వైరస్‌కు మన కవచం... సంక్షేమ ఫైర్‌వాల్‌

Johnson Choragudi Opinion on Shadow Governance, Pegasus Spyware - Sakshi

విభజన తర్వాతి ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు కుదుటపడటం ఇప్పట్లో కష్టం. రాష్ట్ర ప్రయోజనాల కంటే తమ స్వీయ ప్రయోజనాలే ముఖ్యం అనుకోవడం, ఆ తీరును మోస్తున్న ‘మీడియా’ అందుకు కారణం. తెలంగాణ తన సాంస్కృతిక అస్తిత్వాన్ని ప్రాంతీయ అస్తిత్వంగా మలిచి, రాజకీయ ప్రతిపత్తిని పొందడం చూశాక అయినా, ఆంధ్ర పౌరసమాజంలో ప్రాంతీయ బంధనం (రీజినల్‌ బాండ్‌) కొరకు ఆలోచన మొదలుకావాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనం కోసం ఒక ‘ఎజెండా’తో పనిచేయాలి. రాష్ట్ర దీర్ఘకాల ప్రయోజనాల కోసం అక్కడి జ్ఞాన సమాజం ఈపాటికి ఒక ముసాయిదా రూపొందించి, ప్రభుత్వంతో ‘డైలాగ్‌’ మొదలెట్టాలి. అదొక సమాంతర ‘ఒత్తిడి బృందం’ (ప్రెషర్‌ గ్రూప్‌) కావాలి. అయితే మొదటి ఐదేళ్ళలో ఇవేమీ జరక్కపోవడంతో ఒక పెద్ద శూన్యం ఏర్పడింది.

ఎన్నికైన ప్రభుత్వం అయినా, ఎన్నిక కావాలనుకున్న ప్రతిపక్షం అయినా ప్రజలు–ప్రాంత హితం వాటి లక్ష్యం కావాలి. కొన్ని పార్టీలు ఎప్పుడూ అధికారానికి దూరమే అయినా, అవి నిత్యం ప్రజల పక్షాన ఉన్నట్టుగా కనీసం కనిపిస్తాయి. ‘బీపీవో ప్రభుత్వాలు’ వచ్చాక, ప్రభుత్వంలో వుంటే ఎక్కువ సంపద, ప్రతిపక్షంగా ఉంటే తక్కువ సంపద ‘ఫార్ములా’ అయింది. అందుకే మూకుమ్మడి పార్టీల ఫిరాయింపు మొదలయింది. వ్యాపారం–రాజకీయం నాణేనికి రెండు వైపులుగా మారింది. విభజన తర్వాత ఏపీలో ఏర్పడ్డ తెలుగుదేశం ప్రభుత్వం ‘హబ్‌ అండ్‌ స్పోక్స్‌’ పాలసీని తన ‘విజన్‌ 2029’లో ప్రకటించింది. ఇది పూర్తిగా కేంద్రీకృత పాలనా వ్యవస్థ. దాన్ని మరింత సుస్థిర పర్చుకోవడానికి, రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధులు దాటిమరీ ఇజ్రాయెల్‌ నుంచి ‘సైబర్‌ టెక్నాలజీ’ని కూడా తీసుకోవాలని 2017 ఫిబ్రవరి నాటికే అనుకొంది. ఇజ్రాయెల్‌ దౌత్యవేత్త డేవిడ్‌ కామెరాన్‌ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఇది జరిగిన ఐదేళ్లకు ఇజ్రాయెల్‌ సైబర్‌ ఆర్మ్‌ ‘పెగసస్‌ స్పైవేర్‌’ మన దేశంలో ఆందోళనకరమైన స్థాయిలో జాతీయ వార్త అయింది.
 
