Indian Students: విదేశీ విద్యార్జనకు చిక్కులు

Indian Students Foreign Study: Canada Beats US to Second Place - Sakshi

అమెరికన్‌ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే ఏకైక లక్ష్యం కలిగిన విద్యార్థుల్లో 47 శాతం మంది ఇండియా, చైనా నుంచి మాత్రమే ఉన్నారని తెలుస్తున్నది. 2019–20 విద్యాసంవత్సరంలో యుకె, ఆస్ట్రేలియాకు వెళ్ళిన ప్రపంచ యువతలో భారతదేశానికి 2వ స్థానం దక్కింది. ఇటీవలి కాలంలో కెనడా వెళ్ళాలనే భారత యువత సంఖ్య క్రమంగా పెరుగుతోంది.


భారతీయ యువతలోని శాస్త్రసాంకేతిక నైపుణ్యాలు, సులభంగా కలిసి పోగలతత్వం, నేర్చుకోవాలనే తృష్ణ, శ్రమించే గుణం, ఆంగ్లభాషలో పట్టు లాంటి ప్రత్యేకతల నడుమ మన విద్యార్థులు విదేశీ చదువుల్లో రాణిస్తున్నారు. కోవిడ్‌–19 కారణంతో 5.4 శాతం దేశ యువత విదేశీ చదువులను మానుకోవడం జరిగింది. కరోనా విజృంభణతో విధించిన లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలతో 2020లో విమానయాన ఆటంకాలు, వీసాల విడుదలలో ఇక్కట్లు, విదేశీయానానికి అధిక వ్యయం వంటి కారణాలతో 42 శాతం యువత తమ ప్రయాణ ప్రణాళికలను తాత్కాలికంగా పోస్ట్‌ఫోన్‌ చేసుకోవలసిన దుస్థితి వచ్చింది. 

2021లోని జనవరి, ఫిబ్రవరిలో 72,000 మంది వెళ్ళాల్సి ఉండగా, వారి విదేశీయానానికి 2వ వేవ్‌ బ్రేకులు వేసింది. కోవిడ్‌–19 వేవ్‌ల భయంతో వీసా దరఖాస్తులను పరిశీలించడానికి ఎంబసీలు, హై కమిషన్లు విరామం ప్రకటించారు. అనేక దేశాలు భారతీయ యువత ప్రవేశానికి నిషేధాలు, ఆంక్షలు కూడా విధించాయి. విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు కోవిడ్‌ టీకా పత్రం తప్పనిసరి చేయడం, కొన్ని కంపెనీల టీకాలను (కొవాక్సీన్, స్పుత్నిక్‌–వి లాంటివి) గుర్తించకపోవడం కూడా మన యువతకు అడ్డంగా నిలుస్తున్నాయి. 

కోవిడ్‌–19 వేవ్స్‌ పట్ల ఖచ్చితమైన అంచనాలు లేనందున విదేశాలకు వెళ్ళాలనే యువతకు దినదిన గండంగా తోస్తున్నది. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న అన్ని టీకాలను విశ్వ దేశాలు గుర్తించాలని, విమానయానం సులభతరం చేయాలని, టికెట్‌ ధర తగ్గించాలని, వీసా నియమనిబంధనలు సరళతరం చేయాలని విద్యార్థులు, తల్లితండ్రులు, పౌరసమాజం కోరుకొంటున్నది. త్వరలో కరోనా మబ్బులు తొలగిపోయి, సాధారణ పరిస్థితులు నెలకొనాలని, సరస్వతి కోవెలలు చదువుల ధ్వనులతో నిండుగా వెలిగి పోవాలని కోరుకుందాం. 

- డా: బుర్ర మధుసూదన్‌ రెడ్డి, కరీంనగర్‌

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top