణ్‌ తాను పోటీచేయకుండా టీడీపీకి సహకరించడం, అలాగే రైతులకు పూర్తి రుణమాఫీ చేస్తామన్న నినాదాల ద్వారా 2014లో అధికారంలోకి రాగలిగారు.

అంతకుముందు జరిగిన 18 ఉపఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలవని టీడీపీ, 2014లో అధికారంలోకి రావడానికి అనేక అంశాలు కలిసివచ్చాయి. ఆ తర్వాత ఆయన ఉమ్మడి హైదరాబాద్‌ను పదేళ్లపాటు రాజధానిగా ఉపయోగించుకునే అవకాశం ఉండగా, ఓటుకు నోటు కేసులో దొరికిపోయి, కేసీఆర్‌తో రాజీపడి రాత్రికి రాత్రి విజయవాడ వెళ్లిపోయారు. అదే సమయంలో తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జూన్‌ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆరంభించారు.

మరో వైపు చంద్రబాబు పరోక్షంగా దానిని వ్యతిరేకిస్తూ నవనిర్మాణ దీక్షల పేరుతో రోజూ ఎక్కడో ఓ చోట ఒక సభ పెట్టి కేసీఆర్, జగన్‌ల వల్ల రాష్ట్రం విడిపోయిందని చిత్రమైన వాదన చేసేవారు. ఇలా ఐదేళ్లపాటు నవనిర్మాణ దీక్షలు చేస్తూ అక్కడ కూడా డబుల్‌ గేమ్‌ ఆడుతుండేవారు. ఒక వైపు రాష్ట్రం తీవ్ర కష్టాల్లో ఉంది.. నష్టాలలో ఉంది. ఆదాయం లేదు.. అంటూ రోదన వినిపించేవారు. మరో వైపు తాను ఎంతో అభివృద్ధి చేస్తున్నానని, ఆయా రంగాలలో రాష్ట్రం దూసుకు వెళుతోందని, కేంద్రం కన్నా ఎక్కువ అభివృద్ధిని సాధిస్తున్నామని, గ్రోత్‌ రేట్‌ రెండు అంకెల్లో సాధించామని రకరకాల లెక్కలు ప్రచారం చేసేవారు. బీజేపీతో విడిపోయిన తర్వాత కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ధర్మపోరాట దీక్షలు అంటూ ప్రతి జిల్లాలోను సభలు నిర్వహించి బీజేపీ నేతలను, మోదీని పలు రకాలుగా దూషించేవారు. 

చంద్రబాబు నాయుడు పాలించిన ఐదేళ్లలో అవతరణ ఉత్సవం లేకుండా చేశారు. పైగా దీక్షల పేరుతో వందల కోట్ల రూపాయలను వృథాగా ఖర్చు పెట్టారు. నిజంగానే చంద్రబాబుకు వాటిపై చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా నవనిర్మాణ దీక్షలు, ధర్మపోరాట దీక్షలు చేయాలి కదా.. ఇప్పుడు ఆయన వాటన్నిటిని వదిలిపెట్టి, ప్రధాని మోదీని ఎలా ప్రసన్నం చేసుకోవాలా అన్నదానిపై తంటాలు పడుతున్నారు. ఇన్ని పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌ నవంబర్‌ ఒకటిన రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపడం అందరికీ సంతోషం కలిగించే విషయం. దీని ద్వారా ఏపీలో ప్రతిభావంతులను, వివిధరంగాలలో ప్రముఖులను సత్కరించుకోవడం, ఆంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఇది ఒక అవకాశం. ఏది ఏమైనా ఆంధ్రులకు నవంబర్‌ ఒకటి ఉత్సవాన్ని పునరుద్ధరించినందుకు జగన్‌కు అభినందనలు, ధన్యవాదాలు తెలియచేద్దాం.
-కొమ్మినేని శ్రీనివాసరావు
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు   

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top