రెండూ సామాజిక విప్లవ సిద్ధాంతాలే!

Mallepally Laxmaiah Article on Occasion of Karl Marx Birthday - Sakshi

కొత్త కోణం

భారతదేశ సామాజిక నేపథ్యం నుంచి కారల్‌ మార్క్స్‌ సిద్ధాంతాన్ని అంబేడ్కర్‌ తులనాత్మకంగా పరిశీలించారు. బుద్ధుడినీ, మార్క్స్‌నూ ఒకేస్థాయిలో పోల్చారు. ప్రపంచ ఆవిర్భావంలో దేవుడి ప్రమేయాన్ని బౌద్ధం, మార్క్సిజం... రెండూ నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి. ఈ ప్రపంచంలో ఏవీ శాశ్వతం కాదనీ, ఇవి నిత్యం మారుతుంటాయనీ బుద్ధుడు, మార్క్స్‌ ఇరువురూ చెప్పారు. దాన్ని మార్క్స్‌ గతి తర్కం అంటే, బుద్ధుడు అనిత్త (అనిత్య) అని పేర్కొన్నారు. ఇక సమాజంలో ఉన్న దుఃఖానికి నివారణా మార్గం బౌద్ధం అన్వేషిస్తే, పేదరికం... దానికి కారణమైన దోపిడీ, దాన్ని నిర్మూలించే మార్గాన్ని మార్క్సిజం చూపెట్టింది. మార్క్స్‌తో అన్ని విషయాల్లో ఏకీభవిస్తూనే, కార్మిక వర్గ నియంతృత్వాన్ని మాత్రం తీవ్రంగా ఆక్షేపించారు అంబేడ్కర్‌.

‘ఆధునిక సోషలిజం, కమ్యూనిజంలకు కారల్‌ మార్క్స్‌ తండ్రి లాంటి వాడు. ఊహా జనిత సోషలిజాన్ని ఎండగట్టి ఆయన శాస్త్రీయ సోషలిజానికి పునా దులు వేశారు. పెట్టుబడిదారులతో పాటు, ఊహాజనిత సోషలిస్టులకు వ్యతిరేకంగా సిద్ధాంత పోరాటాలు చేశారు. ఈ రెండూ సమాజ ప్రమాదకారులేనని కారల్‌ మార్క్స్‌ తేల్చి చెప్పారు. అందుకే కారల్‌ మార్క్స్‌ సోషలిస్టు వ్యవస్థను శాస్త్రీయంగా నిర్వచించడంలో ఆద్యుడిగా నిలిచారు’’ అని బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ తన ‘బుద్ధ లేదా కారల్‌ మార్క్స్‌’ రచనలో పేర్కొన్నారు. 1956 నవంబర్‌ 20వ తేదీన నేపాల్‌ లోని ఖాట్మండులో జరిగిన అంతర్జాతీయ బౌద్ధ సమ్మేళనంలో పాల్గొని ఇదే విషయమై విశ్లేషణాత్మక ప్రసంగం చేశారు. అంటే అంబేడ్కర్‌ మహాపరినిర్వాణం పొందడానికి సరిగ్గా పదిహేను రోజుల ముందు ఈ సమావేశం జరిగింది. భారత దేశ చారిత్రక పరిస్థితులు, సామాజిక నేపథ్యం నుంచి ప్రపంచ శ్రామిక వర్గ మహానేత, కమ్యూనిస్టు వ్యవస్థ నిర్మాత కారల్‌ మార్క్స్‌ సిద్ధాంతాన్ని తులనాత్మకంగా అధ్యయనం చేసిన రచనగానీ, ప్రసంగం గానీ మరొకటి లేదని భావిస్తున్నాను.

‘కారల్‌ మార్క్స్, గౌతమ బుద్ధుని పోల్చి చూపడం చాలామందికి హాస్యాస్పదంగానే అనిపించవచ్చు. దీనికి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మార్క్స్‌కీ బుద్ధునికీ మధ్య 2,381 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. బుద్ధుడు జన్మించింది క్రీ.పూ.563 కాగా, మార్క్స్‌ పుట్టింది క్రీ.శ.1818 సంవత్సరం. బుద్ధుడినీ, మార్క్స్‌నూ ఒకే స్థాయిలో పోలు స్తుంటే, మార్క్సిస్టులకు అపహాస్యంగా అనిపిస్తుంటుంది. ఈ పోలిక చాలా తొందరపాటుగా భావిస్తుండవచ్చు. అయితే మార్క్సిస్టులు తమ అపోహలను పక్కన పెట్టి, కారల్‌మార్క్స్‌తో పాటు బుద్ధుని బోధనలనూ, బౌద్ధం ప్రాధాన్యతనూ అధ్యయనం చేస్తే వాళ్ళ ఆలో చనల్లో తప్పనిసరిగా మార్పు వస్తుంది’’ అంటూ బాబాసాహెబ్‌ తన రచనను మొదలు పెట్టారు. బౌద్ధాన్నీ, మార్క్సిజాన్నీ విడివిడిగా వివరించి, మళ్ళీ పోలికలను, వ్యత్యాసాలను విడదీసి చూపెట్టారు.  వీటిని మూడు భాగాలుగా చూడవచ్చు. మొదటిది, తాత్విక విష యాలు, రెండవది, ఆర్థిక–సామాజిక అంశాలు. మూడవది, రాజ కీయ వ్యవస్థల నిర్మాణం.

