వాళ్లను గుర్తించే సంస్కారం లేదా?

Funeral Workers Problems Over Coronavirus Deceased Bodies Guest Column By Mallepally Laxmaiah - Sakshi

కొత్త కోణం

ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌ లాంటి నగరాల్లో శ్మశానాలలో శవాలు బారులు తీరి ఉండడం, దహన సంస్కారాలకు చోటే దొరక్క పోవడం, కుప్పలుతెప్పలుగా వస్తోన్న శవాలను దహనం చేయడంలో కాటికాపరులు పడుతోన్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. శ్మశానాలకు వచ్చే పోయే వారివల్ల జబ్బులపాలై మరణిస్తోన్న వీరి ప్రాణాలను లెక్కలు కట్టే నాథుడే లేడు. వారి చావులకు ఏ సంస్కారాలూ ఉండవు, ఏ సంస్కారులకీ వారి చావులు పట్టవు. తమ జీవితాలను ఫణంగా పెట్టి దహన సంస్కారాలు చేస్తున్న వాళ్ళమని చెప్పుకోవడానికి గానీ, ఎదుటి వారు నమ్మడానికి గానీ వారికో గుర్తింపు కార్డు లేదు. శ్మశానాల్లో శవాలతో ప్రతిరోజూ చస్తూ బతికే వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాల్సిన అవసరాన్ని ఇప్పటికైనా గుర్తించాలి.

‘‘ఏది నా భార్య. ఏది నా కుమారుడు, నేను ఏకాకిని, కాదు... సర్వజనులూ ఏకాకులే... అన్నదమ్ములున్, ఆలు బిడ్డలున్, కన్నతల్లిదండ్రులున్, స్నేహితుల్, బంధువుల్‌ వెంటరారు తుదిన్‌..! వెంటవచ్చునది అదే సత్యం.. అదే యశస్సు’’ ఇవి సత్యహరిశ్చంద్ర పద్యనాటకంలో, హరిశ్చంద్రుడు శ్మశానంలో ఆలపించిన పద్యంలోని కొన్ని పంక్తులు. ప్రముఖ సాహితీ వేత్త బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రాసిన ఈ పద్యం ఈనాటి కోవిడ్‌ పరిస్థితులకు అద్దం పడుతోంది. మనిషి జీవితం క్షణభంగురమేననీ, ఎంతటి సంపన్నుడైనా తనువు చాలించిన తరువాత ఎవ్వరూ వెంట రారని, ఎంతగా ప్రేమించేవారైనా, గౌరవించేవారైనా చనిపోయిన వాళ్ళతో ఎవ్వరూ మరణించరు అని తేల్చి చెప్పేదే ఈ పద్యం.

కానీ, ఈ రోజులు మహా చెడ్డవి. బ్రతుకు మీద భ్రమలు సన్నగా చెరిగిపోతోన్న స్థితి. ఎప్పుడో ఒకప్పుడు వినిపించే చావు మాట ఇప్పుడు ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తూ, సమస్త జనావళిలో విషా దాన్ని నింపుతోంది. చనిపోయిన వారితో చనిపోనక్కర్లేదు, కానీ కనీసం మరణించిన వారి జ్ఞాపకాలను మననం చేసుకుంటూ శ్మశానం దాకా తోడెళ్ళేవారే కరువైన దుస్థితి. ఇంత దయనీయ స్థితిలోనూ మన శరీరం మట్టిలో కలిసిపోయేందుకు తోడ్పడే మనిషి మరొకరుంటారు. అతడే కాటికాపరి. ఇంతటి ఘోర విపత్తులోనూ ఏ బంధమూ, సంబం ధమూ లేకపోయినా, కాటిలో తోడు వస్తున్నది, కట్టెకాలే వరకూ కడ దాకా నిలుస్తున్నదీ కాటికాపరులు మాత్రమే. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో శ్మశానాలకు కుప్పలుతెప్పలుగా వచ్చి పడుతోన్న శవాలకు శాస్త్రోక్తంగా మంత్రతంత్రాల మధ్య దహన సంస్కారాలు కానిచ్చే పరి స్థితుల్లేవు. కానీ, కాటికాపరులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి వేన వేల శవాల దిబ్బలను అపురూపంగా పేరుస్తున్నారు. ఎంతో శ్రద్ధతో అనామకుల శవాలకు దహన సంస్కారాలు చేస్తున్నారు.

