ఆదివాసుల హృదయ దీపాలు

Christoph Haimendorf, Betty Barnardo Death Anniversary - Sakshi

సందర్భం

తూర్పు గోదావరి జిల్లా కొండ అడవుల్లో డాక్టర్‌ ఊర్మిల పింగ్లె తీసిన ఇక్కడ కనిపిస్తున్న ఫొటో... హైమండార్ఫ్‌ దంపతులు కలిసి ఉన్న దాదాపు తుది చిత్రం. పదవీ ఉద్యోగాలు లేకపోయినా మానవ శాస్త్రవేత్తగా తనతో యాభై ఏళ్లుగా వెన్నెముకలా ఉండి అలుపెరగకుండా కలిసి పని చేసిన బెట్టీ సాహచర్యం గురించి లోతుగా తలపోస్తున్నట్టు క్రిస్టోఫ్‌ హైమండార్ఫ్‌ కనిపిస్తున్నారు ఈ చిత్రంలో.  ఆ తర్వాత కొద్ది రోజులకే హైదరాబాద్‌లో 11 జనవరి 1987 నాడు బెట్టీ అని అందరూ అభిమానంగా పిలిచిన ఎలిజబెత్‌ హైమండార్ఫ్‌ గుండెపోటుతో హఠాత్తుగా ప్రాణాలు విడిచారు. ఆమె మరణం క్రిస్టోఫ్‌ హైమండార్ఫ్‌ను బాగా కుంగదీసింది. ఆ తర్వాత ఎనిమిదేళ్లకే ఆయన కూడా తనువు చాలించారు. 

భారత్‌ ఈశాన్య ప్రాంతంలోని కొన్యక్‌ నాగాలు, ఆపతానీలు, హైదరాబాద్‌ నిజాం సంస్థానంలోని చెంచులు, కొండ రెడ్లు, రాజ గోండులు, ఇంకా నేపాల్‌ షేర్పాలు, మధ్య ప్రదేశ్‌ భిల్లులు.. ఈ జాతుల గురించి క్రిస్టోఫ్‌ వాన్‌ ఫ్యూరర్‌ హైమండార్ఫ్‌ చేసిన పరిశోధనలు ఇప్పటికీ ప్రామాణికంగా నిలుస్తున్నాయి. అయితే వీటన్నింటిలో ఆదిలాబాద్‌ రాజ్‌ గోండులతో ఆయన 1940ల్లో ఏర్పరచుకొని, జీవన పర్యంతం కొనసాగించిన బాంధవ్యానికి సాటి రాగలిగి నది ఏదీ లేదు. మార్లవాయి గ్రామంలో రాజ్‌ గోండుల మధ్య వారిలో ఒకరిగా ఒక గుడిసెలో జీవిస్తూ వారి సంప్రదాయాలు, పురాణాలను, వారి గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సాధికారికంగా నమోదు చేస్తూ, ఆదివాసీ జీవన దృక్పథ సార్వజనీనమైన విలువను గుర్తుండి పోయేలా ఆవిష్కరించగలిగారు. 

హైదరాబాద్‌ సంస్థానంలోని ఆదివాసీలను దాదాపు మూడు సంవత్సరాల పాటు అధ్యయనం చేసిన తరువాత 1945లో, ఆయన విశ్లేషణల నాణ్యతను చూసిన నిజాం ప్రభుత్వం ఆయనను గిరిజన తెగలు, వెనుకబడిన తరగతుల సలహాదారుగా నియమించింది. సంస్థానంలోని ఆదివాసీల అభ్యున్నతికి కీలకమైన నూతన ప్రణాళికల రూపకల్పన, వాటి అమలు బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఆ పదవిలో ఉంటూ కుమ్రం  భీం తిరుగుబాటు, వీర మరణం తరువాత పూర్తిగా ధైర్యాన్ని కోల్పోయి, తీవ్రమైన నిరాదరణకు గురవుతున్న ఆదిలాబాద్‌ జిల్లా గోండుల కోసం తొలి పాఠశాలలు ఏర్పరిచి, భూములు లేని వేలాది ఆదివాసీ కుటుంబాలకు దాదాపు 160 వేల ఎకరాల భూమిని పట్టాలతో సహా అందించి వారి సమగ్ర పునరుజ్జీవనానికి గొప్ప పునాది వేయగలిగారు హైమండార్ఫ్‌. 1950లో లండన్‌కు వెళ్లి పోయిన తర్వాత కూడా తరచుగా ఆదిలాబాద్‌ను సందర్శిస్తూ గోండుల బాగోగుల గురించి తెలుసుకుంటూ ఉండేవారు హైమండార్ఫ్‌ దంపతులు. 1960ల తరువాత బయటి నుండి వచ్చిన చొరబాటుదారుల దురాక్రమణకు ఆదివాసీల భూములు గురికావడం, వారి పరిస్థితి మళ్లీ హీనం కావడం హైమండార్ఫ్‌ దంపతులను ఎంతో బాధించేది.

