‘వై నాట్‌ 175?’ నినాదం స్ఫూర్తితో...

Finally the election bell rang in AP - Sakshi

ఎట్టకేలకు ఎన్నికల నగార మోగింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 4 ‘సిద్ధం’ సభల ద్వారా తమ సత్తా ఏంటో చాటుకుంది. అభ్య ర్థులను అన్ని పార్టీల కన్నా ముందే ప్రకటించి ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. మొత్తం 175 అసెంబ్లీ నియోజక వర్గాలు, 25 ఎంపీ స్థానాలకు సామాజిక న్యాయాన్ననుసరించి అభ్యర్థులను నిర్ణయించారు వైఎస్సార్‌సీపీ వారు. బీసీలకు అసెంబ్లీ, పార్లమెంటుకు కలిపి మొత్తం 59 టికెట్లు ఇచ్చారు. ఆశ్చర్యమేమిటంటే వీరిలో చాలామంది అతిపేదలు. ఇది రాజకీయానికి ఒక కొత్త నిర్వచనంగా చెప్పవచ్చు. మరోపక్క అప్పటికప్పుడు సూట్‌కేసులతో విమానాలు దిగిన పెద్దలకు మాత్రమే చంద్రబాబు సీట్లు కేటాయిస్తున్నారు. అందులోనూ స్వజాతి పక్షులే ఎక్కువ. సీనియర్లు దిక్కుతోచక దిక్కులు చూస్తున్నారు.

ఇదిలావుంటే ‘గండస్యోపరిపిటకవత్‌’ అనే సామెత (గోడదెబ్బ – చెంపదెబ్బ)గా ఇష్టంలేని పొత్తుల వల్ల టీడీపీ – జనసేన కార్యకర్తలు బాహాబాహీ యుద్ధానికి దిగుతున్నారు. ఇక అసలు నాయకుడు ఎన్డీయే పొత్తుకోసం నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూసి, చూసి రాయబారాలు పంపీ, పంపీ ఎట్టకేలకు వదినగారి దయతో చేరి పోయారు. తన జన్మధన్య మైందనుకుంటూ రాష్ట్రానికి తిరిగి వచ్చి సీట్ల పంపిణీ ప్రారంభిస్తే... అది పూర్తిగా బెడిసికొట్టి సిగపట్ల వ్యవ హారం సీరియస్‌గా సాగుతున్నది. పోనీ సభల ద్వారా వాటిని కవర్‌ చేసుకుందామంటే వెయ్యి రూపాయలు, క్వార్టర్‌ బాటిల్, బిర్యానీ ఇచ్చినా తినేసి పోతున్నారు కానీ సభదాకా రావడంలేదు.

‘రామేశ్వరం పోయినా శనేశ్వరం పోదనట్లు’ మోసాలు, అడ్డ దారులు తప్ప నిఖార్సయిన రాజకీయం తెలియని ఈ అబద్ధాల కోరును భరించలేమని జనాలు 2019లోనే అధికారం నుండి  తోసేస్తే, అదేమీ గుర్తించకుండా తనకుతానే గొప్పనాయకుడిని అనుకుంటూ మతిలేని ఉపన్యాసాలు ఇస్తున్న ఇతనికి తోడు దత్తపుత్రుడొకరు. రాసిచ్చిన డైలాగులు ఆవేశంలో వూగిపోతూ చదవటం తప్ప సొంత ఆలోచన లేదు పవన్‌ కల్యాణ్‌కు. ఇక అసలు పుత్రుడిని చూద్దామంటే అతని పేరెత్తితేనే పార్టీ పారిపోతున్నది. ఇప్పుడు చంద్రబాబు కూడా అదేదారిలో ఉన్నాడు. అతడికి సర్టిఫికెట్స్‌ తప్ప ఏ భాషా రాదు. కొత్తగా వచ్చిన మరో తోడు వదినగారు. ప్రస్తుతం తన ఒక్కసీటు గెలిస్తే చాలు వచ్చే ఎన్డీయే ప్రభుత్వంలో ఎలాగయినా మంత్రిపదవి దక్కించుకోవాలని సొంత పార్టీనే తాకట్టు పెడుతున్నారు.