ఆయా మతానుసారంగా దహన సంస్కారాలు జరుపుతారు. ఒకరు పూడ్చిపెడితే, మరొకరు కాలుస్తారు. దళితులు సహా కొన్ని శూద్రకులాలు ఖననం చేస్తారు. దహనం కానీ, ఖననం కానీ చిన్న చిన్న పల్లెల్లో, గ్రామాల్లో నదులు, వాగులు, నీటి ప్రవాహాలున్న చోట్ల, నది ఒడ్డున జరుగుతుంటాయి. అక్కడ ప్రత్యేకించి శ్మశానాలు తక్కువ. ఒకవేళ ఉన్నా, ప్రత్యేకించి కాటికాపరులు ఉండరు. అయితే ఇలాంటి చోట్ల కూడా అంటరాని కులాలుగా ముద్రపడిన దళితులతోనే తరతరా లుగా ఆ పనిచేయిస్తుంటారు. దహనమైతే చెట్లు నరికి కట్టెలు బండ్ల కెత్తి, చితిపేర్చి, దహనకార్యక్రమాన్ని నిర్వహించే వరకూ వారే చేస్తారు. ఖననమైతే గోతిని తవ్వి పాతిపెట్టే కార్యక్రమం దళితులే చేస్తారు. అందుకు వారికిచ్చే డబ్బులు అతి స్వల్పం. 

నగరీకరణ తర్వాత జనాభా పెరుగుతూండడంతో నీటి వనరుల అవకాశాలు తక్కువగా ఉండడం వల్ల ప్రత్యేకించి శ్మశానాలు తప్పని సరి అయ్యాయి. దానితో కొంతమందికి అందులో పనిచేసే అవకాశం వచ్చింది. అందరూ అసహ్యించుకునే పనులు, ఎవ్వరూ సాహసించని పనులు, అందరూ నీచంగా చూసే పనులు చేయాల్సింది మళ్ళీ ఆ దళి తులే. అగ్రవర్ణాల అవసరం వీరికి పని కల్పించింది. అలా దేశ వ్యాప్తంగా ఈ పనిలో ఉంటున్నవాళ్ళు లక్షల్లో ఉన్నారు. ఇప్పటికీ ఉత్తరాదిలో డోమ్, ఛమార్, మహర్‌లు. దక్షిణాదిన అయితే మాల, మాదిగ, పరయ, పులియ, హోలియ కులాలు మాత్రమే అంతిమ సంస్కారాలను నిర్వహిస్తారు.

మరే కులంవారూ ఈ పనిలో ఇప్పటికీ లేరు. ఉండరు. ఎందుకంటే శవం మన దగ్గర విలువలేనిది. అది భయంగొలిపేది. రోగాలను వెంట తెచ్చేది. అదే భావన వల్ల కావచ్చు. ఇలాంటి భయంగొలిపే పనుల్లో సౌకర్యవంతమైన, సుఖవంతమైన ఇతర వర్గాలుండకపోవడం మన దేశంలోని కుల‘సంస్కారాల్లో’ ఒకటి. దళిత జాతిని నీచంగా చూసే కుసంస్కారమే తప్ప అది మరొ కటి కాదు. ఇదొక్కటే కాదు ప్రమాదకరమైన పనులు, వృత్తులు, అన్నీ మాల, మాదిగల్లాంటి కులాలే చేశాయి. ఇప్పటికీ చేస్తున్నాయి. 

కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో మరణిస్తోన్న వారి సంఖ్య చాలా ఎక్కువ. ప్రభుత్వాలు చూపెడుతోన్న లెక్కలు, కాకి లెక్కలన్నది జగమెరిగిన సత్యం. అయితే ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌ లాంటి నగరాల్లో శ్మశానాలలో శవాలు బారులు తీరి ఉండడం, దహన సంస్కారాలకు చోటే దొరక్కపోవడం. కుప్పలుతెప్పలుగా వస్తోన్న శవాలను దహనం చేయడంలో కాటికాపరులు పడుతోన్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు, వాస్తవ పరిస్థితులు మరింత దయనీయంగానే ఉంటాయన్నది తెలిసిన విషయమే.

ఈ పరిస్థితుల్లో శ్మశానాలకు వచ్చే పోయే వారివల్ల జబ్బులపాలై మరణిస్తోన్న వీరి ప్రాణాలను లెక్కలు కట్టే నాథుడే లేడు. వారి చావులకు ఏ సంస్కారాలూ ఉండవు, ఏ సంస్కారులకీ వారి చావులు పట్టవు. ఇటీవల హైదరాబాద్‌లోని మల్లె పల్లి ప్రాంతంలో దహన సంస్కారాల్లో ఉన్న కాటికాపరి యువకులు కాస్త విరామం దొరికితే తిండితినేందుకు వెళ్ళి వస్తుంటే, పోలీసులు అడ్డుకొని చేయిచేసుకోవడం గురించి వార్తలొచ్చాయి.