ప్రభుత్వంలో లేకపోయినా సమాంతరంగా ‘షాడో–గవర్నెన్స్‌’ నడిపితే తప్ప, తమ వాణిజ్య ప్రయోజనాలు కొనసాగని పరిస్థితి టీడీపీలో నెలకొంది. సరిగ్గా ఇక్కడే, మనం జనం కోసమా? లేక మనవాళ్ళ ‘బిజినెస్‌’ కోసమా? అనే చిట్టచివరి ప్రశ్నకు కూడా జవాబు చెప్పవలసిన అగత్యం ప్రతిపక్షానికి ఏర్పడింది. నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పడ్డ ప్రాంతీయ పార్టీ మనుగడ ‘క్రిటికల్‌ కేర్‌’ స్థితికి చేరిన పరిస్థితుల్లో, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమైన ‘లైన్‌’ తీసుకోవడానికి కూడా వెరవకపోవడం చూస్తున్నాం. అక్కడితో ఆగకుండా, ఒక ‘షాడో’ రూపంలో ఒక్కొక్కరిలో ‘స్పైవేర్‌’గా ప్రవేశిస్తూ, ప్రభుత్వాన్ని అలజడికి గురిచేయాలని ప్రయత్నించడం చూస్తున్నాం. ఇందుకోసం పనిచేసేవారిలో నర్సీపట్నం డాక్టర్‌ పేరు మనకు తెలిస్తే, రామతీర్థం గుడి విధ్వంసం క్రిమినల్‌ పేరు తెలియక పోవచ్చు. ఇటువంటి నిరంతర ‘షాడో ట్రాకింగ్‌’ ఒత్తిడిని తట్టుకుంటూ తన పని తాను చేసుకోవడం తర్వాతి ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పని అయింది. 

ముందుగా బాబు ‘హబ్‌ అండ్‌ స్పోక్స్‌’ పాలసీని ‘జీరో’ చేస్తూ– మూడు రాజధానులు, కొత్త జిల్లాలు, వార్డు వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు, అన్ని కులాల సంక్షేమానికి సంస్థలు, కొత్త అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలు ఏర్పాటు చేసి షాడో గవర్నెన్స్‌కు తన ‘ఫైర్‌వాల్‌’తో తొలి చెక్‌ పెట్టింది జగన్‌ ప్రభుత్వం. విభజన తర్వాత మొదటిసారి ముఖ్యమంత్రి రాష్ట్ర ‘మ్యాప్‌’ను ముందు పెట్టుకుని మరీ చేసిన కసరత్తుతో, ‘బొబ్బిలి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ’, ‘పలమనేరు– కుప్పం–మదనపల్లి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ’ ఏర్పాటును చూసినప్పుడు, ‘పాలిటీ’ తన సరిహద్దులకు చేరిన విషయం మనకు అర్థం అవుతుంది. ఐదేళ్ళ కోసం ఎన్నికైన ఏ ప్రభుత్వం అయినా తన కాలంలో ఇటువంటి విత్తనాలు నాటాలి. రాజ్యాంగ పరిధిలో మనకున్న అధికారాలతో మనం చేయవలసింది మాని, అవతలివాళ్లు చేస్తున్నది తెలుసుకోవడానికి ‘స్పైవేర్‌’ ఎందుకు? 

‘పెగసస్‌’ ఉదంతం వెలుగులోకి వచ్చాక, మాజీ జాతీయ భద్రతా సలహాదారు ఎంకే నారాయణన్‌.. మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు, ప్రభుత్వాలను కూడా ఇటువంటి ‘సైబర్‌ ఆయుధాలు’ అస్థిరపరుస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు, ప్రధానంగా రాజకీయాలకు దూరంగా ఉండే మధ్య తరగతి ఆలోచనాపరుల వివేచన ఎంతైనా అవసరమైన దశలో ఇప్పుడు మన రాష్ట్రం ఉంది. ఆర్థిక సంస్కరణల అమలు పూర్తిగా ‘టెర్మినల్‌’ దశకు చేరడంతో, వాటి తదుపరి దశను ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్నది. మున్ముందు ఇది దేశానికి దిక్సూచి కావొచ్చు. 


- జాన్‌సన్‌ చోరగుడి  

వ్యాసకర్త అభివృద్ధి, సామాజిక అంశాల వ్యాఖ్యాత

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top