ఈ నలుగురు ఇలా నడుస్తుంటే... వీళ్ళకేడరు మాత్రం నియోజక వర్గాల్లో తన్నుకోవడంలో యమ బిజీగా ఉన్నారు. సిద్ధాంత బలం లేక రాష్ట్ర ప్రయోజనాల గురించి ఒక్కమాట మాట్లాడలేక పోతున్నారు. కానీ జగన్‌ను తిట్టడానికి మాత్రం ఒకేదారిలో నడుస్తున్నారు. వాళ్ళకున్న సిద్ధాంతమల్లా జగన్‌ ఓడిపోవాలి. ఎందుకంటే సమా ధానం లేదు. వీళ్ళ ఎజెండాలో కులగర్జనలు, మతాల పూత్కా రాలు, ముఖ్యమంత్రి మీద విష ప్రచారాలు నిరంతరం వినిపిస్తూనే ఉన్నాయి. అదుపు తప్పిన కట్టుబాట్లతో, అబద్ధపు రాతలే తమ ధ్యేయ మన్నట్లు కులఅహంకారంతో పిచ్చిరాతలు రాస్తున్నాయి పచ్చ పత్రికలు. ఒక అవినీతిపరుడి కొమ్ముకాస్తూ అవి ఏనాడో విలువల్ని పోగొట్టు కున్నాయి. మరోవైపు మరో దత్తపుత్రిక వచ్చి చేరింది.

కుటుంబ వ్యవస్థను నాశనం చేసే విద్యలో ఎన్నో డిగ్రీలు పొందిన చంద్రబాబు మరో కుటుంబ వినాశనానికి పూనుకున్నాడు. ఎన్టీఆర్‌ కుటుంబాన్ని చీల్చి ఇంటి పెద్దను నాశనం చేసిన ఇతడు, పచ్చగా, సమష్టిగా కష్టాలను సమైక్యంగా ఎదుర్కొని, ఎన్నో ఇబ్బందులను అధిగమించి అధికారాన్ని సాధించుకున్న వైఎస్సార్‌ కుటుంబం మీద తన వక్రదృష్టి సారించాడు. ఫలితంగా అదికూడా చీలిపోయింది.

ఈ దురాశాపరులు అభివృద్ధిలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్‌ భవిష్య త్తును నాశనం చెయ్యటానికి కంకణం కట్టుకున్నారు. సామాజిక సహ జీవనంతో సౌభ్రాతృత్వంగా వర్ధిల్లుతున్న ఆంధ్రుల ప్రశాంతతను చెరపటానికి ఈ కూటమి ప్రయత్నిస్తున్నది. కానీ ఆంధ్రులు అమా యకులు కాదు. స్వాతంత్య్ర పోరాటం నుండి ఇప్పటి వరకు ఎన్నో రాజకీయాలను, ఎందరో నాయకులను చూసిన అనుభవం వారిది. అందుకే ఈ దుష్టగ్రహ కూటమి సభలకు వెళ్ళకుండా తమ నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. వారి ఏ సభ చూసినా, ఖాళీ కుర్చీలే. వీరి పతనం చివరిదశకు చేరిందనటానికి ఇవన్నీ సంకేతాలే.

