తినదగిన ప్లేట్లు! ఔను! భోజనం చేసి పారేయకుండా.. | Sakshi
Sakshi News home page

తినదగిన ప్లేట్లు! ఔను! భోజనం చేసి పారేయకుండా..

Published Tue, Oct 3 2023 4:05 PM

The Worlds Only Edible Biodegradable Plates Made From Wheat Bran - Sakshi

ప్లాస్టిక్‌ రహిత దేశంగా మార్చేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఎంతోమంది ఎన్నో రకాల పర్యావరణ హితకరమైన ప్లేట్లను తీసుకొచ్చారు. చెట్ల నారతో చేసేవి, ఆకులతోటి, లేదా కాగితాలు తదితర విభిన్నమైనవి వచ్చాయి. కానీ ఇక్కడొక వ్యక్తి ప్లేట్లలో తిని పడేయక్కుండే హాయిగా తినేసే ప్లేట్లను తయారు చేశాడు. తినేయొచ్చు లేదా వేరే విధంగానైనా ఉపయోగించుకోవచ్చు అలా రూపొం​దించాడు. ఇవి ప్రపంచంలోనే ఏకైక తినదగిన బయోడిగ్రేడబుల్‌ ప్లేటు కూడా. 

వివరాల్లోకెళ్తే..కేరళకు చెందిన విజయ్‌కుమార్‌ బాలకృష్ణన్‌ ఈ వినూత్న ప్లేట్లను ఆవిష్కరించాడు. కట్లరీ బ్రాండ్‌తో తూషాన్‌ అనే కంపెనీని స్థాపించి వీటిని ఉత్పత్తి చేస్తున్నాడు. నిజానికి బాలకృష్ణన్‌ కుటుంబం మారిషస్‌లో ఉండేది. ఆయన అక్కడ  సైన్యం, భీమా, బ్యాకింగ్‌ తదితర రంగాలలో విజయవంతంగా పని చేసి స్వచ్ఛంద పదవివిరమణ చేసిన 46 ఏళ్ల వ్యక్తి. 2013లో మారిషస్‌ నుంచి తిరిగి స్వదేశానికి రాగానే ఇల్లు కట్టుకుని స్థిరపడాలని అనుకున్నాడు. అదికూడా వంద శాతం సౌరశక్తితో నిర్మించాడు. అతను ఇల్లుని కూడా పర్యావరణ హితంగానే నిర్మించుకున్నాడు. వారి ఇంట్లో కూడా వ్యర్థపదార్థాల నుంచి ఉత్పత్తి చేసే బయోగ్యాస్‌ను ఉపయోగిస్తారు.

బాలకృష్ణన్‌ మారిషస్‌ నుంచి కేరళలోని ఎర్నాకులంకి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడే ఈ పర్యావరణపై మరింతగా దృష్టిసారించాడని చెప్పాలి. ఎందుకంటే మారిషస్‌ చాలా పరిశుభ్రమైన ప్రదేశం. రహదారిపై ఒక్క కాగితం ముక్క, ప్లాస్టిక్‌ బాటిళ్లు కనుగొనడం అసాధ్యం. అంతలా పరిశుభ్రంగా ఉంటుంది. పరిశుభ్రత ప‍ట్ల మారిషస్‌లో ఉన్న నిబద్ధత బాలకృష్ణన్‌ మనుసులో బలంగా నాటుకుపోయింది. అదే ఈ వినూత్న బయోడిగ్రేడబుల్‌ ప్లేట్లు ఆవిష్కరణకి నాంది పలికేలా చేసింది. ఆయన దుబాయ్‌లో ఓ పార్టీకి హాజరయ్యారు. అక్కడ అతనికి తినదగిన బయోడిగ్రేడబుల్‌ ప్లేట్లలో ఆహారాన్ని అందించారు. ఈ ఆవిష్కరణతో ఆశ్చర్యపోయిన ఆయన ఒక పోలిష్‌ కంపెనీ అలాంటి ప్లేట్‌లను తయారు చేసినట్లు తెలుసుకున్నాడు. దీన్నే భారతదేశానికి తీసుకురావాలనే కోరికతో పోలిష్‌ కంపెనీని కూడా సంప్రదించాడు.