మొదటి అంశమైన తాత్వికతను చూస్తే, కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. అందులో ఈ ప్రపంచ ఆవిర్భావం గురించి చెబుతూ, అందులో దేవుడి ప్రమేయాన్ని ఈ రెండు సిద్ధాంతాలూ నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి. మార్క్స్‌ మానవ పరిణామ క్రమాన్ని డార్విన్, ఇతర శాస్త్రీయ పరిశోధనల ద్వారా ఉదహరిస్తే, అంతకన్నా 2,300 ఏళ్ళ క్రితమే, ఈ విశ్వం తనంతట తానే ఉద్భవించిందనీ, ఇందులో ఎటు వంటి అతీంద్రియ శక్తుల ప్రమేయం లేదనీ తన ‘అగ్గన్న సుత్త’ ప్రసంగంలో గౌతమ బుద్ధుడు పేర్కొన్నారు. ఈ ప్రపంచం ఆవిర్భ వించడం గురించి తెలిపిన విషయం డార్విన్‌ సిద్ధాంతానికి పునాదిగా కనిపిస్తుంది. ఇక రెండో సామ్యం, ఈ ప్రపంచంలోని వస్తువులు ఏవీ కూడా శాశ్వతం కాదు అనేది. ఇవి నిత్యం మారుతుంటాయి. దీనిని మార్క్స్‌ గతి తర్కం అంటే, గౌతమ బుద్ధుడు అనిత్త(అనిత్య) అని పేర్కొన్నారు. అంటే అశాశ్వతం అని అర్థం. వస్తువుకు పుట్టుక, నాశనం ఉండదనీ, అది పాత రూపం మార్చుకొని, కొత్తదానిలోకి మారుతుందనీ మార్క్స్‌ భావం అభావం చెందడంగా భావిస్తే... బుద్ధుడు దానిని పునబ్బవ అని పేర్కొన్నారు. అదేవిధంగా ఇద్దరూ ప్రతి సంఘటనకు కార్యకారణ సంబంధముంటుందని తేల్చారు. బౌద్ధంలో దానిని ‘ప్రతీత్య సముత్పాద’ అంటారు. ఒక సంఘటన జరగడం ఏదో యాదృచ్ఛికం కాదనీ, దానికి కారణాలు ఉంటాయనీ భావం. అంటే సమాజాన్ని గతి తార్కిక దృష్టితో చూడటం అనేది రెండు సిద్ధాంతాలలోనూ ఉంది.
సమాజంలోని కష్టాలకూ, సమస్యలకూ రెండు తాత్విక మార్గాలూ పరిష్కారాన్ని కనిపెట్టాయి. సమాజంలో ఉన్న దుఃఖానికి నివారణా మార్గం బౌద్ధం అన్వేషిస్తే, పేదరికం... దానికి కారణమైన దోపిడీ, దాన్ని నిర్మూలించే మార్గాన్ని మార్క్సిజం చూపెట్టింది. ఈ రెండింటిలోనూ సొంత ఆస్తి అనేది ప్రధాన కారణంగా పనిచేసింది. అందుకే బౌద్ధ భిక్కులు ఎవ్వరూ కూడా ఆస్తులనే కాదు, అనవసర వస్తువులను కూడా కలిగి ఉండకూడదనే నిబంధనలు పెట్టారు. సొంత ఆస్తి వ్యవస్థ దోపిడీకీ, పేదరికానికీ కారణమనీ... అందువల్ల సొంత ఆస్తిని నిర్మూలించే కమ్యూన్‌లను ఏర్పాటు చేయాలనీ మార్క్స్‌ భావించారు. దానినే గౌతమ బుద్ధుడు బౌద్ధ సంఘాల ద్వారా ఒక నూతన వ్యవస్థను నిర్మించాలని ప్రతిపాదించారు. కమ్యూనిస్టు దేశాల్లో కమ్యూన్‌లు, సహకార వ్యవస్థలు ప్రజల సామాజిక అభి వృద్ధికి నేతృత్వం వహించాయి. ఆర్థిక, సామాజిక, నైతిక మద్దతును రైతులకూ, కార్మికులకూ అందించాయి. బౌద్ధ సంఘాలు, బౌద్ధారా మాలు కూడా ఆర్థిక సహాకార సంస్థలను నడిపాయి. దానికి సంబం ధించిన ఆధారాలు మనకు బౌద్ధ సాహిత్యంలో దర్శనమిస్తాయి.