రాజనీతిజ్ఞుడు, అనుభవజ్ఞుడు అయిన మోదీ ఈ పొత్తుకు సుముఖంగా లేరనే విషయం వారి ప్రవర్తన, ప్రసంగధోరణి చెప్పకనే చెప్పాయి. జగన్‌ గురించి ఏమీ విమర్శించక పోవటం, వైరి గుండెల్లో గునపాలు గుచ్చినట్లే వుంది. పక్క రాష్ట్రాలయిన తెలంగాణ, కర్ణాటక, చెన్నై సభల్లో అక్కడి ముఖ్యమంత్రులను ఏకిపారేశారు మోదీ. ఆ ప్రసంగాలతో పోల్చి చూస్తే ఏపీ ముఖ్యమంత్రిని, ఆయన పాలనను ప్రధాని మెచ్చినట్లే కనిపించింది. ఇంకో విషయం కొంచెం లోతుగా ఆలోచిస్తే అర్థమవుతుంది. అది జగన్‌ పట్ల వారికున్న అభిమానం. ప్రధానమంత్రి కంటే ఐదు నిమిషాల ముందు ప్రసంగించిన చంద్ర బాబు జగన్‌ను విమర్శిస్తూ ‘తల్లిని, చెల్లిని చూసుకోలేనివాడు ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళ కెలా మేలుచేస్తాడు...’ అంటూ తన లేకితనాన్ని ప్రదర్శించుకున్నాడు.

కానీ మోదీ ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్లుగా ‘అన్నా, చెల్లి ఒకటే. ఇది కాంగ్రెస్‌–వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎత్తుగడ’ అంటూ చంద్రబాబు గొప్పగా ప్రయోగించాలనుకున్న షర్మిల అస్త్రాన్ని  ఉపసంహరించారు. ప్రైమ్‌ మినిస్టర్‌ ముందు జగన్‌ను పెద్ద విలన్‌గా చూపించాలనుకున్న వీళ్ళ ఎత్తుగడను ఆయన చిత్తుచేసి ప్రజల్ని ఒక అయోమయంలో ఉంచి వెళ్ళిపోయారు. ‘ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు’ ఈ సభ ద్వారా తన బలాన్ని నిరూపించుకోవాలనుకున్న చంద్రబాబుకు, పవన్‌ కల్యాణ్‌లకు అవమానాలే మిగిలాయి. లక్షల్లో వస్తారన్న జనం రాలేదు. వచ్చిన ప్రధానమంత్రి వీరి పేరయినా ఎత్తలేదు. మరో పక్క పొత్తుకు గండికొడుతున్నాడని బీజేపీ సీనియర్లు అధిష్టానానికి లేఖ రాశారు. ఆ పొత్తు చివరిదాకా వుంటుందో లేదో తెలియదు. జనసైన్యం అసలు సహకరించటం లేదు. ఇక ఓట్లు షేర్‌ చేసుకునే దెప్పుడు?

‘కత్తితో చంపేవాడు ఆ కత్తితోనే చస్తాడు’ అన్నట్లు అవగాహన, రాజకీయ సంస్కారం లేని ముఠాలను తయారుచేసుకున్న దత్తపుత్రుడి సైన్యం తమ నాయకుల మీదే తిరుగుబాటు చేస్తోంది. ఎటుచూసినా పంచకూళ్ళ కూటమికి గందరగోళంలా తయారయ్యింది పరిస్థితి. కలసినా ఒకళ్ళనొకళ్ళు ఓడించుకుంటారు. మరోవైపు జగన్‌ ఒక్కడే తన సైన్యంతో ముందుకు దూసుకు పోతున్నాడు. అతని ఆయుధం ప్రజాబలం. అతని నినాదం పేదల సంక్షేమం. అతని సైన్యం ఐకమత్యంతో నాయకుడిని అనుసరించే పార్టీ. ఇప్పుడు చెప్పండి – ముఖ్యమంత్రి జగన్‌ అన్నట్లుగా ‘వైనాట్‌– 175?’ సాధించి చూపెడదాం – ఆదర్శ రాజ్యాన్ని నిలబెడదాం.

- వ్యాసకర్త ఆంధ్రపదేశ్‌ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌
- డాక్టర్‌ నందమూరి లక్ష్మీపార్వతి

Election 2024

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top