కానీ వారు అందుకు అంగీకరించలేదు. అయినా నిరాశ చెందక బాలకృష్ణనే స్వయంగా వరి ఊక, వరిపొట్టు, మొక్కజొన్న వ్యర్థాలు తదితర వ్యవసాయ వ్యర్థాలపై పరిశోధనలు చేయడం ప్రారంభించాడు. ఈ తపనే కొచ్చిలోని ఒక సైన్సు ఎగ్జిబిషన్‌కు దారితీసింది. ఆ ఎగ్జిబిషన్‌లోని ఒక స్టాల్‌లో సీఎస్‌ఐఆర్‌(కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌) కొబ్బరిపీచుతో తయారుచేసిన ప్టేట్‌లను ఉంచడం గమనించాడు. ఇది పరిశోధనా ప్రయోజనాల కోసమే గానీ వాణిజ్యీకరణ కోసం ఉద్దేశించింది కాదని ఆ సీఎస్‌ఐఆర్‌ బృందంతో జరిపిన చర్చల్లో తెలుసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ను సంప్రదించి తన ఆసక్తిని వివరించారు. ఆ తర్వాత ఆ సీఎస్‌ఐఆర్‌ బృందంతో సమావేశం జరిగింది.

అది బాలకృష్ణన్‌కి సహకరించడానికి అంగీకరించింది. ఐతే వారి పరిశోధనలకు నిధుల సమస్య ఎదురైంది. ముందుగా బాలకృష్ణన్‌ ప్రాజెక్టులో రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టారు. ప్లేట్ల తయారీకి యంత్రాలు లేకపోవడంతో అదనంగా మరో పదిలక్షలు పెట్టుబడి పెట్టారు. అంకితభావం, నిబద్ధతలకు ప్రతిఫలంగా సరిగ్గా 2018లో గోధుమ ఊకతో తయారు చేసిన ప్టేట్‌లు ల్యాబ్‌లో ఆవిర్భవించాయి. దీంతో శాస్త్రవేత్తలు భారీ మొత్తంలో ఉత్పత్తి చేసేందుకు ముందుకు వచ్చారు. అందుకు అవసరమైన డాక్యుమెంట్లు, లైసెన్సులు సంపాదించారు బాలకృష్ణన్‌. దీంతో 2021లో పూర్తి స్థాయిలో ఉత్పత్తులు మార్కెట్‌కు వచ్చాయి. అదే అంగమలీకి చెందిన వీఐఆర్‌ నేచురల్స్‌ పుట్టుకకు దారితీసింది. కట్లర్‌ తూషన్‌ బ్రాండ్‌తో ఈ ప్లేట్‌లను ఉత్పత్తి చేశారు. నిజానికి తూషన్‌ అంటే మళయాళంలో అరటి ఆకు అని అర్థం.

ప్రైవేట్‌ సమావేశాలు, పర్యావరణ స్ప్రుహతో కూడిన వివాహాలు, కార్పొరేట్‌ ఈవెంట్‌లను కలిగిన వివిధ రకాల భోజన సెట్టింగ్‌లో ఈ ప్లేట్‌లో హవా ఊపందుకోవడం ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ తూషాన్‌ కంపెనీ రోజూకి వెయ్యి పెద్ద ప్లేట్లు, మూడు వేల చిన్న ప్లేట్లు ఉత్పత్తి చేస్తుంది. తమ ఉత్పత్తికి తగ్గ డి​మాండ్‌ ఉండపోయినా స్టాక్‌ నిర్వహణకు హామీ ఇచ్చేంత స్థిరంగా ఉందని ధీమాగా చెబుతున్నారు బాలకృష్ణన్‌. అలాగే కుమరకోమ్‌లో జరిగిన జీ20 ఈవెంట్‌ వంటి వాటికి ఊహించని రేంజ్‌లో ఆర్డర్‌ వచ్చిన సందర్భాల గురించి చెప్పుకొచ్చారు. ఆ ప్రోగామ్‌ కోసం దాదాపు 3వేల ప్లేట్‌లను సరఫరా చేసే ఆర్డర్‌ వచ్చిందని చెప్పారు. తూషన్‌  కట్లరీ బ్రాండ్‌ ఉత్పత్తులు జీరో శాతం వ్యర్థాల ఉత్పత్తిగా పేరుగాంచాయి.