కర్ఫ్యూ ఉండటం వల్ల అట్లా చేశామని పోలీసులు చెప్పారు. కానీ వాళ్ళు తమ జీవితాలను ఫణంగా పెట్టి దహన సంస్కారాలు చేస్తున్న వాళ్ళని చెప్పుకోవడానికి గానీ, ఎదుటి వారు నమ్మడానికి గానీ వారికో గుర్తింపు కార్డు లేదు. అది ఇవ్వాలన్న ధ్యాస ఇన్నేళ్ళుగా పాలకులకు పట్టలేదు. శ్మశానాల్లో శవాలతో ప్రతిరోజూ ఛస్తూ బతికే వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాల్సిన అవసరాన్ని ఇప్పటికైనా ప్రభుత్వాలు గుర్తించాలి. కుటుంబ సభ్యులే పారిపోతోన్న నేటి సమయంలో ఎటు వంటి రక్షణ కవచాల్లేకుండా, మాస్క్‌లు, పీపీఈ కిట్ల మాటే లేకుండా, కనీసం సురక్షితమైన మంచి తాగునీటి సౌకర్యం కూడా లేకుండా శ్మశా నాల్లో శవాల్లా విలువలేని బతుకీడుస్తోన్న వారిని గురించి చర్చిం చాల్సిన సమయమిది. వారికో గుర్తింపునివ్వాల్సిన సందర్భమిది.

ఆరోగ్య భద్రతకు సంబంధించి ఎటువంటి భరోసా లేదు. వీళ్ళలో నూటికి 95 శాతం మంది ప్రభుత్వ వేతనాలు లేకుండా పని చేస్తున్నారు. సాధారణ సమయాల్లోనైతే, మృతుల కుటుంబాల నుంచో, లేదా అక్కడికి వచ్చిన వారినుంచో పదో పరకో రాలేది. కానీ ఇప్పుడు కోవిడ్‌ కారణంగా శవమెవరిదో, తెచ్చిందెవరో తెలియని స్థితిలో చనిపోయిన వారితో ఎటువంటి సంబంధం లేని మున్సిపా లిటీ కార్మికులు  వాళ్ల భౌతిక కాయాలను మోసుకొస్తోంటే ఇక వారికి డబ్బులిచ్చే నాథుడెవరు? అయినా అక్కడ శవాలు కాలుతూనే ఉంటాయి. బంధు మిత్రుల దుఃఖం తోడుగా రావాల్సిన భౌతిక కాయాలు దిక్కూమొక్కూ లేని శవాల మూటలై చుట్టుముడుతోంటే, వీరు మాత్రం, అది తమకు మాత్రమే దక్కిన భాగ్యంగా.. మరణిస్తోన్న సమస్త మానవాళికీ కాదనకుండా కడసారి సంస్కారాలు నిర్వహి స్తోన్న ఆ చేతులను మరువ తగునా అన్నదే నేటి ప్రశ్న. 

కానీ కోవిడ్‌ ఈ సమాజం గొప్ప సాంప్రదాయాలుగా భావి స్తున్నవాటన్నింటినీ తుడిచిపెట్టేసింది. వేదమంత్రాలతో అంతిమ సంస్కారాలు జరగకపోతే, ముక్తి లభించదని నమ్ముతున్న వేద బ్రాహ్మణులు ఈ రోజు శ్మశానాల వైపు కన్నెత్తి చూడడానికే భయపడు తున్నారు. పదులు, వందల సంఖ్యలో ఒకేసారి కాష్టాలు కాలుతోంటే వేదాల ఘోష అక్కడ ఎక్కడా వినిపించడం లేదు. ఢిల్లీలోని ఒక శ్మశాన వాటికలో కాటికాపరి కుటుంబానికి చెందిన ఒక దళిత యువకుడే వేద మంత్రాలు జపిస్తున్నట్లు వార్త వచ్చింది. సమాజంలో ఇటువంటి పాత్రను నిర్వహిస్తోన్న కాటికాపరుల జీవితాల్లో మార్పునకు ఇప్పటి వరకు ఎవ్వరూ దృష్టిసారించిన దాఖలాల్లేవు. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ఈ వృత్తిలో జీవిస్తున్నారు. కొందరి జీవితాలు ఇళ్ళులేక శ్మశా నాల్లోనే పొగచూరిపోతున్నాయి. జబ్బులపాలవుతోన్న వారు ఇంకెం దరో. ఇలాంటి ఎంతోమందికి కనీసం నిలువ నీడలేకపోవడం ప్రభు త్వాల నిర్లక్ష్యానికి ప్రత్యక్ష నిదర్శనంగా భావించక తప్పదు.

-మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్‌ : 81063 22077

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top