ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 27 లక్షల 40 వేలమంది గిరిజనులు ఉండవచ్చని అంచనా. ఏజెన్సీ ప్రాంత గిరిజనులు, మైదాన ప్రాంత గిరిజనులు అని ఏపీలో గిరిజనులను రెండు రకాలుగా పిలుస్తున్నారు. మైదాన ప్రాంత గిరిజనులు ఎక్కువగా పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో నివాసం ఉంటారు. మైదాన ప్రాంత గిరిజనులకు ఒక్క ఎస్టీ రిజర్వుడు శాసనసభా స్థానాన్ని కానీ, ఒక్క ఎస్టీ రిజర్వుడు పార్లమెంటు నియోజకవర్గాన్ని కానీ ప్రభుత్వాలు కేటాయించలేదు.
మైదాన ప్రాంత గిరిజనులలో అత్యధిక జనాభా కల్గినవారు యానాదులు. వీరు ఏపీ రాష్ట్రంలో 10 లక్షల వరకు ఉన్నారని ప్రభుత్వ అంచనా. అయితే స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు ఏ రంగంలోనూ యానాదులు అభివృద్ధి చెందలేదు. చదువు లేదు, వైద్యం లేదు. మూఢనమ్మకాలతో బతుకుతున్నారు. కారణం ప్రభుత్వాలు వీరిపై దృష్టి సారించకపోవడమే.
ఈ గిరిజనులు ఆర్థికంగాను, సామాజికంగాను, రాజకీయంగాను ఇంకా వెనుకబడే ఉన్నారు. వీరిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. వీరికి ప్రభుత్వాల నుండి ఏ విధమైన తోడ్పాటు ఉండకపోవడం పరిపాటి అయ్యింది. ఎస్టీ రిజర్వుడు శాసనసభా స్థానాలు కాదు కదా కనీసం నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా యానాదులకు అన్యాయం జరుగుతోంది.
అయితే గత వై.ఎస్. జగ¯Œ మోహ¯Œ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన కృషి మాత్రం ఇందుకు మినహాయింపు అని చెప్పాలి. నెల్లూరు పట్టణాన్ని ఎస్టీ రిజర్వుడ్‌గా ప్రకటించి యానాదులకు మేయరు పదవిని కేటాయించి పొట్లూరి స్రవంతికి ఆ పదవిని దక్కేలా చేశారు. అత్మకూరు మున్సిపాలిటీని ఎస్టీకి కేటాయించడంతో వెంకట రమణమ్మ చైర్‌పర్స¯Œ గా ఎన్నికయ్యారు. యానాదులకు రాజకీయాలలోనే కాదు విద్య పరంగా కూడా ఆ ప్రభుత్వ కాలంలో ఎంతో మేలు జరిగింది.
‘అమ్మఒడి’ పథకం తెచ్చి... చదువు మాని చేపలు పట్టుకుంటున్న యానాది బిడ్డలు చదువు అభ్యసించే విధంగా చేసింది జగన్ ప్రభుత్వం. నేడు మారుతున్న కాలానికి అనుగుణంగా మారి అభివృద్ధి చెందడానికి వీలుగా కొందరు యానాదులే కొంతకాలంగా పోరాటాలు చేస్తున్నారు. వారికి తగిన అండ కావలసి ఉంది. యానా దులకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా జనాభా ప్రాతిపదికన రావాల్సిన రాయితీలు, హక్కులు ఇవ్వాలి. ప్రభుత్వాలు ఈ విషయంలో సానుభూతితో వ్యవహరించాలి. అప్పుడే మిగతా జన సమూహాల సరసన చేరి గౌరవ ప్రదంగా జీవించగలుగుతారు.
– మేకల ఏడుకొండలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యానాది (గిరిజన) సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉత్తర్వు చట్టం కాదు


