Ultra Wide Selfie: సెల్ఫీలు తీసుకోవడం ఇష్టమా? మరి 0.5 సెల్ఫీల గురించి తెలుసా?

Youth Pulse: You Know Interesting Facts About Ultra Wide Selfie - Sakshi

అహో... అల్ట్రావైడ్‌ సెల్ఫీ!

సెల్‌ ప్రపంచంలో దర్జాగా చైర్‌ వేసుకొని కూర్చున్న యువతరానికి– సెల్ఫీ కొత్త కాదు! మరి సెల్ఫీలో కొత్త ఏమిటి? జీరో పాయింట్‌ ఫైవ్‌.. సెల్ఫీ ముచ్చట్ల గురించి మాట్లాడుకోవాలంటే ఒకటా రెండా... మేకప్‌ ఫ్రీ సెల్ఫీ అని ఒక ట్రెండ్‌ బయలుదేరింది. అంటే ఎలాంటి మేకప్‌ లేకుండా సెల్ఫీ తీసుకోవడం. ‘మేకప్‌ లేని నా ఫేస్‌ ఎంత అందంగా ఉందో’ అని కామెంట్‌ కూడా పెడుతుంటారు.

‘స్లీప్‌ సెల్ఫీ’ కూడా బాగా పాపులర్‌ అయింది. రాత్రి నిద్రపోయే ముందు సెల్ఫీ తీసుకోవడమన్నమాట! బాతులాగా మూతి ముడిచి తీసుకునే సెల్ఫీలు ‘డక్‌ ఫేస్‌ సెల్ఫీ’లుగా పాపులర్‌ అయ్యాయి.

స్టైల్స్‌ విషయాన్ని పక్కన పెడితే, ఫోన్‌లలో ‘రేంజ్‌’లు ఉన్నట్లే సెల్ఫీలలో కూడా ఉన్నాయి. సెల్ఫీలలో ఇప్పుడు బాగా నడుస్తున్న ట్రెండ్‌ 0.5 లేదా అల్ట్రావైడ్‌ సెల్ఫీ ‘ఇదేమన్నా చిన్నాచితకా సెల్ఫీ అనుకుంటున్నావా ఏంటీ, అల్ట్రావైడ్‌ సెల్ఫీ’ అనే మాటలు యూత్‌ నోటి నుంచి తరచుగా వినబడుతున్నాయి.

‘ఈ అల్ట్రావైడ్‌ సెల్ఫీల ప్రత్యేకత ఏమిటి?’ అనే ప్రశ్నకు జవాబు చెప్పాలంటే...
సాధారణ సెల్ఫీలతో పోల్చితే భిన్నంగా కనిపిస్తాయి, నుదురు, గోళ్లు, షూస్, మేకప్‌... మొదలైనవి హైలెట్‌ అవుతాయి. కొన్నిసార్లు కామిక్‌ లుక్‌తో కనిపిస్తాం. వీటిని బ్యాక్‌కెమెరా నుంచి మాత్రమే తీసుకునే వీలు ఉండడం వల్ల ‘ఇలా వస్తుంది’ ‘అలా వస్తుంది’ అని ఊహించడానికి లేదు. ఫైనల్‌ ఔట్‌పుట్‌ ఏమిటో మనకు తెలియదు!

2019లో ఐఫోన్‌11, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌10లో 0.5 సెల్ఫీలు ‘మేము ఉన్నాం’ అంటూ పరిచయం అయ్యాయి. అప్పట్లో సౌత్‌ ఫ్లోరిడాకు చెందిన ట్విట్టర్‌ యూజర్‌ జెర్మీ ఒకే అరటిపండుకు చెందిన రెండు ఫోటోలను పోస్ట్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

లెఫ్ట్‌ ఫోటో నార్మల్‌ కెమెరాతో తీసింది. రైట్‌ ఫోటో అల్ట్రావైడ్‌ కెమెరాతో తీసింది. రెండో ఫోటోలోని అరటిపండు ఉన్న సైజు కంటే పెద్దగా, చిత్రంగా కనిపిస్తుంది. అలా ‘వైడ్‌ యాంగిల్‌ ఈజ్‌ క్రేజీ’ అనుకోవడానికి అప్పుడే బీజాలు పడ్డాయి. ఈ సంవత్సరం ఆ క్రేజ్‌ ట్రెండ్‌గా మారింది.

దిల్లీకి చెంది శ్రావ్య ఇంజినీరింగ్‌ చదువుతోంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ నిండా బోలెడు 0.5 సెల్ఫీలు ఉన్నాయి. ఇప్పుడు మిత్రబృందం కూడా తనను అనుసరిస్తోంది.
‘ఇది అల్ట్రావైడ్‌ సెల్ఫీ అని చెప్పుకోవడంలోనే ప్రత్యేకత ఉంది. తీసిన ఫోటో తీసినట్లుగా వస్తే కిక్‌ ఏం ఉంటుంది? మన ఊహకు అందకుండా వచ్చినప్పుడు మజా వస్తుంది’ అంటుంది శ్రావ్య.

ఇప్పటి మాట కాదు
నిజానికి అల్ట్రావైడ్‌ లెన్స్‌ అనేది ఇప్పటి మాట కాదు. 1862లో వీటికి తొలిసారిగా పేటెంట్‌ లభించింది. ల్యాండ్‌స్కేప్, ఆర్కిటెక్చరల్‌ షాట్స్‌ కోసం వీటిని వాడేవారు. స్ట్రీట్‌ఫోటోగ్రఫీలో ఈ లెన్స్‌ను ఎక్కువగా ఉపయోగించేవారు. సెల్ఫీ అనగానే టక్కున గుర్తుకు వస్తుంది హాలీవుడ్‌ సెలిబ్రిటీ... కిమ్‌ కర్దాషియాన్‌. ‘క్వీన్‌ ఆఫ్‌ సెల్ఫీస్‌’గా పేరు తెచ్చుకున్న కిమ్‌ ‘సెల్ఫీస్‌’ పేరుతో ఏకంగా ఒక పుస్తకమే రాసింది.

ఈ కాఫీ టేబుల్‌ బుక్‌లో వివిధ సందర్భాలలో కిమ్‌ తీసుకున్న సెల్ఫీలు ఆకట్టుకుంటాయి. కిమ్‌ కర్దాషియాన్, పారిస్‌ హిల్టన్‌లాంటి సెలిబ్రిటీలు జీరో పాయింట్‌ ఫైవ్‌ సెల్ఫీలకు యూత్‌లో క్రేజ్‌ తీసుకువచ్చారు. ‘కొత్త రకం సెల్ఫీలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి’ అంటుంది కిమ్‌ కర్దాషియాన్‌. అది ఆమె మాటే కాదు... కొత్తతరం అనుసరిస్తున్న బాట కూడా! 

చదవండి: Cyber Crime Prevention Tips: టీమ్‌వ్యూమర్‌, ఎనీడెస్క్‌ వంటివి డౌన్‌లోడ్‌ చేయమంటారు? ఓటీపీ చెబితే అంతే సంగతులు!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top