తమను ఎంతో ఆదరించి, అభిమానించిన గోండుల సన్నిధిలో మార్లవాయి లోనే తమ సమాధులు ఉండాలని హైమండార్ఫ్‌ దంపతులు కోరుకున్నారు. బెట్టి మరణం తర్వాత, ఆమె అస్థికలను మార్లవాయికి తీసుకు వచ్చి, ప్రేమాభిమానాలతో తరలివచ్చిన వేలాది ఆదివాసీల సమక్షంలో మార్లవాయి గ్రామం పక్కనే ఖననం చేశారు. క్రిస్టోఫ్‌ అవశేషాలను కూడా ఆయన మరణించిన చాలా ఏళ్ళ తర్వాత బెట్టి సమాధి పక్కనే పూడ్చి మరో సమాధి నిర్మింపజేశారు. 

బెట్టి వర్ధంతినే హైమండార్ఫ్‌ దంపతుల ఉమ్మడి సంస్మరణ దినంగా ప్రతి ఏడాది మార్లవాయి గ్రామంలో 11 జనవరి నాడు నిర్వహిస్తూ వస్తున్నారు. గత కొన్నే ళ్లుగా ఇది పెద్ద కార్యక్రమంగా వికసిస్తూ వస్తున్నది. మార్లవాయి గ్రామ గుసాడి నృత్య కళాకారుడు కనక రాజుకు పద్మశ్రీ గౌరవం దక్కడం దీనికి తోడయ్యింది. తమ జాతి సంస్కృతిని అధ్యయనం చేసి, తమ అభ్యున్నతి కోసం పరితపించిన మానవ శాస్త్రవేత్త దంపతులకు ఆ జాతి నుంచి లభించిన ఇటువంటి ఆరాధనకు సాటిరాగల ఉదాహరణ మరెక్కడా లేదేమో!

1980వ దశకం నుండి  చివరిదాకా హైమండార్ఫ్‌ దంపతులను బాగా ఎరిగిన, క్రిస్టోఫ్‌తో కలిసి రెండు పరిశోధన గ్రంథాలను కూడా రాసిన ఊర్మిళ పింగ్లె,  బెట్టి వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఇలా అన్నారు: ‘తనను కలిసిన వారందరి పట్లా గొప్ప అనురాగం చూపుతూ... గొప్ప చమత్కారం, హాస్య దృష్టిలతో జీవ చైతన్యం ఉట్టిపడుతూ ఉండేది అమె. ఆదివాసీ సమాజాల పరిస్థితి పట్ల ఎనలేని సానుభూతితో వారి అభ్యున్నతి కోసం అంతటా వాదిస్తూ ఉండేది. తన భర్తకు నిజమైన ఆత్మబంధువుగా నిలిచిన వ్యక్తి!’ (క్లిక్ చేయండి: అజ్ఞానం కంటే అహంకారం ప్రమాదం)

- సుమనస్పతి రెడ్డి 
ఆకాశవాణి విశ్రాంత అధికారి

(జనవరి 11 హైమండార్ఫ్‌ దంపతుల సంస్మరణ దినం)

మరిన్ని వార్తలు :

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top