ఈ ప్లేట్లు ప్రయోజనం..
ఈ ప్లేట్లలో భోజనం చేసి పడేయక్కర్లేదు. మళ్లీ వాడుకోవచ్చు లేదా వాటిని తినొచ్చే లేదా ఆవులు లేదా ఆక్వా ఫుడ్‌గా కూడా పెట్టొచొచ్చు. అలాగే పర్యావరణంలో ఈజీగా డికంపోజ్‌ అవుతుంది. అన్ని రకాలుగా ఉపయోగపడేలా రూపొందిచిన ప్లేట్లు. 

వరించిన అవార్డులు
ఈ ఆవిష్కరణకు గానూ బాలకృష్ణన్‌ రాఫ్తార్‌ ఏబీఐ జాతీయ అవార్డు, 2022లో ఎఫ్‌ఐసీసీఐ అగ్రి స్టార్టప్ సదస్సు స్పెషల్ జ్యూరీ అవార్డు, ప్రతిష్టాత్మకమైన క్లైమథాన్‌ 2022 వంటి ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు దక్కాయి. ఇక తూషన్‌ ఉత్పత్తుల్లో పెద్ద ప్లేట్ల ధర ఒక్కొక్కటి రూ. 10, చిన్నవి ఒక్కో ముక్క రూ.5 అదనంగా, బియ్యం పిండితో తయారు చేసిన 100 స్ట్రాస్‌ల సెట్ రూ 150కి అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు బాలకృష్ణన్‌. అంతేగాదు ప్లాస్టిక్‌లను దశలవారీగా నిర్మూలించి మన పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రజలందరీ సామాజిక బాధ్యత అని గ్రహించడం చాలా ముఖ్యం అని అన్నారు. ఇలాంటి వినూత్న ఉత్పత్తులు ప్రజలు స్వీకరించాలే ప్రోత్సహం ఉండాలన్నారు. ప్రస్తుతం తమ ఉత్పత్తులకు మంచి బ్రాండ్‌గా ఉనికి చాటుకున్నప్పటికి లాభాలబాట పట్టాల్సి ఉందన్నారు. చాలా ఆటుపోట్ల మధ్య ఈ బ్రాండ్‌ తన ఉనికిని చాటుకుంటూ ముందుకు వెళ్తోంది.

ఇంకా ఒకరకంగా చెప్పాలంటే  ఆస్ట్రేలియా, కెనడా, హంగేరీ, మెక్సికో వంటి దేశాల్లో ఈ పర్యావరణ అనుకూల ఉత్పత్తులకు మంచి  ప్రజాదరణ ఉండటం విశేషం. కాగా, ఈ ఉత్పత్తుల ఆవిష్కర్త బాలకృష్ణన్‌ మాట్లాడుతూ..తాను ఇది ప్రారంభించాలనుకున్నప్పుడూ కుటుంబ సభ్యలెవరూ మద్దతివ్వలేదని, ఒక్క తన భార్యే సహకారం అందించారని చెప్పారు. అందరూ రిస్క్‌ అన్నట్లు పెదవి విరిచారు. ఈ రోజు అందరిచే ప్రసంశలందుకునేలా మంచి పర్యావరణ హిత బ్రాండ్‌ని ఉత్పత్తి చేశాననే ఆనందం దక్కింది. ఇక మరిన్ని లాభాలు అందుకునేలా వ్యాపారాన్నిబాగా ముందకు తీసుకువెళ్లే దిశగా అడుగులు వేయడమే తన లక్ష్యం అని  బాలకృష్ణన్‌ సగర్వంగా చెప్పారు. 

(చదవండి: నవజాత శిశువులకు తేనె ఇవ్వకూడదా? సోనమ్‌ కపూర్ సైతం..)

Advertisement

తప్పక చదవండి

Advertisement