అయితే సమాజ మార్పునకు వర్గపోరాటాలే మార్గమని మార్క్సిజం భావిస్తే, బౌద్ధం మాత్రం అనివార్యమైతే తప్ప యుద్ధాలు వద్దని తేల్చిచెప్పింది. చాలా మంది బౌద్ధం అనగానే అహింసను ప్రబోధించే మానవ సిద్ధాంతంగా భావిస్తారు. కానీ బౌద్ధం న్యాయం కోసం, ప్రజల రక్షణ కోసం యుద్ధం చేయాల్సి వస్తే వెనుకాడకూడదని తేల్చి చెప్పింది. ఒకదేశ సేనాధిపతి సింహసేనాపతితో బుద్ధుడు జరిపిన సంభాషణలో ఈ విషయం తేల్చి చెప్పారు. ఇది అంగుత్తర నికాయలోని ‘సింహసేనాపతి సుత్తలో ఉంది. మార్క్సిజం లాగానే బౌద్ధం ఆనాటి వైరుధ్యాన్ని కనిపెట్టి మహా విప్లవాన్ని నడిపింది. యజ్ఞయాగాలలో సమాజాన్ని నిట్టనిలువునా దోపిడీ చేస్తూ, ఆనాటి సామాజిక ప్రగతికి అడ్డుగోడలుగా నిలిచిన పురోహిత, వైదిక వ్యవస్థను ఎదుర్కొని సామాజిక విప్లవాన్ని సాధించింది. అందుకే బౌద్ధం భారత దేశ తొలి సామాజిక విప్లవం. అదే విధంగా మార్క్సిజం ఆధునిక ప్రపంచ విప్లవ సిద్ధాంతం.

అయితే అంబేడ్కర్‌ మార్క్సిజంతో తీవ్రంగా విభేదించిన అంశం ‘కార్మిక వర్గ నియంతృత్వ’ వ్యవస్థ. దీన్ని ప్రాథమికంగా మార్క్స్‌ నిర్వచిస్తే, దానిని రష్యా విప్లవనేత లెనిన్‌ ఆచరణలో చూపెట్టారు. మార్క్స్‌ని అన్ని విషయాల్లో ఏకీభవిస్తూనే, కార్మిక వర్గ నియంతృ త్వాన్ని  మాత్రం చాలా తీవ్రంగా ఆక్షేపించారు అంబేడ్కర్‌. బౌద్ధం లోనే తన అభిప్రాయానికి పునాది ఉందని అంబేడ్కర్‌ పేర్కొన్నారు. గౌతమ బుద్ధుడు ఆనాటి మహాజనపదాల ప్రజాస్వామ్య విలువలను విశ్వసించాడనీ, వాటిని తన విధానంగా ప్రతిపాదించాడనీ అంబేడ్కర్‌ స్పష్టం చేశారు. ఆనాటి కన్నా ఈనాడు సమాజం ఎంతో ముందుకు పోయిందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి నియంతృత్వమైనా సరియైనది కాదనీ, అది ప్రజలను స్వేచ్ఛకు దూరం చేస్తుందనీ అంబే డ్కర్‌ భావించారు. మార్క్స్‌ సిద్ధాంతం ద్వారా ఆర్థిక సమానత్వం వస్తుందనీ, కానీ భారతదేశంలో అంతరాలకి ముఖ్యమైన కులవ్యవస్థ సృష్టించిన కుల వ్యత్యాసాలు సోదరత్వాన్ని అడ్డుకుంటున్నాయనీ అంబేడ్కర్‌ అభిప్రాయపడ్డారు. ఆ విధంగా ఆ ఒక్క విషయం మినహా భారతదేశ విప్లవ సిద్ధాంతమైన బౌద్ధానికీ, మార్క్సిజానికీ చాలా సామ్యాలున్నాయని అంబేడ్కర్‌ స్పష్టం చేశారు. భారతదేశ ప్రజలు సామాజిక, రాజకీయ ఆర్థిక సమానతల కోసం జరుపుతున్న పోరా టంలో బౌద్ధం, మార్క్సిజం సిద్ధాంతాల అవసరముందనే విషయాన్ని మనం గమనించాలి. మార్క్సిజం ప్రకారమే, ప్రతి దేశంలో ఉన్న చారిత్రక, సామాజిక పరిస్థితుల దృష్ట్యా వాటికి అనుగుణంగానే చారి త్రక భౌతిక వాదాన్ని రూపొందించుకోవాలని ప్రముఖ మార్క్సిస్టు తత్వవేత్త మార్తా హర్నేకర్‌ అన్న మాటలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. 

వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య
సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్‌ : 81063 22077
(నేడు కారల్‌ మార్క్స్‌ జయంతి) 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top